స్వర్ణముఖి నది
నాగావళి ఉపనదైన సువర్ణముఖి నదిని గురించి ఇక్కడ చూడండి.
స్వర్ణముఖి నది దక్షిణ భారతదేశంలో ప్రవహించే ఒక నది. చిత్తూరు జిల్లాలో ప్రముఖ నది. ప్రముఖ శైవ క్షేత్రమయిన శ్రీకాళహస్తి ఈ నది ఒడ్డున నెలకొని ఉంది. తిరుపతి-చంద్రగిరి మధ్య తొండవాడ సమీప కొండప్రాంతం ఈ నది జన్మస్థానం. ధూర్జటి తన రచనల్లో దీన్ని మొగలేరు అని ప్రస్తావించాడు. ఈ నది ఒడ్డున శ్రీకాళహస్తీశ్వరాలయం, తొండవాడ వద్ద ఉన్న అగస్తేశ్వరాలయం, యోగి మల్లవరం వద్దనున్న పరాశరేశ్వరాలయం, గుడిమల్లం దగ్గరున్న పరశురామేశ్వరాలయం, గాజులమండ్యం దగ్గరున్న మూలస్థానేశ్వరాలయం ఉన్నాయి. ఇది జీవనది కాదు. సాధారణంగా అక్టోబరు నుంచి డిసెంబరు దాకా ప్రవహిస్తుంది.
ఈ నది భీమ, కల్యాణి నదులలో సంగమించి, తొండవాడలో త్రివేణి సంగమంగా మారి, ఉత్తరవాహినిగా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో విలీనం అవుతుంది.
పురాణ గాధ
పూర్వం అగస్త్య మహర్షి బ్రహ్మను గురించి తపస్సుచేసి ఈ నదిని దేవలోకం నుంచి క్రిందికి తెప్పించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తున్నది. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించేటపుడు ఆలయ నిర్మాణంలో సహకరించిన కూలీలు రోజూ సాయంత్రం నదిలో స్నానం చేసి ఇసుక వారి చేతుల్లోకి తీసుకుంటే అది వారికి కష్టానికి తగిన ప్రతిఫలం విలువచేసేంత బంగారంగా మారేది. అందుకే ఈ నదికి స్వర్ణముఖి అని పేరు వచ్చింది.
జన్మస్థానం
స్వర్ణముఖి నది పాకాల సమాంలో ఉన్న పాలకొండ లలో ఆదినాపల్లి వద్ద చిన్నవాగులా పుట్టినది. ఇది చంద్రగిరి ఎగువన భీమానదితో సంగమించి నది అయింది. ఆతరువాత దిగువన ఉన్న కల్యాణీనదితో కలిసి పెద్దనదిగా మారింది. చంద్రగిరి వద్ద ఉన్న చంద్రనగము మరియు హేమనగములలో ఇది హేమనగాన్ని ఒరుసుకుంటూ ప్రవహించడం వలన ఇది సార్థక నామాధేయురాలైంది. వాస్తవానికి స్వర్ణముఖరీ ఇసుక వెండిలా తెల్లగానూ అలాగే సువర్ణంలో బంగారు వర్ణంతోనూ ఉంటుంది. తరువాత ఈ నది కొంతదూరం ఉత్తరంగా ప్రవహించి మరికొంత దూరం ఈశాన్యంగా ప్రవహిస్తు శేషాచల కొండలను స్పృజించి కల్యాణీ, భిమానదులతో సంగమించి కపిలతీర్ధం, అలివేలుమంగాపురం, శ్రీకాళహస్తి, నెల్లూరు మీదుగా ప్రవహించి నూడుపేట సమీపంలో ఉన్న సిద్ధవరం వద్ద తూర్పుసముద్రంలో సంగమిస్తుంది. స్వర్ణముఖీ నదీ తీరంలో అగశ్వేరాలయం, వరేశ్వరాలయం, పద్మావతీ దేవి ఆలయం, పరశురామేశ్వరాలయం ఉన్నాయి. ఈ నది మొత్తంగా దాదాపు 100 మైళ్ళు ప్రయాణిస్తుంది.
పురాణకథనం
హిమాలయాలలో శివపార్వతుల కల్యాణానికి కదిలి వచ్చిన దేవ, ౠషి, మానవ గణాల భారంతో భూమి ఒక వైపుకు వంగిపోయిన సందర్భంలో శివుడు అగస్త్యమహామునిని పిలిచి విద్యపర్వతాలకు ఆవలివైపు వెళ్ళమని ఆదేశించాడు. అగస్త్యుడు శివుని ఆదేశాన్ని అనుసరించి భారతదేశ దక్షిణప్రాంతానికి తరలి వెళ్ళాడు. పోతూ పోతూ సూర్యగమనానికి అడ్డుతగులుతూ పెరుగుతున్న విద్యపర్వతం వద్ద తాను తిరిగి వచ్చే వరకు పెరగకూడదని వరం స్వీకరించాడు. అందువలన విద్యపర్వతాల పెఉగుదల ఆగిపోయింది. అగస్త్యుడు తిరిగి ఉత్తరదిశకు వెళ్ళలేదు. ఇలా విదర్వత గర్వభంగం చేసాడు. దక్షిణ దిశకు వచ్చిన అగస్త్యుడు కృష్ణానది, జ్యోతి సిద్ధవటం, శ్రీశైలం, ద్రాక్షారామం మొదలైన పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి చివరకు కాళహస్థికి చేరుకున్నాడు. అక్కడ స్నానపానాలకు, జపతపాలకు తగిన నీరు లభించని కారణంగా కాళహస్థికి నాలుగు యోజనముల దూరములో పడమరదొశగా ఉన్న పర్వతశ్రేణులలో తపసు చేయగా బ్రహ్మాదులు దేవగణములతో శివుని దర్శించుకుని అగస్త్యుని కోరిక తెలిపారు. శివునుడు ఆప్రదేశంలో ఒక నదీమతల్లి ఆవిర్భావానికి అనుగ్రహించగా ఆకాశం నుండి గంగాభవాని స్వర్ణ కాంతులతో భూమిమీదకు దిగివచ్చింది. అందువలన ఈ నది స్వర్ణముఖి అని నామదేయురాలైంది.
ఇతర విశేషాలు
సువర్ణముఖి నది అగస్త్యుని తపోభంగం కలిగించగా అగద్త్యుడు స్వర్ణముఖినీ నదిని శపించాడు. అందువలన నదిలో నీరు ఇంకిపోయింది. అయినప్పటికీ అంతర్వాహినిగా ప్రవహిస్తున్న కారణంగా నదీసమీపంలో ఉన్న బావులలో నీరు ఇంకిపోదు. నదీతీరంలో విపరీతంగా మొగలి పొదలు పెరిగిన కారణంగా స్వర్ణముఖీ నదికి " మొగలేరు " అనే మరొకపేరు కూడా వచ్చింది. ఈ నదికి పలు వాగులు, వంకలు, ఏరులూ జలాలను ఆందిస్తున్నాయి. వాటిలో కల్యాణీ, భీమానదులు ప్రధానమైనవి. కల్యాణీ నదీతీరంలో శ్రీనివాసమంగాపురంలో కల్యాణశ్రీనివాసుడు వెలసి పూజలందుకుంటున్నాడు.
మూలాలు
- శ్రీకాళహస్తి దేవస్థానం వారి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆహ్వానపత్రిక నుండి సేకరించింది.
| Wikimedia Commons has media related to Swarnamukhi. |