మోటూరి సత్యనారాయణ

మోటూరి సత్యనారాయణ (ఫిబ్రవరి 2, 1902 - మార్చి 6, 1995) దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన పండితులు మరియు స్వాతంత్ర్య సమరయోధులు.[1]

జననం

వీరు 1902, ఫిబ్రవరి 2 వ తేదీన కృష్ణా జిల్లా దొండపాడు గ్రామంలో పెద పిచ్చయ్య మరియు రత్తమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య అనంతరం తెలుగు, సంస్కృతం అభ్యసించాడు. వీరు ఆంధ్ర జాతీయ కళాశాలలో ఉన్నతమైన గురువుల వద్ద జాతీయ శిక్షణ పొంది హిందీ బాగా అభ్యసించారు. తర్వాత ఇంగ్లీషు, తమిళం, కన్నడం, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మొదలైన భాషలు కూడా నేర్చుకున్నారు. వీరికి రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, ఐతిహాసిక, వైజ్ఞానిక, సాంకేతిక విషయాలలో లోతుగా ప్రవేశం ఉండేది.

వీరు హిందీ ప్రచారంతో జీవితాన్ని ప్రారంభించి క్రమాభివృద్ధి పొందారు. మొదట సంఘటకులుగా, కార్యదర్శిగా, చివరకు 1938లో హిందీ ప్రచార సభకు ప్రధాన కార్యదర్శి అయి 1961 వరకు కొనసాగారు. ఆ సంస్థ ప్రథమ ప్రధాన కార్యదర్శి పండిత హరి హర శర్మకు కుడిభుజంగా ఉండి సహకరించారు. వారి దూరదృష్టి, అవగాహన వల్లనే ఈ సభ హిందీ సాహిత్య సమ్మేళనం, ప్రయాగవారి బంధనం నుండి విముక్తి పొంది 1927లో స్వతంత్ర సంస్థగా ఆవిర్భవించింది.

వీరు ప్రధాన కార్యదర్శిగా ఉన్నంతకాలం దక్షిణ భారత హిందీ ప్రచార సభ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగినది. 1936లో ప్రచారసభకు 4 రాష్ట్రాలలో, 4 ప్రాంతీయ శాఖల నిర్మాణం వీరి దూరదృష్టిని నిరూపిస్తుంది. వీరు మహాత్మాగాంధీ, రాజేంద్ర ప్రసాద్ లకు అత్యంత విశ్వాస పాత్రులు. 1946లో జరిగిన సభ రజతోత్సవానికి బాపూజీ 12 రోజులు ఉండి సమావేశాలు జరిపించారు. ప్రతి దినం గాంధీ ప్రార్థనా సమావేశాలలో వేలాదిమంది పాల్గొనేవారు. మద్రాసు కార్పొరేషన్ నుండి త్యాగరాయ నగరంలో సుమారు ఐదున్నర ఎకరాల భూమిని సంపాదించి అప్పటి అవసరాలకనుగుణంగా భవనాలను నిర్మించారు. ముద్రణాలయం, పుస్తక ప్రచురణ, పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆదాయం సమకూర్చారు. హిందీ ప్రచారాన్ని పెంపొందించడానికి ప్రతి రాష్ట్రంలోను, కొన్నిజిల్లాలలోను, మండలాల వారీగా సంరక్షకులను ఏర్పాటుచేసి నూతన ప్రణాళికల ద్వారా దక్షిణ భారతమంతా మారుమూలల వరకు హిందీని వ్యాపింపజేశారు. వీరి నేతృత్వంలో ప్రజలలో హిందీ పట్ల ప్రేమ, గౌరవం పెరిగింది.

వీరు 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్య సమరయోధులుగా తామ్రపత్ర గ్రహీతలయ్యారు.

వీరు రాజకీయ రంగంలో కూడా విలువైన సేవలు అందించారు. భారత రాజ్యాంగ చట్టంలో 17వ భాగం రాజభాష అధ్యాయ నిర్మాణంలోను, దాని డ్రాఫ్టింగ్ మరియు రాజ్యాంగ సభలో నెగ్గించడంలో వారి సహకారం ఎంతో ఉంది. ఇందు మూలంఆ వీరు రాష్ట్రపతి ద్వారా 1954 నుండి 1966 వరకు వరుసగా రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయబడ్డారు. 1956లో రాజభాషా కమిషన్ కు సభ్యులుగా పనిచేశారు.

వీరు తెలుగు భాషా సమితి స్థాపక కార్యదర్శిగా 'తెలుగు విజ్ఞాన సర్వస్వం' 16 భాగాలలో ప్రచురించారు. అదే విధంగా హిందీ వికాస సమితిని కూడా స్థాపించి హిందీలో 'విశ్వవిజ్ఞాన సంహిత' పేరుతో హిందీ విజ్ఞాస సర్వస్వాలను ప్రచురింపచేశారు.

మరణం

వీరు 1995 సంవత్సరం మార్చి 6 వ తేదీన పరమపదించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరికి కళాప్రపూర్ణతో గౌరవిస్తే, కొన్ని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ తో సన్మానించాయి. భారత ప్రభుత్వం వీరికి పద్మశ్రీ (1958) మరియు పద్మభూషణ్ (1962) పురస్కారాల్ని ఇచ్చి గౌరవించింది. వీరి సేవలను పురస్కరించుకుని హైదరాబాదులో రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన 1957 పెద్ద ఎత్తున అభినందన సభ జరిపి అభినందన గ్రంథం సమర్పించారు.

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.