మల్లిక్ (గాయకుడు)

మల్లిక్ గా రేడియో శ్రోతలకు పరిచితులైన కందుల మల్లికార్జునరావు (1921-1996) ప్రముఖ లలిత సంగీత స్వరకర్త.

వీరు 1921లో మచిలీపట్నంలో జన్మించారు. మచిలీపట్నంలో క్రోవి సత్యనారాయణ వద్ద సంగీత విద్యాభ్యాసం గావించారు. 1942లో ఆకాశవాణి మదరాసు కేంద్రంలో లలిత సంగీత స్వరకర్తగా (కంపోజర్) చేరి ఆ తరువాత విజయవాడ కేంద్రానికి 1972లో బదిలీపై వచ్చారు. లలిత సంగీత విభాగంలో సీనియర్ గ్రేడ్ మ్యూజిక్ కంపోజర్ గా పనిచేశారు. సినీరంగంలో కొంతకాలం పనిచేసి కీర్తి గడించారు. వెంపటి చినసత్యంగారితో కలిసి నృత్య నాటికలకు సంగీతం సమకూర్చారు. జానపద, లలిత సంగీత బాణీలలో తనదైన ముద్రవేసి పాడేవారు. స్వరపరచేవారు. లలిత సంగీతం ఆడిషన్ బోర్డు మెంబరుగా ఆకాశవాణికి సలహా సంప్రదింపులు అందించారు. భక్తిరంజని కార్యక్రమాలకు వీరు కొత్త ఒరవడి పెట్టారు.

అదిగో అల్లదిగో హరివాసము, తందనాన భళా తందనాన అన్నమయ్య కీర్తనలు వీరు పాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవారు. రజనీకాంతరావు గారి పర్యవేక్షణలో మదరాసు కేంద్రంలో లలితసంగీత విభాగంలో పనిచేసి తర్వాత విజయవాడకు బదిలీ అయ్యారు.

డా.వెంపటి చిన సత్యంగారి బృందంలో ఎంతో కాలం గాత్రసహకారం అందించారు. ప్రముఖ నర్తకీమణులు రాజసులోచన,శోభానాయుడు,మంజుభార్గవి,చంద్రకళ, కొత్తపల్లి పద్మ, రత్నపాప మొదలగువారి నృత్యప్రదర్శనలకు గాత్రసహకారం అందించారు. శ్రీనివాస కల్యాణం, చండాలిక, శ్రీకృష్ణ పారిజాతం, మోహినీ భస్మాసుర, వాల్మీకి మొదలైన ఎన్నో నృత్య రూపకాలకు సంగీతం సమకూర్చారు.

మల్లిక్ బంగారుపాప, భాగ్యరేఖ, లవకుశ, వింధ్యరాణి, సంపూర్ణ రామాయణం, భక్త శబరి, జయభేరి, చరణదాసి చిత్రాలలొ పాడారు. తమిళ చలనచిత్రరంగంలో - నేపథ్యగాయకుడు మల్లిక్ అంటే ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రలేఖ అనే తమిళచిత్రానికి తొలిసారిగా నేపథ్యగానం చేశారు.

ఆయన మదరాసు, హైదరాబాదు, విజయవాడ కేంద్రాలలో 38 సంవత్సరాలు అవిశ్రాంతంగా పనిచేసి, 1981లో పదవీ విరమణ చేశారు.

1952 నుండి 1993 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులుగా వ్యవహరించారు. ప్రతియేటా అన్నమాచార్య ఉత్సవాలలో పాల్గొన్నారు. - వెంకటేశ్వరునిపై అపార భక్తిప్రపత్తులు. అందుకేనేమో 1996 ఏప్రిల్ శనివారం 76వ ఏట విజయవాడలో ఆయన సునాయాస మరణం పొందారు.

మల్లిక్ స్వరపరచిన పాటలు

  1. అదివో అల్లదివో శ్రీహరివాసము (అన్నమాచార్య కీర్తన) - మధ్యమావతిలో ఇప్పుడు ప్రచారంలో ఉన్నబాణీ.
  2. తందనాన ఆహి (అన్నమాచార్య కీర్తన) - బౌళిలో ఇప్పుడు ప్రచారంలో ఉన్న బాణీ
  3. గురుతెరిగిన దొంగ కూగూగు (అన్నమాచార్య కీర్తన) - మోహనలో ఇప్పుడు ప్రచారంలో ఉన్న బాణీ
  4. ఎవరేమన్నా ఏమనుకున్నా (ఆరుద్ర రచన)

బిరుదులు

  1. మధుర గాయకుడు
  2. నాదకౌముది
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.