లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్

జె.పి.గా సుప్రసిద్దులైన జయప్రకాశ్ నారాయణ్ (జననం:అక్టోబరు 11, 1902 — మరణం:అక్టోబరు 8, 1979) భారత స్వాతంత్ర్య సమర యోధుడు మరియు రాజకీయ నాయకుడు. 1970 వ దశకంలో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి నాయకత్వం వహించి సంపూర్ణ విప్లవానికి పిలుపునివ్వటం ద్వారా జయప్రకాశ్ నారాయణ్ చిరస్మరణీయుడయ్యాడు. ఈయనను ప్రజలు లోక్ నాయక్ అని సగౌరవంగా పిలుచుకుంటారు.భారత ప్రభుత్వం ఈయన 113 వ జయంతిని పురస్కరించుకుని "ప్రజాస్వామ్య పరిరక్షణ దినం"గా ప్రకటించింది

జయప్రకాశ్ నారాయణ్
లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్
జననంఅక్టోబర్ 11, 1902
సితాబ్దియారా, బల్లియా, ఉత్తర్ ప్రదేశ్, భారతదేశం
మరణంఅక్టోబర్ 8, 1979
సంస్థభారత జాతీయ కాంగ్రేసు, జనతా పార్టీ
ఉద్యమంస్వాతంత్ర్య సంగ్రామం, సర్వోదయా, ఎమర్జెన్సీ

ప్రారంభ జీవితం

జయప్రకాశ్ నారాయణ్ ఉత్తర ప్రదేశ్ లోని బలియా జిల్లాకు, బీహారు లోని సారన్ జిల్లాకు మధ్యన గల సీతాబ్దియారా గ్రామంలో జన్మించాడు. ఉన్నత పాఠశాల విద్యను, కళాశాల విద్యను పాట్నాలో అభ్యసించాడు. అటుపిమ్మట అమెరికాలో 8 సం.లు ఉన్నత విద్యనభ్యసించి 1929లో భారతదేశం తిరిగి వచ్చాడు. అమెరికాలో ఉన్న సమయంలో మార్క్స్ సిద్ధాంతాలను అధ్యయనం చేశాడు. ఆ కాలంలోనే యం.యన్.రాయ్ రచనల ప్రభావానికి లోనయ్యాడు.

1920లో జయప్రకాశ్ నారాయణ్ స్వాతంత్ర్య సమరయోధురాలు, కస్తూరిబా గాంధీ అనుచరురాలు అయిన ప్రభావతీ దేవిని వివాహమాడాడు.

ఇజ్రాయేల్ ప్రధాని డేవిడ్ భెన్ ఘురియన్ తో నారాయణ్

స్వాతంత్ర్య సమరయోధుడిగా

అమెరికానుండి వచ్చిన వెంటనే జవహర్‌లాల్ నెహ్రూ ఆహ్వానం మేరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెసులో చేరి త్వరలోనే మహాత్మా గాంధీకి ప్రియ శిష్యుడుగా మారాడు.

1932లో శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించాడు. విడుదలైన తరువాత కాంగ్రెసులో అంతర్భాగంగా వామపక్ష భావాలతో స్థాపించబడిన కాంగ్రెసు సోషలిష్టు పార్టీకి జనరల్ సెక్రటరీగా నియమించబడ్డాడు.

1942లో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో సీనియర్ కాంగ్రెసు నేతలంతా అరెష్టు చేయబడిన సమయంలో జయప్రకాశ్ నారాయణ్ రాం మనోహర్ లోహియా, బాసవన్ సింగ్ వంటివారితో కలసి ఉద్యమాన్ని ముందుండి నడిపాడు.

స్వాతంత్ర్యానంతరం జె.పి. ఆచార్య నరేంద్ర దేవ్, బాసవన్ సింగ్ మొదలైన వారితో కలసి కాంగ్రెసు నుండి బయటకు వచ్చి తమ సోషలిస్టు పార్టీ ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషించారు. అనంతరం ఈ సోషలిస్టు పార్టీ ప్రజా సోషలిస్టు పార్టీగా మారి బీహారు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించింది.

సర్వోదయ

1954లో జె.పి. రాజకీయాలనుండి విరమించుకుని తన జీవితాన్ని ప్రముఖ గాంధేయవాది అయిన ఆచార్య వినోబా భావే యొక్క సర్వోదయ ఉద్యమానికి మరియు దానిలో అంతర్భాగమైన భూదాన్ ఉద్యమా నికి అంకితం చేశాడు. తన భూమినంతా పేద ప్రజలకు ఇచ్చివేసి హజారిబాగ్‌లో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పాడు. జె.పి. త్వరితగతిన భారతదేశంలో మహాత్మా గాంధీ భావాలకు అనుగుణంగా ఆయన అడుగు జాడలలో నడుస్తున్న సర్వోదయ ఉద్యమకారులలో కెల్లా ప్రముఖునిగా రూపొందాడు.

సంపూర్ణ క్రాంతి

1960 వ దశకం చివరిలో జయప్రకాశ్ నారాయణ్ తిరిగి బీహారు రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించనారంభించాడు. 1974లో బీహారులో జె.పి. నాయకత్వం వహించిన ఒక విద్యార్థి ఉద్యమం ఆతర్వాత బీహారు ఉద్యమంగా ప్రసిద్ధి పొందిన ఒక ప్రజా ఉద్యమంగా మారినది. ఈ ఉద్యమ సమయంలోనే శాంతియుతమైన సంపూర్ణ విప్లవా నికి జె.పి. పిలుపునిచ్చాడు.

ఎమర్జెన్సీ

ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణల క్రింద నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీని దోషిగా పేర్కొంటూ అలహాబాదు హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే జె.పి. ఇందిర రాజీనామాకు డిమాండ్ చేసి, మిలిటరీకి మరియు పోలీసు యంత్రాంగానికి చట్టవిరుద్దమైన, అనైతికమైన ఆజ్ఞలను పాటించనవసరంలేదని సూచించాడు. ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే ఇందిరాగాంధీ జూన్ 25,1975 అర్థరాత్రి నుండి దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెనీ) ని విధించింది. జె.పి.ని మరియు ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం అరెస్టు చేసినది. ఆఖరికి కాంగ్రెసు పార్టీ లోనే యంగ్ టర్క్‌లు గా పిలువబడుతున్న అసమ్మతి నేతలు కూడా అరెస్టు చేయబడ్డారు.

జె.పి. ఛండీఘడ్లో డిటెన్యూగా ఉంచబడ్డాడు. బీహారు వరదల సమయంలో అచటి పునరావాస కార్యక్రమాన్ని పర్యవేక్షించుటకు పెరోల్ పై విడుదల కోరినా కూడా ప్రభుత్వం తిరస్కరించింది. ఆఖరికి జె.పి. ఆరోగ్యం క్షీణించడంతో నవంబరు 12 న విడుదల చేయబడ్డాడు.

చివరికి ఇందిరా గాంధీ జనవరి 18, 1977న ఎమర్జెన్సీని తొలగించి ఎన్నికలను ప్రకటించడంతో ఆమెను ఎదుర్కోవటానికి కాంగ్రెసుకు వ్యతిరేకంగా జె.పి.మార్గదర్శకత్వంలో జనతా పార్టీ రూపుదిద్దుకున్నది. చివరికి జనతా పార్టీ ఎన్నికలలో కాంగ్రెసును ఓడించి, ఇందిరను గద్దె దింపి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచిన మొట్ట మొదటి కాంగ్రెసేతర పార్టీగా చరిత్రలో స్థానం సంపాదించింది.

భారత రత్న

భారతదేశంలో ప్రజాస్వామ్య పునరుద్దరణకు పోరాడిన లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ అక్టోబరు 8, 1979లో మరణించాడు. మరణానంతరం 1998లో భారత ప్రభుత్వం ఇతనికి దేశంలో అత్యున్నత పురస్కారమైన భారత రత్న ను ప్రకటించింది. ఇదిగాక జె.పి. చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా 1965లో మెగసెసే అవార్డు ప్రకటించబడింది.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.