సూళ్లూరుపేట

సూళ్ళూరుపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యొక్క శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక మండలము మరియు పట్టణము. పిన్ కోడ్ నం. 524121.

చరిత్ర

చెన్నై నుండి 83 కి.మీ.ల దూరములోనూ, నెల్లూరుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, చక్కని రైలు మరియు రోడ్డు రవాణా సౌకర్యములు ఉన్నందువలన సూళ్లూరుపేటను కొన్నిసార్లు చెన్నై సబర్బ్ గా పరిగణిస్తారు. ఇక్కడ ఉద్యోగపరంగా చాలామంది తమిళులు నివాసం ఉంటున్నారు. అధికశాతం జనాభాకు తమిళం తెలుసు.

చెంగాళమ్మ గుడి

సూళ్ళూరుపేటచెంగాళమ్మ గుడి

ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన చెంగాళమ్మ గుడి ఉంది. తలపై నాగపడగ కలిగి ఎనిమిది చేతులతో ఉండే అమ్మవారు బహుళ ప్రసిద్ధి కలిగిన అమ్మవారు. స్థల పురాణం ప్రకారం కొన్ని వేల ఏళ్ళ పూర్వం ఈ ఊరిని శుభగిరి అని పిలిచేవారు. ఊరికి పశ్చిమంగా కాళంగి నది ప్రవహిస్తుండేది. కొందరు పశువుల కాపరులు ఈత కొరకు దిగగా అందులో ఒకడు సుళ్ళు తిగుతున్న నీటి ప్రవాహం లోనికి లాక్కుని పోతుండగా అసరాగా చేతులకు తగిలిన రాతిని పట్టుకోగా అది అతడిని ఆ సుళ్ళ ప్రవాహం నుండి బయట పడవేయగా అతడు తనతో పాటుగా ఆ రాతిని తీసుకొచ్చి మిగిలిన వారికి చూపి జరిగినది వారికి చెప్పాడు. చీకటి పడటంతో వాళ్ళు పొడవుగా ఉన్న ఆ శిలను అక్కడే పడుకోబెట్టి వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం వచ్చి చూడగా పడుకోబెట్టిన రాయి దక్షిణాభిముఖంగా నిలబెట్టి ఉండటం మరియు అది ఒక స్త్రీమూర్తి విగ్రహం అని మహిషాసురమర్ధనిలా ఉండటం గమనించారు. దానిని ఊరి పొరిమేరలలోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నించగా ఎంతకూ కదలకపోవటం, ఆ రాత్రి ఊరి పెద్దకు కలలో కనిపించి తనను కదల్చవద్దని చెప్పడంతో అక్కడే ఒకపాక వేసి పూజలు చేయడం మొదలెట్టారు. కొంతకాలానికి గుడి నిర్మించిన తరువాత తలుపులు పెట్టేందుకు ప్రయత్నించగా అప్పుడు కలలో కనబడి నా దర్శనానికి ఏ సమయంలో వచ్చినా ఇబ్బంది కలుగకూడదు కనుక తలుపులు పెట్టవద్దని హెచ్చరించినదట. మరునాడు చూడగా తలుపులు చేయడానికి తెచ్చిన చెక్కలపై మొక్కలు మొలిచి కనిపించాయట. అప్పటి నుండి ఆ మొక్కలు ఆ ఆవరణలోనే పెరిగి పెద్దవై ప్రస్తుతం చెంగాళమ్మ వృక్షంగా పిలవడం జరుగుతున్నది. ఈ చెట్టును సంతానం కోరి దర్శించుకొనేవారు అధికం.

సుళ్ళు ఉత్సవం

సుళ్ళూరుపేటకు ఈ పేరు రావడంలో చెంగాళమ్మ గుడి పాత్ర ఉంది. అది ఎలాగంటే చెంగాలమ్మ గుడికి ఉత్సవాలు జరిగినప్పుడు ఒక పెద్ద కర్రకు మేకని కట్టి మూడు సార్లు గాలిలో తిప్పుతారు. సుళ్ళు తిరుగుతున్న నీటిలో దొరికిన దానికి గుర్తుగా ఇలా తిప్పటం జరుగుతున్నది. ఇలా తిప్పడాన్ని "సుళ్ళు ఉత్సవం" అంటారు, అలాగ ఈ ఊరికి సూళ్ళురుపేట అని పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని దర్శించుకొనేందుకు రోజూ 2 వేల మంది వస్తుంటారు.

షార్ యొక్క ప్రతి ప్రయోగానికి ముందు ఇక్కడ రాకెట్ యొక్క చిన్న నమూనాను ఉంచి పూజించడం ఆనవాయితీగా వస్తున్నది. దీనికి ఇస్రో ఛైర్మన్ హాజరవడం జరుగుతుంది.

పీఎస్ఎల్వీ సీ14 విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ సూళ్లూరుపేట చెంగాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. (ఈనాడు23.9.2009).

సూళ్ళూరుపేట రైల్వేస్టేషన్ రోడ్

గ్రామ ప్రముఖులు

ఇతర విశేషాలు

  • సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రము, శ్రీహరికోట ఇక్కడే ఉండటము వలన ఇది నెల్లూరులో చాలా ముఖ్యమైన ప్రదేశమైనది.
  • నేలపట్టు పక్షి సంరక్షణాలయము ఇక్కడికి దగ్గరిలోనే ఉంది.
  • సూళ్ళూరుపేటకు దగ్గరగా పులికాట్ సరస్సు ఉంది.
  • 5వ నంబరు జాతీయ రహదారి బెంగళూర్ నుండి ఒడిస్సా వెళ్లేది సూళ్ళూరుపేట మీదుగా వెళుతుంది.

శాసనసభ నియోజకవర్గం

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.