సగిలేరు

సగిలేరు పెన్నా నది యొక్క ఉపనది. ఇది ప్రకాశం జిల్లా నల్లమల్ల కొండలలో కంబం వద్ద పుట్టి, దక్షిణమున గిద్దలూరు మరియు బద్వేలు తాలూకాల గుండా ప్రవహించి వైఎస్ఆర్ జిల్లాలో పెన్నానదిలో కలుస్తుంది. పూర్వము ఈ నదిని స్వర్ణబాహు నది అని పిలిచేవారు. సగిలేరు నదిపై వైఎస్ఆర్ జిల్లాలో రెండు మధ్యతరహా నీటి పారుదల పథకాలు ఉన్నాయి - ఎగువ సగిలేరు ప్రాజెక్టు మరియు దిగువ సగిలేరు ప్రాజెక్టు.

గిద్దలూరు పట్టణ శివార్లలో సగిలేరు నదిపై రైలువంతెన

దిగువ సగిలేరు ప్రాజెక్టు వైఎస్ఆర్ జిల్లాలో బి.కోడూరు మండలంలోని వడ్డెమాను గ్రామం వద్ద నిర్మించబడింది. దీని మొత్తం ఆయకట్టు 11804 ఎకరాలు. ఈ ప్రాజెక్టు 0.6 టి.ఎం.సిల లభ్యమయ్యే జలాల్ని వినియోగించుకుంటుంది. జలాశయం యొక్క పూర్తి సామర్థ్యం 0.169 టి.ఎం.సి.లు మరియు నికర సామర్థ్యం 0.166 టి.ఎం.సి.లు. దీన్ని మొత్తం 51 లక్షల వ్యయంతో 1954లో నిర్మించారు. 1996లో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా సంభవించిన వరదల వల్ల ఆనకట్ట, గేట్లు, కాలువలు మరియు పంపీణీ వ్యవస్థ దెబ్బతినడంతో 6.95 కోట్ల ఖర్చుతో మరమత్తులు చేపట్టి 2003 మార్చిలో పూర్తిచేశారు.[1] 2009లో ఈ ప్రాజెక్టుకు మాజీ రాష్ట్రమంత్రి పేరుమీద వడ్డెమాను చిదానందం జలాశయం అని పేరు మార్చారు.[2] ఈ ప్రాజెక్టు బద్వేలు చెరువుతో పాటు కాలువ వెంట ఉన్న పదమూడు చెరువులకు నీరందిస్తున్నది.[3]

ఎగువ సగిలేరు ప్రాజెక్టు కలసపాడు మండలం దిగువ తంబళ్లపల్లె వద్ద సగిలేరు నదిపై నిర్మించబడింది. దీనిని వంకమర్రి డ్యామ్ అని కూడా వ్యవహరిస్తారు. ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం ఆయకట్టు 5448 ఎకరాలు. దీన్ని 1896లో 4.6 లక్షల వ్యయంతో నిర్మించారు. 1898-99లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టులో ఆనకట్టతో పాటు 10 మైళ్ల పొడవున్న కాలువ దారివెంట ఉన్న అనేక చెరువులకు నీరందిస్తున్నది.[4] 1996లో వరదల వల్ల దెబ్బతిన్న ఆనకట్ట, కాలువలు మరియు పంపీణీ వ్యవస్థను 2.32 కోట్ల ఖర్చుతో మరమ్మత్తులు చేశారు. ఈ పని మార్చి 2001లో పూర్తయ్యింది.

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.