మాచర్ల (గుంటూరు జిల్లా)

మాచర్ల, గుంటూరుకు 110 కి.మీ. దూరంలోను, నాగార్జునసాగర్‌కు 25 కి.మీ. దూరంలోనూ ఉన్న ఓ పట్టణము. ఈ పట్టణము హైహవ రాజుల కాలంలో నిర్మించిన చెన్నకేశవస్వామి దేవాలయమునకు ప్రసిద్ధి. పురాతన కాలములో దీనిని మహాదేవిచర్ల అని పిలిచేవారు.[1] ఇక్కడ జరిగే వార్షిక ఉత్సవము చాలా ఘనముగా నిర్వహింపబడును, ఆ సమయములో ఇక్కడికి చాలా దూరమునుండి యాత్రికులూ, భక్తులూ వస్తుంటారు. ఈ దేవాలయము 12-13 వ శతాబ్దాలలో నిర్మించబడింది. ఈ దేవాలయము ఎదురుగా ఓ పెద్ద ధ్వజస్తంభము చెక్కతో చేయబడి ఇత్తడితో కప్పబడినదై వెలుగొందుతుంది. గుడికి ఎదురుగా నాలుగు స్తంభాల మంటపాలు ఉన్నాయి.

ఈ పట్టణము హైదరాబాదు నుండి 160 కి.మీ. దూరంలో ఉంది. వివిధ ప్రాంతాల నుండి మాచర్లను కలుపుతూ రోడ్డు మార్గాలు, రైలు మార్గం (గుంటూరు-మాచర్ల రైలు మార్గం) ఉన్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులే కాక, ప్రైవేటు బస్సులు కూడా నడుస్తూ ఉన్నాయి.

చరిత్రలో మాచర్ల

క్రీ.శ. 1182 లో పలనాటి యుద్ధంగా పేరొందిన దాయాదుల పోరు మాచర్ల, గురజాల పట్టణాల మధ్య జరిగింది. ఈ యుద్ధం పల్నాటి హైహయ వంశంతో పాటు తీరాంధ్రలోని రాజవంశాలన్నింటినీ బలహీనపరచి కాకతీయ సామ్రాజ్య విస్తరణకు మార్గం సుగమం చేసింది. హైహయరాజుల కాలంలో ఈ ప్రాంతంలో గొప్పచెరువు వుండేదని, దానిమధ్యలో మహాదేవి ఆలయం వుండడం వలన ఈ ప్రాంతానికి మహాదేవిచర్ల అనే పేరు వాడుకలో మాచర్లగా రూపాంతరంచెందిందని చరిత్రకారుల కథనం. తరువాతికాలంలో బ్రహ్మనాయుడు మలిదేవరాజుకి పల్నాటిరాజ్యంలో కొంతభాగమిప్పించి, గురజాలనుండి విడిపోయి మాచర్ల రాజధానిగా పాలింపజేశాడు.

శాసనసభ నియోజకవర్గం

విద్యారంగం

మాచర్ల చుట్టు పక్కల గల గ్రామాలకు ఈ ఊరు చెప్పుకోదగ్గ విద్యాకేంద్రం. ప్రాథమికి విద్య నుండి ఇంజనీరింగ్ విద్య వరకూ చదువుకునే సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి ముఖ్యమైన విద్యా సంస్థలు:

  1. శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ కళాశాల (డిగ్రీ కళాశాల)
  2. శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ కళాశాల (జూ. కళాశాల)
  3. ఆర్. సి. యం. ఎలిమెంటరీ పాఠశాల
  4. St. Francis Boys High school
  5. సెయింట్ ఆన్స్ బాలికల ఉన్నత పాఠశాల
  6. జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో 2015,డిసెంబరు-28వ తేదీ నుండి, శుద్ధజలం అందించుచున్నారు. మాచర్ల తెలుగుదేశం బాధ్యులు శ్రీ చిరుమామిళ్ళ మధుబాబు, ఈ పథకానికి కావలసిన పరికరాలను వితరణగా అందించారు. [10]
  7. జిల్లా పరిషత్తు ఉన్నత(బాలికల) పాఠశాల (హెచ్.ఎమ్) నాగమణి
  8. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాల మాచర్ల పట్టణంలోని సాగర్ రహదారిలోని క్వారీ దగ్గర ఉంది.
  9. న్యూటన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ.
  10. శ్రీ త్యాగరాజ గాత్ర సంగీత శిక్షణాలయం:- ఈ సంగీత కళాశాలలో ఎంతోమంది విద్యార్థులు శిక్షణ పొంది, అనేక పోటీలలో పాల్గొని బహుమతులు పొందినారు. ఈ కళాశాల 10వ వార్షికోత్సవం 2014,మే-25 ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. [2]
  11. కస్తూర్బా పాఠశాల.
  12. కిడ్స్ పాఠశాల.

పట్టణం లోని మౌలిక వసతులు

శ్రీ వాసవీ వృద్ధాశ్రమం. స్వామి వివేకానంద అనాథ శరణాలయం.

వ్యయసాయం, సాగునీటి సౌకర్యం

దేవళ్ళమ్మ చెరువు:- పట్టణంలోని 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చెరువు, 58 ఎకరాలలో విస్తరించియున్నది. 1950 వరకు ఈ చెరువు కేవలం మంచినీటి చెరువుగానే ఉపయోగపడినది సాగర్ కుడి కాలువలు నిర్మాణం జరుగక ముందు, ఈ చెరువు పల్నాడులోనే ఒక పెద్ద త్రాగునీటి చెరువుగా గుర్తింపు పొందినది. సాగర్ కాలువ వచ్చిన తరువాత నిరాదరణకు గురై, ప్రస్తుతం ఆక్రమణల పాలై, క్రమేణ కుంచించుకు పోతున్నది. [9]

పట్టణం లోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి ఆలయం

స్థానిక రోప్ లైన్ కాలనీలో ఉన్న ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం, 2015,ఆగస్టు-14వ తేదీ శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శనివారం ఉదయం నుండియే భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. [6]

వీరభధ్రస్వామి ఆలయం

ఈ ఆలయం అతి పురాతనమైనది. ఈ ఆలయం, శ్రీ చెన్నకేశ్వస్వామివారి ఆలయం ప్రక్కన ఉంది. ఈ దేవాలయం గోడలమీద పురాతన కాలంలో చెక్కిన శిల్పసంపద దాగి ఉంది. [7]

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం

ఈ ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, ప్రతి సంవత్సరం, స్వామివారి బ్రహ్మొత్సవాలు, వైభవంగా నిర్వహించెదరు. ప్రతి రోజూ స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో స్వామివారు ప్రతి రోజూ ఒక్కో అవతారంలో దర్శనమిచ్చెదరు. [3]

శ్రీ రామప్ప దేవాలయం

ఈ ఆలయంలో 2016,అక్టోబరు-16, ఆదివారంనాడు నూతనంగా నిర్మించిన శివపార్వతుల విగ్రహాలు ప్రతిష్ఠించెదరు. [11]

శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామివారి ఆలయం

మాచర్లలో చెన్నకేశవ స్వామి వారి ఆలయము

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, చైత్రమాసంలో స్వామివారి బ్రహ్మొత్సవాలు 15 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ప్రతి రోజూ స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. [4]

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం

మాచర్ల పట్టణంలోని నెహ్రూనగరులో వేంచేసియున్న ఈ అలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను, 2015,మే నెల-23వ తేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుండియే ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భగా స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. [6]

ఓటిగుళ్ళు

పలనాడులో బ్రహ్మనాయుడు, మలిదేవుల పాలనకు పూర్వం, జైనులు ఈ ప్రాంతంలో ఓటిగూళ్లను కట్టించారు. మూలవిరాట్‌ లేకుండా దేవాలయం మాత్రమే ఉండే వాటిని ఓటిగుళ్లుగా పిలుస్తారు. ప్రస్తుతం మాచర్ల ఆదిత్యేశ్వర ఆలయంలో శిథిలమైన గుడిని ఓటిగుడిగా ప్రముఖ రచయిత గుర్రం చెన్నారెడ్డి తన పలనాటి చరిత్ర పుస్తకంలో రాశారు. దేవళమ్మ చెరువు సమీపంలోని కట్టడం కూడా ఓటిగుడిగా ఆయన పేర్కొన్నారు.

శ్రీ ఆదిలక్ష్మమ్మ అమ్మవారి అలయం

మాచర్ల పట్టణంలోని చంద్రవంక వాగు ఒడ్డున నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు, 2015,మే నెల-4వ తేదీ సోమవారం నుండి ప్రారంభమైనవి. సోమ, మంగళవారాలలో వేదపండితులు ప్రత్యేకపూజలు, యాగాలు నిర్వహించి, ఆరవ తేదీ బుధవారంనాడు, అమ్మవారి విగ్రహావిష్కరణ వైభవంగా నిర్వహించారు. [4]

శ్రీ ముత్యాలమ్మతల్లి అలయం

మాచర్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీచెన్నకేశ్వస్వామివారి ఆలయ సమీపంలో నెలకొనియున్న ఈ ఆలయంలో, ఆలయ పునరుద్ధరణ, కలశ స్థాపన వేడుకలు, 2017,జూన్-4వతేదీ ఆదివారం ఉదయం 8-59 కి ప్రత్యేకపూజా కార్యక్రమాల మధ్య, వైభవంగా నిర్వహించారు. [13]

శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం

పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు మూడురోజులపాటు ఘనంగా నిర్వహించెదరు. చివరి రోజున శ్రీ సువర్చలా సమేత శ్రీ వీరాంజనేయస్వామివారల కళ్యాణమహోత్సవం కన్నులపండువగా నిర్వహించెదరు. అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించెదరు. [5]

శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం

మాచర్ల పాతూరులోని ఈ ఆలయంలో 2017,ఫిబ్రవరి-10వతేదీ శుక్రవారంనాడు, మాఘపౌర్ణమి సందర్భంగా, శ్రీ గోపయ్యస్వామి, శ్రీ తిరుపతమ్మ తల్లి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో భక్తులకు భారీగా అన్నసమారాధన నిర్వహించారు. [12]

మండలంలోని ప్రధాన పంటలు

ప్రత్తి, మిరప, వరి ప్రధాన వాణిజ్యపంటలు. నాణ్యమైన నాపరాయికి ఈ ప్రాంతంలోని క్వారీలు ప్రసిద్ధి. ఇక్కడి నుండి నాపరాయి ఇతర రాష్ట్రాలకూ,విదేశాలకూ ఎగుమతి అవుతుంది.

విశేషాలు

  • మేజర్ పంచాయతీ స్థాయినుండి పురపాలకసంఘంగా 1987లో రూపాంతరం చెందింది. ప్రస్తుతం పట్టణంలో 29 వార్డులున్నాయి.
  • రామా టాకీసు వీధి: ఈ వీధిలోనే ప్రధాన వాణిజ్యసముదాయాలూ, ఆసుపత్రులూ,మందులషాపులూ, సినిమాహలు వుండడంతో ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూవుంటుంది.
  • కె.సి.పి.సిమెంటు ఫాక్టరీ:1958 లో స్థాపించబడి, నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు, శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టుకు సిమెంటు సరఫరా చేసింది. ప్రస్తుతం దక్షిణభారతదేశంలోనే అత్యధికంగా సిమెంటు ఉత్పత్తిచేసే కర్మాగారాల్లో ఒకటిగావుంది.
  • మాచర్లకు దగ్గరలో బ్రహ్మనాయుడు చెరువు ఉంది.

ప్రముఖులు

  • షేక్ చిన లాలుసాహెబ్ ఆకాశవాణి నాదస్వర విద్వాంసులు
  • షేక్ పెద లాలుసాహెబ్ ఆకాశవాణి నాదస్వర విద్వాంసులు
  • షేక్ రంజాన్ సాహెబ్ ఆకాశవాణి నాదస్వర విద్వాంసులు

చిత్రమాలిక

మూలాలు

  1. The History of Andhra Country, 1000 A.D.-1500 A.D.: Administration, literature and society By Yashoda Devi పేజీ.39

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.