రాయచోటి

రాయచోటి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన పట్టణం.[1]

రాయచోటి పట్టణానికి చుట్టుపట్ల గల పల్లెప్రజలు ఇప్పటికీ రాసీడు అనే పలుకుతారు. రాచవీడు అనే పేరు క్రమంగా రాయచోటిగా మారింది. ఈ పట్టణంలోని పురాతన వీరభద్రాలయం శైవులకు అత్యంత ప్రీతిపాత్రకరమైనది. ప్రతి సంవత్సరం ఇక్కడ మార్చి నెలలో 11 రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటిని వీక్షించడానికి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.

దర్శనీయ ప్రాంతాలు

వీరభద్ర ఆలయం

రాయచోటి పట్టణంలోని వీరభద్రుడు నాగకుండల, రుద్రాక్షమాల శోభితుడై, కుడిచేత జ్ఞానమనే ఖడ్గం, ఎడమచేత అభయమనే ఖేటకం ధరించి భద్రకాళీ సమేతుడై భక్తులకు దర్శనమిస్తారు. అమరుల చేత పూజింపబడటంతో ఈ క్షేత్రాన్ని అమరగురు వీరేశ్వర క్షేత్రంగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధికెక్కింది. ఆలయ కట్టడాలు చోళ రాజుల శైలిని పోలి ఉన్నాయి. రాజరాజచోళుడు వీరభద్రుడిని దర్శించుకున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి.కాకతీయ గణపతిదేవుడు, మట్లిరాజులు, శ్రీకృష్ణదేవారాయలు ఆలయాన్ని దర్శించి అభివృద్ధి పనులు చేయించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. నవాబుల కాలంలో కొంతమంది దుండగులు ఆలయాన్ని ధ్వంసం చేయడానికి రాగా మాసాపేట వాసులు అడ్డుకున్నారు. శివరాత్రికి వారి వంశస్థులే గర్భగుడిలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

క్షేత్ర విశేశాలు

  • వీరేశ్వరుడు వీరలింగం, బకే గర్భాలయంలో ఉండటం విశేషం.
  • వీరభద్రుడికి కాళ్లు సమానంగా ఉండవు. రాయచోటిలో వీరభద్రుడికి కాళ్లు సమానంగా ఉన్నాయి.
  • ఆలయంలో ద్వారపాలకులుగా శ్రీనందీశ్వరుడు, మహాకాళేశ్వరుడు ఉన్నారు.
  • ముఖద్వారానికి ఎడమ వైపున సూర్యభగవానుడు, 54 అడుగులు ధ్వజస్తంభం ఉంది.
  • గ్రామదేవత యల్లమ్మ పూజ అనంతరం వీరభద్రుడికి పూజలు చేస్తారు.
  • ఏటా మార్చి 27న, సెప్టెంబరు 14న ఉదయం ఆరు గంటలకు స్వామివారి గర్భగుడిలో సూర్యకిరణాలు విగ్రహం పాదల వద్ద పడతాయి.

మహా నైవేద్యం

ఆలయంలో ఏటా మహా నైవేద్య ప్రదానం ఘనంగా జరుగుతుంది. ఆరోజు ఆలయంలో వీరభద్రుడిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తారు. వీరశైవులు ఉపవాసంతో తయారుచేసిన నైవేద్యాన్ని స్వామి ఎదుట ఉంచుతారు. కత్తులతో విన్యాసాలు చేసి ఖడ్గ మంత్రాలు చదువుతారు. స్వామి తలుపులు తెరచి ప్రత్యేక పూజలు చేస్తారు. వడియరాజులు మొదట ప్రసాదాన్ని కొల్లగొట్టుకు పోయిన అనంతరం మిగిలిన ప్రసాదాన్ని ఇతరులు తీసుకెళ్లడం ఆనవాయితీ. కర్ణాటక భక్తులు స్వామి వారికి వస్త్రాలను బహూకరిస్తారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. నందీశ్వరుడిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. భక్తులు మహానైవేద్యాన్ని పవిత్రంగా భావిస్తారు. కర్ణాటక భక్తులు ప్రసాదాన్ని ఎండబెట్టుకుని చాలాకాలం వాడుకుంటారు. 360 శేర్ల బియ్యం, వంద కిలోల క్యారెట్, రెండు వందల కిలోల వంకాయలు, రెండు వందల కిలోల గనుసు గడ్డలు, వంద కిలోల ఉల్ల గడ్డలు, నాలుగు బండ్ల గుమ్మడికాయలు తరిగి వండుతారు. 10శేర్ల బియ్యంతో అత్తిరాసాలు (నిప్పట్లు) నెయ్యితో తయారు చేసి, అన్నంపై వీటిని పేర్చుతారు. భద్రకాళి వీరభద్రుడికి నైవేద్యంగా పెడతారు. ఏదైనా దోషాలు పోవడానికి దీనిని ఏర్పాటు చేస్తారు. నైవేద్య దినాన్ని కన్నగుడిలు పవిత్రంగా భావిస్తారు. పెద్ద సంఖ్యలో హాజరవుతారు.

  • మాసాపేటలోకొలువైయున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మొత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమికి (మే నెలలో), కన్నులపండువగా నిర్వహించెదరు. [1]

శాసనసభ నియోజకవర్గం

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.