రైతు

వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకునూ పండించే వ్యక్తిని రైతు అంటారు. వ్యవసాయదారుడు అని కూడా అంటారు. పంటలు పండించేవారినే కాక, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు. సాధారణంగా రైతులు తమ స్వంత భూమిలోనే సాగు చేస్తూంటారు. ఇతరుల భూమిని అద్దెకు తీసుకుని కూడా సాగు చేస్తూంటారు. దాన్ని కౌలు అని, వారిని కౌలు రైతులనీ అంటారు. పొలం పనుల్లో భాగంగా తాను పనిలో పెట్టుకునే ఉద్యోగులను రైతుకూలీలు అంటారు.

చరిత్ర

వ్యవసాయం కొత్తరాతియుగంలోనే మొదలైంది. కంచుయుగం నాటికి, సా.పూ. 5000-4000 నాటికే సుమేరియన్లకు వ్యవసాయ కూలీలు ఉన్నారు వ్యవసాయంలో వాడుకునేందుకు గాను, పశుపోషణ చెయ్యడం వేల సంవత్సరాలుగా జరుగుతోంది. తూర్పు ఆసియాలో 15,000 ఏళ్ళ కిందటే కుక్కలను పెంచారు. సా.పూ. 7,000 నాటికి ఆసియాలో మేకలు, గొర్రెలను పెంచారు. సా.పూ. 7,000 నాటికి మధ్య ప్రాచ్యం, చైనాల్లో పందులను పెంచారు. సా.పూ. 4,000 నాటికి గుర్రాలను పెంచారు.[1]

సింధు లోయ నాగరికత నాటికే భారతదేశంలో వ్యవసాయం ఉంది. దక్షిణ భారత దేశంలో కొన్ని చోట్ల అంతకు ముందు నుండే ఉంది.[2]

పనిలో ప్రమాదాలు

A combine harvester on an English farm

వ్యవసాయంలో అనేక ప్రమాదాలు ఎదురౌతూంటాయి; ఇదొక ప్రమాదకరమైన పని.[3] రైతులు, రైతు కూలీలు పామూ పుట్రల కాట్లకు గురౌతూంటారు.[4] ట్రాక్టర్లు, హార్వెస్టర్లూ వంటి యంత్రాలతో పని చెయ్యడంలో కూడా వాటితో ప్రమాదాలకు లోనౌతూంటారు. దీర్ఘ కాలంలో రైతులు కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులకు గురవడం కూడా కద్దు.[5]

మూలాలు

  1. "Breeds of Livestock - Oklahoma State University". Ansi.okstate.edu. Archived from the original on 2011-12-24. Retrieved 2011-12-10.
  2. Brese, White (1993). "Agriculture".
  3. "Agricultural Safety". NIOSH. December 15, 2014. Archived from the original on October 28, 2007.
  4. "Insects and Scorpions". NIOSH. February 24, 2012. Archived from the original on September 3, 2015.
  5. Kumaraveloo, K Sakthiaseelan; Lunner Kolstrup, Christina (2018-07-03). "Agriculture and musculoskeletal disorders in low- and middle-income countries". Journal of Agromedicine (in ఆంగ్లం). 23 (3): 227–248. doi:10.1080/1059924x.2018.1458671. ISSN 1059-924X.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.