స్వర్ణకమలం

స్వర్ణకమలం కె. విశ్వనాథ్ దర్శకత్వంలో 1988లో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా. వెంకటేష్, భానుప్రియ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. చిత్రకారుడైన యువకుడు తన పొరుగింటిలో ఉండే వృద్ధబ్రాహ్మణ విద్వాంసుని కుమార్తెలోని నాట్యకళా కౌశలం గుర్తించి ఆమెను ప్రోత్సహించి ఉన్నత శిఖరాలకు చేరేలా చేయడం కథాంశం. ఇళయరాజా స్వరాలు సమకూర్చిన ఈ చిత్ర సంగీతం శ్రోతల ఆదరణ పొందింది. ఈ సినిమా మంచి విజయం సాధించి వెంకటేష్ కు నంది బహుమతిని తెచ్చింది.

స్వర్ణకమలం
దర్శకత్వంకె.విశ్వనాధ్
నిర్మాతసి. హెచ్. వి. అప్పారావు,
కె. ఎస్. రామారావు (సమర్పణ)
రచనకె. విశ్వనాథ్ (స్క్రీన్ ప్లే/కథ),
తోటపల్లి సాయినాథ్ (మాటలు)
నటులువెంకటేష్ ,
భానుప్రియ
సంగీతంఇళయరాజా
ఛాయాగ్రహణంలోక్ సింగ్
కూర్పుజి. జి. కృష్ణారావు
నిర్మాణ సంస్థ
భాను ఆర్ట్ క్రియేషన్స్
విడుదల
జూలై 15, 1988 (1988-07-15)
నిడివి
143 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ

మీనాక్షి (భానుప్రియ), సావిత్రి (దేవీ లలిత) కూచిపూడి నాట్యంలో నిష్ణాతులైన శేషేంద్ర శర్మ యొక్క ఇద్దరు కూతుర్లు. ఆయన నాట్యంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన వాడైనా పెద్దగా కలిగిన కుటుంబం కాకపోవడంతో తన ఇద్దరు కూతుళ్ళకూ అందరిలాగే చదువు చెప్పించలేక పోతాడు. కానీ సావిత్రికి కర్ణాటక సంగీతం లో, మీనాక్షికి కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇస్తాడు. సావిత్రి తనకు తెలిసిన విద్యను గౌరవప్రదంగా ఎంచి దాన్నే జీవనాధారంగా భావిస్తుంటుంది. కానీ రెండవ కూతురు మీనాక్షి మాత్రం నాట్యం లాంటి కళలు కడుపు నింపవనే భావన కలిగి ఉంటుంది. సాధారణంగా అందరూ అభిమానించే విలాసవంతమైన జీవనం గడపాలని కోరుకుంటుంది. ఇవన్నీ కేవలం ఆమె అక్కతోనే చెప్పుకుంటుంది.

ఇదిలా ఉండగా వారి ఇంటి పక్కన ఇంట్లోకి చంద్రశేఖర్ (వెంకటేష్) అనే చిత్రకారుడు అద్దెకు దిగుతాడు. ఆమెలోని నాట్యాన్ని చూసి అభిమానిస్తాడు. కానీ ఆమె అయిష్టతను గమనించి బాధపడతాడు. వారి కుటుంబానికి చిన్న చిన్న పనుల్లో సహాయపడుతూ వారికి చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆమె చేత ఎలాగైనా నాట్య ప్రదర్శన ఇప్పించాలని ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేయిస్తాడు. అయితే ఆమె అయిష్టంగా అందుకు ఒప్పుకొని నాట్యం మధ్యలో సగంలో నిలిపివేయడంతో ఆమె తండ్రి నాట్యాన్ని కొనసాగిస్తాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆయన నాట్యం చేస్తుండగానే మరణిస్తాడు. తన తండ్రి మరణానికి తనే కారణమయ్యానని బాధ పడుతుంటుంది. ఆమెకు అమెరికాకు వెళ్ళే ఆసక్తిని గమనించిన చంద్రశేఖర్ ఆమెను కూచిపూడి నృత్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించేలా ప్రయత్నించి భారతీయ నృత్యంలో ప్రసిద్ధురాలైన ఒక అమెరికా నర్తకి సాయంతో అక్కడికి వెళ్ళేలా ప్రోత్సహిస్తాడు. అమెరికా వెళ్ళడానికి ఎయిర్‌పోర్ట్ దాకా వెళ్ళిన ఆమె, చంద్రశేఖర్ కు తనమీద ఉన్న ప్రేమను అర్థం చేసుకుని తిరిగి వచ్చేస్తుంది. ఇద్దరూ కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

తారాగణం

పాటలు

ఈ సినిమాలో పాటలు జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో చిత్రీకరించారు.[1] శృతిలయలు, స్వాతికిరణం, సూత్రధారులు మొదలైన సినిమాలకు నృత్య దర్శకత్వం వహించిన కె. వి. సత్యనారాయణ ఈ సినిమాలో పాటలకు నృత్యాన్ని సమకూర్చాడు.[2]

ఈ చిత్రం లోని అన్నిపాటలకు సంగీతం అందించినవారు: ఇళయరాజా.

పాటలు
సంఖ్య. పాటసాహిత్యంగానం నిడివి
1. "అందెల రవమిది పదములదా"  సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి  
2. "ఆకాశంలో ఆశల హరివిల్లు:" ([3])సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్. జానకి  
3. "ఆత్మాత్వం"      
4. "ఘల్లు ఘల్లు ఘల్లు"  సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల  
5. "కొత్తగా రెక్కలొచ్చెనా"  సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి  
6. "కొలువై ఉన్నాడే దేవదేవుడు"  సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల  
7. "చేరి యశోదకు"  అన్నమయ్యపి. సుశీల  
8. "నటరాజనే"   పి. సుశీల  
9. "శివపూజకు చివురించిన"  సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల  

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.