భవనం వెంకట్రామ్

భవనం వెంకట్రామ్ (జూలై 18, 1931 - ఏప్రిల్ 7, 2002) అని అందరూ పిలిచే భవనం వెంకట్రామిరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రి. ఈయన 1982 ఫిబ్రవరి 24 నుండి సెప్టెంబర్ 20 వరకు ఏడు నెలల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాష్ట్ర ముఖ్య మంత్రులు నారా చంద్రబాబునాయుడు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈయన మంత్రి వర్గములోనే కలసి మంత్రులుగా పనిచేశారు.

భవనం వెంకట్రామ్


ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి
పదవీ కాలము
24/02/1982—20/09/1982
ముందు టంగుటూరి అంజయ్య
తరువాత కోట్ల విజయభాస్కరరెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం జూలై 18, 1931
మరణం ఏప్రిల్ 7, 2002
రాజకీయ పార్టీ కాంగ్రెసు
మతం హిందూ

వెంకట్రామ్ 1931 జూలై 18గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలము గొల్లపాడు గ్రామములో జన్మించాడు. ఈయన గుంటూరు పట్టణములో న్యాయవాద వృత్తి ప్రాక్టీసు చేసేవాడు. రాజకీయాలలో రాకముందు ఈయన పూర్వపు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వములో మంత్రి అయిన కందుల ఓబులరెడ్డి దగ్గర పర్సనల్ అసిస్టెంటుగా పనిచేశాడు.

రాజకీయ జీవితం

1978లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో విద్యా శాఖా మంత్రిగా చేరి శాసన మండలికి నియమితుడైనాడు. వెంకట్రామిరెడ్డి కుల రాజకీయాలకు వ్యతిరేకముగా పేరులోని రెడ్డి విడచి ఆ తరువాత అధికారములోకి వచ్చిన అంజయ్య మంత్రివర్గములో కూడా మంత్రిగా కొనసాగాడు.

1982లో ఈయన కాంగ్రేసు పార్టీ అధిష్టాన వర్గము యొక్క అండతో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి తన పాత రూం మేట్ అయిన ఎన్.టి.రామారావుని ఆహ్వానించాడు. అక్కడే రామారావుకు రాజకీయాలలోకి రావలన్న ఆలోచనకు బీజము పడినదని చెబుతారు. పలనాడు ప్రాంతానికి చెందిన వెంకట్రాం నందమూరి తారక రామారావుకు గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కళాశాల (ఎ.సి.కాలేజి)లో చదివే రోజులలో సన్నిహిత స్నేహితుడు. 7 నెలల పాలన తర్వాత ఈయన అధిష్టాన వర్గము కోరిక మేరకు రాజీనామా చేసి కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గము సుగమము చేశాడు.

1982లో దేశములోనే మొదటిదైన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్శిటీ) ను నెలకొల్పడము వెంకట్రామ్ ముఖ్యమంత్రిగా సాధించిన పనులలో ఒకటి. కొంతకాలం రాజకీయ సన్యాసము తరువాత వీ.పీ.సింగ్ యొక్క జనతా దళ్ పార్టీలో చేరి తిరిగి కాంగ్రేసు కొచ్చాడు. 2000లో రాం విలాస్ పాశ్వాన్, లోక్ జన శక్తి అనే కొత్త పార్టీ పెట్టినప్పుడు ఈయన ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ శాఖా అధ్యక్షుడయ్యాడు.

వ్యక్తిగత జీవితం

ఈయన భార్య భవనం జయప్రద 1967 నుండి 1978 వరకు వినుకొండ నియోజక వర్గము నుండి శాసనసభ సభ్యురాలు. ఈమె పి.వి.నరసింహారావు మంత్రివర్గములో విద్యుచ్ఛక్తి శాఖా మంత్రిగా మరియు జలగం వెంగళరావు మంత్రివర్గములోను మంత్రిగా పనిచేసింది. వీరికి ఇద్దరు కుమార్తెలు.

మరణం

వెంకట్రామ్ 2002 ఏప్రిల్ 7 న 71 సంవత్సరాల వయసులో గుండెపోటుతో హైదరాబాదులోని మహావీర్ ఆసుపత్రిలో మరణించాడు.[1]

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.