మందాడి ప్రభాకర రెడ్డి
ప్రభాకర రెడ్డి గా ప్రసిద్ధులైన డాక్టర్ మందాడి ప్రభాకర రెడ్డి (అక్టోబర్ 8, 1935 -నవంబర్ 26, 1997) ప్రముఖ తెలుగు సినిమా నటుడు, కథా రచయిత. స్వతహాగా వైద్యుడు అయినా నటన పై గల అనురక్తితో చాలా తెలుగు చిత్రాలలో నటించాడు. కొన్ని హిందీ, తమిళ చిత్రాలలో కూడా నటించాడు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలలో నటించాడు. 37 ఏళ్ల కెరీర్‌లో 472కు పైగా సినిమాల్లో నటించాడు. కార్తీక దీపం వంటి అనేక సినిమాలకు కథలను అందించాడు. హైదరాబాదు లోని మణికొండలో ఈయన స్మారకార్ధం డా.ప్రభాకరరెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురికి ఈయన పేరుపెట్టారు.
| డాక్టర్. ప్రభాకర రెడ్డి | |
| జన్మ నామం | మందాడి ప్రభాకర రెడ్డి |
| జననం | అక్టోబర్ 8, 1935 తుంగతుర్తి, నల్లగొండ జిల్లా, తెలంగాణ |
| మరణం | నవంబర్ 26, 1997 హైదరాబాదు, తెలంగాణ |
| క్రియాశీలక సంవత్సరాలు | 1960-1988 |
జీవిత సంగ్రహం
ప్రభాకరరెడ్డి, సూర్యాపేట జిల్లా, తుంగతుర్తిలో లక్ష్మారెడ్డి, కౌసల్య దంపతులకు 1935, అక్టోబర్ 8 న జన్మించాడు. తుంగతుర్తిలో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత హైదరాబాదులోని సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. 1955 నుండి1960 వరకు ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్యవిద్యను అభ్యసించాడు. 1960లో గుత్తా రామినీడు దర్శకత్వం వహించిన చివరకు మిగిలేది సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాలో ఒక మానసిక వైద్యుని పాత్ర పోషించాడు. ఈయన సినీ ప్రస్థానంలో మొత్తం 472 సినిమాల్లో నటించాడు. మంచి విజయాలను సాధించిన పండంటి కాపురం, పచ్చని సంసారం, ధర్మాత్ముడు, గృహప్రవేశం, గాంధీ పుట్టిన దేశం, కార్తీకదీపం, నాకు స్వతంత్రం వచ్చింది వంటి సినిమాలతో పాటు మొత్తం 21 తెలుగు సినిమాలకు కథలను అందించాడు.
ప్రభాకరరెడ్డి 1997, నవంబరు 26[1] తేదీన తన 62వ యేట హైదరాబాదులో మరణించాడు.
పురస్కారాలు
- 1981 - నంది ఉత్తమ నటుడు - పల్లె పిలిచింది చిత్రం లోని నటనకు
- 1980 - నంది ఉత్తమ నటుడు - యువతరం కదిలింది చిత్రం లోని నటనకు
- 1990లో చిన్నకోడలు సినిమాలో ఉత్తమసహాయ నటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు
- ఉత్తమ కథారచయితగా గృహప్రవేశం, గాంధీ పుట్టిన దేశం సినిమాలకు నంది పురస్కారాలను అందుకున్నాడు.