మల్లేపల్లి శేఖర్ రెడ్డి

మల్లేపల్లి శేఖర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవి. ఈ కవి స్వగ్రామం జిల్లాలోని తెల్కపల్లి మండలం లోని రాకొండ. భార్య పేరు మల్లేపల్లి సుభద్రమ్మ. శేఖర్ రెడ్డికి రుక్మాంగద రెడ్డి, మల్లికార్జున రెడ్డి అను ఇద్దరు కుమారులు, హైమావతి అను ఒక కూతురు సంతానం.

మల్లేపల్లి శేఖర్ రెడ్డి
మల్లేపల్లి శేఖర్ రెడ్డి
మల్లేపల్లి శేఖర్ రెడ్డి
జననంమల్లేపల్లి శేఖర్ రెడ్డి
మరణంమే 11, 2016
మహబూబ్ నగర్ జిల్లా, తెల్కపల్లి మండలం రాకొండ
వృత్తిఉపాధ్యాయుడిగా పనిచేశాడు
ప్రసిద్ధికవి
మతంహిందూ మతము
పిల్లలుముగ్గురు పిల్లలు

వృత్తి జీవితం

వృత్తి రీత్యా తెలుగు ఉపాధ్యాయులు. లింగాల ఉన్నత పాఠశాలలో సీనియర్ తెలుగు పండితుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. వృత్తి పరంగా ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచి చాలా మంది పండిత ఉపాధ్యాయులుగా ఎదగడానికి కారకులయ్యారు.

సాహిత్య జీవితం

రచనలు
  1. గురుత్రయ స్తోత్రం
  2. వివేక శంఖారావం -1
  3. గాయత్రీ రామాయణం
  4. హనుమద్రామాయణం
  5. చాటువులు
  6. రామగిరి రామయోగి చరితం
  7. వేంకటాచల మహత్యం
  8. దున్నయదాసు తత్వాలు
  9. రాఘవేంద్ర శతకం

ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే, ఒక వైపు వ్యవసాయ క్షేత్రంలో, మరో వైపు సాహితీ క్షేత్రంలో కృషి చేశారు. సాహితీ క్షేత్రంలో వారు కృషి చేసిందంతా భక్తి మార్గమే. అందుకనే వారి ద్యాసంతా బడి, గుడి, మడిపైనే అంటారు.హలం పట్టి పొలం దున్నుతూ, కలం పట్టి కవిత రాస్తూ ' పాలమూరు పోతన ' గా పేరు తెచ్చుకున్నారు. పాటలు, వచనం, పద్యం, సంకీర్తనల రూపంలో వీరి సాహిత్య కృషి సాగింది. కమలారామం అను వచన గ్రంథం, భజగోవిందం, భజేయతి రాజం, రాఘవేంద్ర స్తోత్రం మూడింటిని కలిపి గురుత్రయ స్తోత్రంగా తెలుగులోనికి అనువదించి, ముద్రించారు. వివేక శంఖారావం -1, అనే ఖండకావ్యం, గాయత్రీ రామాయణం, హనుమద్రామాయణం అను గేయ రచనలను చేసి ప్రచురించారు. చాటువులు, రామగిరి రామయోగి చరితం, వేంకటాచల మహత్యం అను హరికథ, దున్నయదాసు తత్వాలు వెలువరించారు. అభిలాష సాహితీ సాంస్కృతిక సంస్థకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అక్షర కిరణం, పసిడి మొగ్గల ప్రచురణలోనూ వీరి కృషి ఉంది.[1]. రాఘవేంద్ర శతకం వీరి చివరి రచన.

సాహితీ మిత్రులు

వీరు ప్రముఖ కవి, పరిశోధకులు కపిలవాయి లింగమూర్తికి అత్యంత సన్నిహితులు. అలాగే మరో పాలమూరు కవి రుక్మాంగదరెడ్డి వీరికి అత్యంత ఆత్మీయులు. ఎంతగా అంటే శేఖర్ రెడ్డి తన కుమారుడికి తన మిత్రుడి పేరునే పెట్టుకునెంతగా . తన పెద్ద కుమారుడికి రుక్మాంగద రెడ్డి అని పేరు పెట్టి తన మిత్రుడి పట్ల తనకున్న వాత్సల్యాన్ని చాటిన స్నేహశీలి శేఖర్ రెడ్డి. అలాగే రుక్మాంగద రెడ్డి కూడా తన మిత్రుడి చివరి రచన రాఘవేంద్ర శతకాన్ని అచ్చు వేయించి మిత్రుడి ఋణం తీర్చుకున్నాడు.

శేఖర్ రెడ్డి వ్యక్తిత్వం

మిత్రుడు రుక్మాంగద రెడ్డి మాటల్లో శేఖర్ రెడ్డి ... ." అతనిది స్వచ్ఛమైన మనసు. ప్రేమమయ జీవనం. ఆదర్శవంతమైన వ్యక్తిత్వం. జీవితాంతం గురువు గారికి సేవ చేసిన భాగ్యవంతుడు. నా అభివృద్ధికి ఎంతో తపన పడ్డాడు. నా మీది అంతులేని అభిమానంతో తన కొడుకుకు నా పేరు పెట్టకున్నాడు. ఎన్ని చెప్పినా అతని బాకీ తీరేది కాదు. కనుక తాను చివరి దశలో రాసిన 'గురు రాఘవేంద్ర ' శతకాన్ని అచ్చు వేయించాను." అని అంటాడు.

మరణం

శేఖర్ రెడ్డి తేది: 11.05.2016 రోజు ఈ ప్రపంచాన్ని విడిచివెళ్ళాడు.

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, జిల్లా ప్రత్యేకంలో మధ్యపేజి, తేది.05.03.2014
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.