మహాంధ్రోదయం

మహోంధ్రోదయం ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య రచించిన ఖండకావ్యం. తెలంగాణ ప్రాంతం నిజాం పరిపాలన నుంచి విముక్తి పొంది హైదరాబాద్ రాష్ట్రంగా, మద్రాసు రాష్ట్రం నుంచి విడివడి ఆంధ్ర రాష్ట్రం మరోవైపు విడిగానూ మనుగడ సాగిస్తున్న రోజుల్లో ఆ రెండు ప్రాంతాలను కలిపి మహాంధ్ర రాష్ట్రం ఏర్పడాల్సిన ఆగత్యం వివరిస్తూ ఈ కావ్యరచన చేశారు.

మహాంధ్రోదయం
కృతికర్త: దాశరథి కృష్ణమాచార్య
అంకితం: సురవరం ప్రతాపరెడ్డి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: ఖండ కావ్యం
ప్రచురణ: తెలంగాణా రచయితల సంఘము, హైదరాబాదు
విడుదల: 1955

రచన నేపథ్యం

మహాంధ్రోదయం ఖండకావ్యాన్ని 1955లో తెలంగాణా రచయితల సంఘము ప్రచురించింది. ప్రముఖ పాత్రికేయులు, రచయిత, చరిత్రకారుడు సురవరం ప్రతాపరెడ్డికి ఈ కృతి అంకితమిచ్చాడు.మల్లంపల్లి సోమశేఖరశర్మఈ పుస్తకానికి పీఠిక వ్రాశాడు. బూర్గుల రామకృష్ణారావు, బెజవాడ గోపాలరెడ్డి ప్రశంసావాక్యాలు వ్రాశారు.[1]

గ్రంథకర్త గురించి

ప్రధానవ్యాసం: దాశరథి కృష్ణమాచార్య
దాశరథి కృష్ణమాచార్యులు ప్రముఖ కవి, నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, సినీ గేయకర్త. యువకునిగా ఉన్నప్పుడే దాశరథి ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం విధించిన జైలు శిక్ష అనుభవించాడు. నిజామాబాదు లోని ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదు చేసి ఉంచింది, నిజాము ప్రభుత్వం. ఆయనతోపాటు ఖైదులో వట్టికోట ఆళ్వారుస్వామి కూడా ఉన్నాడు. పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు. మంచి ఉపన్యాసకుడు. భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకడు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు పనిచేసాడు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు గెల్చుకున్నాడు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించారు.తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి.

కవితల జాబితా

మహాంధ్రోదయంలో 20 కవితలు ఉన్నాయి.[2], [3]

  • తెలంగాణ
  • మహాంధ్రోదయం
  • కోటి గొంతుకలు
  • శిల్పి
  • మంగళగీతి
  • నటస్వామి
  • గుండెలో దీపాలు
  • పూలలో జ్వాలలు
  • తెలంగాణ విముక్తి
  • తెలంగాణ తల్లి
  • పౌష లక్ష్మి
  • మధు రథము
  • మాధురి
  • రాగబంధము
  • మూర్ఛన
  • కపోతీ సందేశము
  • మంజీర
  • క్షమామూర్తి
  • కాపయ నాయకుడు
  • సాహిత్య సామ్రాజ్యము

మచ్చుతునక

నా యింటి చిన్నది నడుము సన్నముది క
  న్నుల తెల్గు సిగ్గులు మొలకలెత్త
నా వైపు సూచి నన్ వలపించుకొన్నది
  పాతకాలంపు సౌభాగ్య గరిమ
క్రొత్తనాటి వెలుంగు కూడగట్టినయట్టు
  లుంగరమ్ముల జుత్తు నొత్తికట్టి
తెలుగు సింగారాలు తలబ్రాలుగా జార
  పూలు ముడిచి ముద్దరాలు వోలె

నవ్వుల వెలార్చి నా యింటి నడుమ సోర
దీపమును కూర్చి పెట్టిన తెలుగుపిల్ల
కన్నడము కన్నడింపని కవన లక్ష్మి
రసభర విజృంభమాణ పూర్ణ కుచకుంభ

బయటిలింకులు

మూలాలు

  1. మహాంధ్రోదయం:దాశరథి రంగాచార్య(విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రకటించిన దాశరథి సాహిత్యం-1)
  2. దాశరథి సాహిత్యం-1:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్: విషయసూచిక
  3. భారతి మాసపత్రిక అక్టోబరు 1955 సంచిక పుట 98-100
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.