హార్సిలీ హిల్స్

హార్సిలీ హిల్స్ చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గర ఉన్న ఒక విహారస్థలం. ఏనుగు మల్లమ్మ కొండ అనేది దీని అసలు పేరు.[1] ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రసిద్ధ వేసవి విడిది. ఆంధ్రా ఊటీ అని దీనికి పేరు.

Horsley Hills
హార్సిలీ కొండలు
town
Horsley Hills
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం, India
భౌగోళికాంశాలు: 13.66°N 78.40°E / 13.66; 78.40
Country India
Stateఆంధ్ర ప్రదేశ్
ఎత్తు m ( ft)
Languages
  OfficialTelugu
సమయప్రాంతంIST (UTC+5:30)

భౌగోళికం

142 ఏళ్ళ నాటి యూకలిప్టస్ చెట్టు

తూర్పు కనుమల లోని దక్షిణ భాగపు కొండల వరుసే ఇక్కడి కొండలు. హార్సిలీ హిల్స్ సముద్ర మట్టానికి 1,314 మీ. (4312 అ.) ఎత్తులో ఉంది. ఇది బెంగళూరు నుండి 160 కి.మీ., తిరుపతి నుండి 140 కి.మీ. దూరంలో ఉంది. చలికాలంలో 3 డిగ్రీల సెంటీగ్రేడు నుండి మండు వేసవిలో 32 డిగ్రీల సెంటీ గ్రేడు వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకెల్లా ఎత్తైన ప్రదేశం హార్సిలీ హిల్స్ లోనే ఉంది.

చరిత్ర

హార్సిలీ హిల్స్‌కు పూర్వనామం ఏనుగు మల్లమ్మకొండ. పూర్వం మల్లమ్మ అనే భక్తురాలు ఈ కొండపై తపస్సు చేశారట. ఇక్కడి అడవిలో సంచరించే ఓ ఏనుగు ఈమెకు పండ్లు తెచ్చి సంరక్షించిందట. అలా ఈ ప్రాంతం ఏనుగు మల్లమ్మ కొండగా పేరొందింది. కొండపై ఏనుగు మల్లమ్మ ఆలయం కూడా ఉంది. కొండపై ఉన్న అటవీ ప్రాంగణంలో 1859 సంవత్సరంలో నాటిందని చెప్పే నీలగిరి వృక్షం ఏపుగా ఎదిగి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖలు ఈ మానుకు 1995లో మహావృక్ష పురస్కారం ఇవ్వడం మరో విశేషం.

డబ్ల్యు.డి.హార్సిలీ అనే బ్రిటిష్‌ అధికారి మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఇక్కడికి సమీపంలో ఉన్న ఓ కొండపైకి విహారినికి వెళ్తుండేవారు. అక్కడి పచ్చదనం.. చల్లదనం.. ఆయన్ను ఆహ్లాదపరిచేవి. తర్వాతి కాలంలో హార్సిలీ కడప జిల్లా పాలనాధికారిగా 1863 - 67 మధ్య కాలంలో నియమితులయ్యారు. వెంటనే మదనపల్లె సమీపంలోని కొండపై 1863 లో వేసవి విడిదిగా ఇక్కడ ఒక ఇంటిని నిర్మించాడు. ఒక బంగ్లాను నిర్మించారు. ఆ ప్రాంతాన్ని వేసవి విడిదిగా తీర్చిదిద్దారు. నాటి నుంచి ఆ కొండ ప్రాంతం హార్సిలీ హిల్స్‌గా ప్రాచుర్యం పొందింది. హార్సిలీ నిర్మించిన భవంతిని ఫారెస్ట్‌ బంగ్లా అని పిలుస్తారు. తర్వాతి కాలంలో మరో కార్యాలయాన్ని కూడా ఇక్కడ నిర్మించారు. నేటికీ ఇవి నివాస యోగ్యంగా ఉన్నాయి.

హార్సిలీ కొండపై పర్యాటకులకు కావాల్సినంత వినోదం లభిస్తుంది. అటవీ ప్రాంగణంలో మినీ జంతు ప్రదర్శనశాల, మొసళ్ల పార్కు, చేపల ప్రదర్శనశాల పిన్నలనూ, పెద్దలనూ అలరిస్తాయి. చిన్నారులు ఆడుకునేందుకు ఏర్పాట్లూ ఉన్నాయిక్కడ. వేసవి రాత్రుల్లో ఎయిర్‌ కండిషన్‌ గదిలో ఉన్నట్టుగా ఉంటుందీ ప్రాంతం. చందనం చెట్లు, శీకాయ వృక్షాలు, యూకలిప్టస్‌ చెట్ల మీదుగా వీచే నిర్మలమైన గాలిని గుండె నిండా పీల్చుకోవాలనిపిస్తుంది. చెవుల వరకూ దుప్పటి కప్పుకొని నిద్దురోయేలా చేస్తుంది. అందుకే హార్సిలీ హిల్స్‌కు ఏడాది పొడుగునా పర్యాటకులు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వేసవి వినోదాన్ని ఆస్వాదిస్తుంటారు

ఎలా వెళ్లాలి?

హార్సిలీ హిల్స్‌ మదనపల్లె నుంచి 29 కి.మీ, తిరుపతి నుంచి 130 కి.మీ దూరంలో ఉంటుంది. మదనపల్లె నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్‌ ట్యాక్సీల్లో కూడా వెళ్లొచ్చు. కొండపై పర్యాటక, అటవీశాఖకు చెందిన, ప్రైవేట్‌ అతిథి గృహాలు అద్దెకు లభిస్తాయి.

చూడదగ్గ స్థలాలు

ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సౌందర్యం ఇక్కడి ప్రత్యేకతలు. హార్సిలీ హిల్స్ కు వెళ్ళే కొండదారి ఎంతో అందంగా ఉంటుంది. రెండు వైపులా నీలగిరి (యూకలిప్టస్) వంటి అనేక జాతుల చెట్లతో కళ్ళకింపుగా ఉంటుంది. జింకలు, చిరుతపులులవంటి వన్యమృగాలు కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తుంటాయి. ఇక్కడ చూడదగ్గ ఇతర ప్రదేశాలు:

  • 142 సంవత్సరాల వయసు కలిగిన యూకలిప్టస్ చెట్టు ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి.
  • వన్యమృగ కేంద్రము (zoo park).
  • గవర్నర్ బంగ్లా
  • జిడ్డు కృష్ణమూర్తి నెలకొల్పిన రిషివ్యాలీ విద్యాలయము ఉంది.

బొమ్మల కొలువు

మూలాలు

  1. "కొండాకోనల్లో ... వేసవి విడిదుల్లో...!". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 12 April 2017. Retrieved 12 April 2017.

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.