సూర్య వంశం (సినిమా)
సూర్యవంశం భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో 1998 లో విడుదలైన సినిమా.[1] ఇందులో వెంకటేష్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. 1997 లో తమిళంలో ఇదే పేరుతో వచ్చిన సినిమా తెలుగు సినిమాకు మాతృక. ఇదే సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ కథానాయకుడిగా రీమేక్ చేశారు.
| సూర్య వంశం (1998 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | భీమనేని శ్రీనివాసరావు |
|---|---|
| నిర్మాణం | ఆర్. బి. చౌదరి |
| తారాగణం | వెంకటేష్, మీనా , రాధిక, సంఘవి, ఆనందవర్ధన్ |
| సంగీతం | ఎస్. ఎ. రాజ్‌కుమార్ |
| నిర్మాణ సంస్థ | సూపర్ గుడ్ ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
కథ
హరిశ్చంద్ర ప్రసాద్ (వెంకటేష్) గ్రామానికి పెద్ద, గ్రామంలో అందరి బాగోగులు చూసుకుంటూ అందరి గౌరవాన్ని చూరగొంటూ ఉంటాడు. అదే గ్రామంలో ఉండే సింగరాజు లింగరాజు (ఆనందరాజ్) కి హరిశ్చంద్ర ప్రసాద్ కి మధ్య వైరం ఉంటుంది. గ్రామంలో అతనొక్కడే విరోధి. హరిశ్చంద్ర ప్రసాద్ ది పెద్ద కుటుంబం. భార్య వసుంధర (రాధిక), కొడుకులు రవి ప్రసాద్, దివాకర్ ప్రసాద్, భాను ప్రసాద్, కూతురు శాంతి, ఇద్దరు కోడళ్ళు, ఇద్దరు మనవరాళ్ళు ఆ కుటుంబంలో సభ్యులు. హరిశ్చంద్ర ప్రసాద్ అందరిమీదా అభిమానంతో ఉన్నా చివరి కొడుకైన భానుప్రసాద్ (వెంకటేష్) అంటే మాత్రం అతను బాగా చదువుకోలేదని అయిష్టంగా ఉంటాడు. కానీ భానుప్రసాద్ మాత్రం తండ్రిని మనసులోనే ఆరాధిస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మతో తప్ప ఎవ్వరితో పెద్ద సంబంధాలు లేకపోయినా ఇంట్లో పనులు చూసుకుంటూ ఉంటాడు.
స్వప్న (మీనా) తన అన్న పెళ్ళి భానుప్రసాద్ చెల్లెలితో జరగుతుండటంతో కుటుంబ సమేతంగా వాళ్ళ ఊరు వస్తుంది. మొదట్లో భాను వేష భాషలు చూసి అతన్ని ఓ పనివాడిగా భావించి చిన్నచూపు చూస్తుంది. కానీ తరువాత తన తప్పును తెలుసుకుని, భాను స్నేహితుడు నూకరాజు (సుధాకర్) ద్వారా అతని గతం గురించి తెలుసుకుంటుంది. భాను చిన్నప్పటి నుంచి తన మరదలైన మాధవిని ప్రేమిస్తుంటాడు. పెద్దలు వారిద్దరికీ వివాహం నిశ్చయిస్తారు. కానీ మాధవి అందుకు అంగీకరించక ఆత్మహత్య చేసుకోబోతుంది. భాను ఆమెను వారించి నిందను తన మీద వేసుకుని తనకా పెళ్ళి ఇష్టం లేదని తండ్రికి చెబుతాడు. అప్పటి నుంచి తండ్రి అతన్ని అందరికీ దూరంగా పెడతాడు. భాను కథ విన్న స్వప్న అతని ప్రేమలో పడుతుంది. భాను మొదట్లో ఒప్పుకోక పోయినా స్వప్న ప్రేమలోని నిజాయితీని గుర్తించి ఆమె ప్రేమను అంగీకరిస్తాడు.
ఇంతలోపే సింగరాజు స్వప్నను తన కోడలుగా చేసుకుంటే హరిశ్చంద్ర ప్రసాద్ తో సమానంగా గౌరవం దక్కుతుందని భావించి ఆ ప్రయత్నాలు మొదలుపెడతాడు. కానీ భాను ఆ ప్రయత్నాల్నంటినీ తిప్పికొట్టిమswapna ni పెళ్ళి చేసుకుని వచ్చి తండ్రి ముందుకు వస్తాడు. హరిశ్చంద్ర ప్రసాద్ తన మాటను కాదన్నందుకు కొడుకును ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడు. భాను భార్యతో కలిసి వేరు కాపురం పెడతాడు. ఒకసారి మాధవి అనుకోకుండా స్వప్నకు తారసపడి ఆమెను అవమానిస్తుంది. దాంతో భాను తన భార్యను ఐఏయస్ శిక్షణకు పంపిస్తాడు. భాను కూడా నెమ్మదిగా చదవడం, రాయడం, లెక్కలు నేర్చుకుని వ్యాపారం చేసి అభివృద్ధి లోకి వస్తాడు. స్వప్న కలెక్టరవుతుంది. వారిద్దరికీ ఒక కొడుకు (ఆనందవర్ధన్) పుడితే భాను తండ్రి గౌరవార్థం హరిశ్చంద్ర ప్రసాద్ అని పేరు పెడతారు. చివరికి మాధవి తన భర్తను వాళ్ళ ఫ్యాక్టరీలో చేర్చుకొమ్మని వారినే అభ్యర్థిస్తుంది.
ఒకసారి హరిశ్చంద్ర ప్రసాద్ బడిలో ఏదో పనిమీద వెళ్ళి వస్తుండగా మనవడు తారసపడతాడు. తన గుమాస్తా ద్వారా అతను భాను కొడుకని తెలుసుకుని రోజూ ఇంట్లో ఎవరికీ తెలియకుండా అతనితో సమయం గడుపుతుంటాడు. ఈ విషయం తెలుసుకున్న భాను, స్వప్న కూడా సంతోషించి ఆయన్ని గౌరవంగా చూడమని పిల్లవాడికి చెబుతారు. ఒకసారి భాను తన తండ్రికిష్టమైన పాయసం చేసి కొడుకు ద్వారా తండ్రికి పంపిస్తాడు. కానీ దారి మధ్యలో సింగరాజు అందులో విషం కలుపుతాడు. అది తాగిన హరిశ్చంద్ర ప్రసాద్ ఆస్పత్రి పాలవుతాడు. సింగరాజు ఆ నేరం భాను మీద వేస్తాడు. అందరూ కలిసి భాను మీద దాడి చేస్తుంటే ఆస్పత్రిలో కోలుకున్న హరిశ్చంద్ర ప్రసాద్ వచ్చి అందరికీ జరిగిన నిజాన్ని చెప్పి కొడుకుని రక్షిస్తాడు. కుటుంబంలో అందరూ కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
నటులు
- హరిశ్చంద్ర ప్రసాద్, భాను ప్రసాద్ గా వెంకటేష్
- స్వప్నగా మీనా
- వసుంధరగా రాధిక
- దివాకర్ ప్రసాద్ గా మహర్షి రాఘవ
- మాధవి గా సంఘవి
- మేజర్ ఎద్దులయ్య గా కోట శ్రీనివాస రావు
- గుడిమెట్ల నూకరాజుగా సుధాకర్
- దక్షిణామూర్తి గా సత్యనారాయణ
- లింగరాజు సింగరాజుగా ఆనందరాజ్
- జూనియర్ హరిశ్చంద్ర ప్రసాద్ గా ఆనందవర్ధన్
- దేవదాసు గా ఆలీ
- డాక్టర్ నీచం గా మల్లికార్జునరావు
- న్యాయమూర్తిగా నూతన్ ప్రసాద్
- నారాయణ గా పి. ఎల్. నారాయణ
- వేణుగోపాల్ గా రాజా రవీంద్ర
- రవిప్రసాద్ గా వినోద్
- పోలీస్ ఇన్ స్పెక్టర్ గా బెనర్జీ
- అతిథి పాత్రలో తిరుపతి ప్రకాష్
- అతిథి పాత్రలో బండ్ల గణేష్
పాటలు
| పాట | పాడినవారు | రాసినవారు |
|---|---|---|
| అడుగో మహారాజు | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | సిరివెన్నెల |
| రోజావే చిన్ని రోజావే | హరిహరన్ | సామవేదం షణ్ముఖ శర్మ |
| రోజావే చిన్ని రోజావే | చిత్ర | సామవేదం షణ్ముఖ శర్మ |
| చుక్కలన్నీ ముగ్గులై | బాలు, సుజాత | సిరివెన్నెల |
| కిల కిల నవ్వే కోయిల కోసం | బాలు, చిత్ర | ఇ.ఎస్. మూర్తి |
| ఝలకు ఝలకు సిలుకు చీర | మనో, చిత్ర | భువన చంద్ర |
మూలాలు
- "Suryavamsam Full Movie". youtube.com. Telugu Movies. Retrieved 1 September 2016.