బ్రహ్మాండ పురాణము

బ్రహ్మాండ పురాణము (Brahmanda Purana) ఒక హిందూ ధార్మిక గ్రంథము. ఇది ముఖ్యమైన పురాణాలలో ఒకటి. సంఖ్యాపరంగా దీనిని 18వ పురాణంగా చెబుతారు. ఈ గ్రంథంలో ఆధ్యాత్మ రామాయణము అంతర్గతమై ఉంది.

బ్రహ్మ తెలిపిన విశ్వతత్వము (బ్రహ్మాండము) గురించి ఇందులో ఉన్నందున దీనికి "బ్రహ్మాండపురాణము" అనే పేరు వచ్చింది. ఇందులో విశ్వము లేదా సకల జగత్తు ఒక హిరణ్యమయమైన అండము (బ్రహ్మాండము) నుండి ఉద్భవించినట్లుగా తెలుపబడింది. ఆధ్యాత్మ రామాయణము, రాధాకృష్ణుల విశేషములు, పరశురామావతారము వంటి కథలు ఈ పురాణంలో ఉన్నాయి. ఇందులో మొత్తం 12,000 శ్లోకాలున్నాయి. ఒక బ్రాహ్మణునికి బహుమతిగా ఇవ్వడానికి ఇది ఉచితమైన గ్రంథమని చెబుతారు.

ముఖ్యాంశాలు

వాయుదేవుడు తనకు చెప్పనట్లుగా తాను ఈ విషయాలను ఋషులకు చెబుతున్నానని సూతుడు ఈ పురాణంలోని విషయాలను తెలిపాడు.

యుగములు, వాని ప్రమాణములు

దేవతల కాల ప్రమాణము మన (మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.

  • కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
  • త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
  • ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
  • కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు

మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము). ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయము అంటారు. పగలు గడిచిన తరువాత బ్రహ్మ విశ్రమించును. అప్పుడు సృష్టి నశించి ప్రళయం సంభవిస్తుంది.

యుగ ధర్మములు

కృతయుగంలో స్త్రీపురుషులంతా బహుచక్కనివారు, ఆరోగ్యవంతులు, దీర్ఘాయువులు, ధర్మకార్య తత్పరులు. దురాశ, దంభము, మచ్చరములెరుగరు. సద్యోగర్భమున సంతానము కంటారు. జనులు చెట్ల తొఱ్ఱలయందును, గుహలయందును, భూబిలంబులందును నివసింతురు. అందరిదీ ఒకే జాతి.

త్రేతాయుగంలో జనులకు రజోగుణము ప్రధానముగా ఉంటుంది. వర్షములు పుష్కలముగా కురియును. జనులు సత్యమును తప్పరు. వారిలో క్రమంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులేర్పడును. మానవులలో హర్షము, ద్వేషము వంటి ద్వంద్వగుణములు రూపుదిద్దుకొనును. స్త్రీపురుషులకు భోగేచ్ఛ అధికమగును. తపస్సు పట్ల బద్ధకము పెరుగును. వ్యాపారమునందు ఆసక్తి పెరుగును. గ్రామములు, పట్టణములు ఏర్పడును. కొలతలు ఇతర ప్రమాణములు ఏర్పడును. పెక్కు ధాన్యములు లభించును. వృత్తుల ప్రాధాన్యత పెరుగును.

ద్వాపరయుగంలో జనులకు లోభగుణమతిశయించును. ధనము పట్ల కోరిక పెరుగును. ధర్మ సంఘము, వర్ణ సంకరము కూడా కలుగుతాయి. ఈ బుద్ధిమార్పులను గ్రహించి వ్యాసుడు వేదములను విభజించును. అనావృష్టి, అకాల మరణములు ప్రబలనారంభించును.

కలియుగంలో అసత్యము, హింస, అసహనము అతిశయించును. జనులకు రోగబాధలు, ఈతి బాధలు అధికమగును. దుర్వృత్తులు అవలింబింతురు. వ్యభిచారము పెరుగును. జనులందరు వర్తకముపైనే అత్యధికంగా ఆసక్తి చూపెదరు. పుణ్యకార్యఫలితములు అమ్ముకొనసాగెదరు. అతిథి అభ్యాగత ఆదరణ నశించును. జనులు అల్పాయుష్కులగుదురు. ప్రజలకు ఆయువు తక్కువ అగుట వలన కొద్దిపుణ్యకార్యములకే అధిక ఫలములు లభించునట్లు భగవంతుడు చేయును. త్రేతాయుగంలో తపమువలన జనించిన ఫలము ద్వాపరంలో ఒక్క మాసమునందు, కలియుగంలో ఒక్కరోజునందు లభించును.

రాక్షసులు సూర్యుని అడ్డగించుట

ప్రళయకాలంలో జలార్ణవంలో మునిగిన భూమిని తేల్చుటకై జలములనింకించుటకు ఆదిపరబ్రహ్మమూర్తి సూర్యభగవానుని సృజించెను. ఇలా ఉండగా మందేహాసురులనే రాక్షసులు మూడుకోట్లమంది సూర్యుని కిరణాలను మింగివేస్తూ ఉదయాస్తమయకాలాలలో సూర్యుని నిరోధింపసాగారు. అప్పుడు ఆదిత్యునకు, ఆ రాక్షసులకు యుద్ధాలు జరిగేవి. ఋషులు, మునులు గాయత్రిని జపించి బ్రహ్మాస్త్రముగా చేసి, అర్ఘ్యప్రదానము అనే వింట సంధించి ఆ రాక్షసులను నిర్జింపడానికి సహాయపడ్డారు. తరువాత సూర్యకిరణములు నిరాటంకంగా ప్రసరిస్తున్నాయి.

సూర్య గమనం వలన కాలం ఏర్పడుతున్నది. ఆ కాలం కొలమానం ఇలా ఉంది.

  • 15 నిముషములు ఒక కాష్ఠ; 30 కాష్ఠలు ఒక కల; 30 కలలు ఒక ముహూర్తము; 30 ముహూర్తములు ఒక దినము.
  • సంధ్య యనగా ఒక ముహూర్త కాలము. సూర్యోదయం మొదలు మూడు ముహూర్తములు ప్రాతఃకాలము. తరువాతి మూడు ముహూర్తములు సంగమకాలము. ఆపై మూడు ముహూర్తములు మధ్యాహ్నము. పిమ్మట మూడు ముహూర్తములు అపరాహ్ణము. ఆ వెనుక వచ్చు మూడు ముహూర్తములు సాయంకాలము.
  • ఇలా దినానికి పగలు 15 ముహూర్తములు, రాత్రి 15 ముహూర్తములు ఉంటాయి.

వాలి వృత్తాంతము

వాలి బలం గురించి విన్న రావణుడు బలాబలాలు తేల్చుకోవడానికి అతనితో పోరుకు బయలుదేరాడు. సంధ్యావందనం చేసుకొంటున్న వాలిని వెనుకనుండితన బాహుబంధంలో ఇరికించబోయాడు. రావణుని అలాగే వడిసిపట్టుకొని వాలి అన్ని సముద్ర తీరాలకు వెళ్ళి తన సంధ్యావందన కార్యక్రమం ముగించుకొన్నాడు. గర్వం హరించిన రావణుడు వాలిని ప్రశంసించి అతనితో సంధి చేసుకొన్నాడు.

అహల్యకు ఇంద్ర, సూర్యులవలన జనించిన వాలి, సుగ్రీవులను ఖడ్గరాజు అనే వానరరాజు పెంచాడు. దుందుభి అనే రాక్షసునితో వాలి యుద్ధం చేసినపుడు (కిష్కింధ కాండ చూడండి) సుగ్రీవుడు అకారణంగా వాలి ఆగ్రహానికి గురయ్యాడు. వాలి సుగ్రీవుని తరిమివేశాడు. సుగ్రీవుడు రామునితో మైత్రి చేసుకొన్నాడు. అప్పుడు రాముడు చెట్టుమాటునుండి వేసిన తన బాణంతో వాలిని చంపేశాడు. అనంతరం రాముడు వాలికి అగ్ని సంస్కారములు చేయించి సుగ్రీవుని వానర రాజుగా అభిషేకింపజేశాడు.

శ్రాద్ధక్రియ, విమర్శనదినము

చనిపోయినవాఱికి శ్రాద్ధక్రియ ఎందుకు చేయాలని మునులు అడుగగా సూతుడు ఇలా వివరించాడు - మరణించిన జీవుడు ప్రేతరూపంలో ఒక సంవత్సరకాలం ఉండును. అందులో మొదటి పదిరోజులు ఆజీవుని పంచప్రాణాలలో ఒకటి చనిపోయిన స్థలంలోను, మరొకటి శ్మశానంలోను, మూడవది కర్తయందును, నాలుగవది వాయసములందును, ఐదవది వాయువునందును ఉండును. ఎత్తిపోతలు (సంచయము) అయ్యేదాకా ఆ ప్రాణములు దుర్భరమైన తాపము అనుభవించుచుండును. యథోక్తముగా కర్మలు చేసిన తరువాత ఆ ప్రాణములన్నియు తాపము శమించి, ఒకచోట చేరి యాతనా శరీరము ధరించును. ఆ యాతనాశరీరము (ప్రేతాత్మ) నరకమునకు పోవుటకు ఒక సంవత్సరము కాలము పట్టును. మనకొక మాసము వారికి ఒక దినము. కనుక ప్రతినెల మాసికము పెట్టవలయును. యమలోకమునకు పోవు మార్గములో 18 తావుల ఆగుదురు కనుక 18 మాసికములను పెట్టి, సంవత్సరాంతమున సాహపిండము పెట్టవలెను. ఆ నాటితో మృతులు ప్రేతరూపమును చాలించి పితృదేవతలగుదురు. పితృదేవతలు కూడా దేవతా సమానులే.

సంవత్సరాంతమున - సాంవత్సరికము జరిగిన మరుదినము అయిన విమోకము నాడు - యాతనా శరీరములో నున్న జీవుని యమభటులు యమధర్మరాజు వద్ద ప్రవేశపెట్టుదురు. చిత్రగుప్తుని ఖాతాను కాలము, సూర్యచంద్రుల సాక్ష్యముతో సరిచూచెదరు. జీవులు శిక్షలేమైనా ఉంటే అనుభవించి ఆపైన వారు పుణ్యలోకమునకు పోవుదురు. కర్మ జరుగని జీవులు ప్రేతరూపములోనే ఉండవలసివచ్చును. అట్టివారికి గయలో పిండప్రదానము చేసినట్లయితే వారి ప్రేతరూపము పోయి పుణ్యలోకములు ప్రాప్తించును.

సంవత్సరికము పెట్టిన మరుసటి దినమున తిథి ప్రయోజనము (ఆబ్దికము) పెట్టవలెను. తదాధి ప్రతి సంవత్సరము మృతనమాసమున పితరులను, విశ్వేదేవతలను అర్చించవలెను.

మృగమృగీ సంవాదము

సాక్షాత్తు పరమేశ్వరానుగ్రహం పొందిన పరశురాముడు అగస్త్యుని వద్దకు వెళ్ళి ఉపదేశం ఎందుకు పొదవలసివచ్చిందని మునులు ప్రశ్నించారు. అందుకు సూతుడు ఇలా వివరించాడు.

పరశురాముడు ఈశ్వరునికి శిష్యుడై పాశుపతాది దివ్యాస్త్రాలను, వాసుదేవ మంత్రమును, త్రిలోక విజయము అనబడు శ్రీకృష్ణకవచమును ఉపదేశంపొందాడు. పుష్కరతీర్ధమున తపస్సు చేయసాగాడు. ఆ సమీపంలో ఒక లేళ్ళ జంట నీరు త్రాగి విశ్రమించాయి. వాటిని చంపడానికి ఒక వేటగాడు వచ్చి, పరశురామునికి భయపడి, ఒక పొదమాటున దాగి ఉన్నాడు. వాటిలో మగలేడి పూర్వజన్మలో ఒక విప్రబాలకుడు. పరశురాముని దర్శనభాగ్యం వలన దానికి పూర్వజన్మ వృత్తాంతము, జ్ఞానము అవగతమయ్యాయి. ఆడులేడి, మగలేడి మధ్య జరిగిన సంభాషణ సారాంశం ఇది -

"పరశురాముడు గొప్పతపస్వి. ఈశ్వరునినుండి కృష్ణకవచం ఉపదేశంపొంది నూరు సంవత్సరాలు జపించినా ఆ మంత్రము సిద్ధింపలేదు. దైవమునకు భక్తి ప్రదానము. శివుడు, నారదుడు, శుకుడు, అంబరీషుడు, బలి, విభీషణుడు, ప్రహ్లాదుడు ఉత్తమ భక్తులు. వశిష్ఠాది మహామునులు, అష్టమనువులు, పరశురాముడు మధ్యతరగతికి చెందినవారు. పరశురాముడు అగస్త్యాశ్రమమునకు పోయి అక్కడ శ్రీకృష్ణామృతస్తోత్రమును ఉపదేశము పొందిన యెడల అతనికి మంత్రము సిద్ధించును."

ఈ సంభాషణ విని పరశురాముడు అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయనతో కూడా లేళ్ళు కూడా వెళ్ళాయి. అగస్త్యునికి నమస్కరించి పరశురాముడు అతనినుండి శ్రీకృష్ణస్తోత్రకదంబును విని మంత్రసిద్ధిని పొంది, తన ఆశ్రమమునకు వచ్చి తన శపథమును (కార్తవీర్యార్జునుని నిర్జించుట) నెరవేర్చుకొనెను. హరిణముల జంట కూడా ఉపదేశవాక్యములను విని, దివ్యశరీరములు పొంది, వైకుంఠమునకు వెళ్ళెను.

పరశురాముడు, గోకర్ణ క్షేత్రము

స్వాయంభువు మనువు సంతతి

జల స్థల విభాగము

సూతుడు ప్రపంచములోని భూభాగములు, జలభాగముల గురించి ఇలా చెప్పాడు - స్వాయంభువమనువు కొడుకు ప్రియవ్రతుడు. ప్రియవ్రతునికి 10 మంది కుమారులు, ఇద్దరు కుమార్తెలు. స్వాయంభువ మనువు తన మనుమలలో ఏడుగురిని ఏడు ద్వీపములకు చక్రవర్తులను చేసెను. వారు తమ తమ సంతానానికి ఆయా ద్వీపాలను పంపకం చేయడం వలన అనేక రాజ్యాలు ఏర్పడినాయి. అలా ముందుగా వివిధ ద్వీపాలకు చక్రవర్తులైన మనువు మనుమలు

  1. జంబూద్వీపం - అగ్నీంద్రుడు
  2. ప్లక్షద్వీపం - మేధాతిథి
  3. శాల్మలీద్వీపం - వపుష్మంతుడు
  4. కుశద్వీపం - జ్యోతిష్మంతుడు
  5. క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు
  6. శాకద్వీపం - హవ్యుడు
  7. పుష్కరద్వీపం - సేవనుడు.
  • జంబూద్వీపం - నేరేడు పండ్లు ఎక్కువగా ఉంటాయి. జంబూద్వీపము 9 వర్షాలు లేదా భాగాలుగ విభజించబడింది. అవి (1) ఇలావృత (హిమాలయాలు మరియు టిబెట్ ప్రాంతము) - (2) భధ్రవర్ష (హిమాలయాల తూర్పు ప్రాంతము) - తూర్పు (3) హరి (అరేబియా) - దక్షిణము (4) కేతుమాలం (ఇరాన్, టర్కీ ) పశ్చిమం (5) రమ్యక (రష్యా, సైబీరియా) ఉత్తరము (6) హిరణ్మయ (మంచూరియా) ఉత్తరము (7) కురు (మంగోలియా) ఉత్తరము (8) కింపురుష / కిన్నర (హిమాలయాల దక్షిణ ప్రాంతాలు) దక్షిణము (9) భరత (భారత ఉపఖండము) - ఈ ద్వీపము చుట్టు లవణాంబుధి యున్నది. ఈ ద్వీపంలో 6 పర్వతాలు - హిమాలయము, మేరు పర్వతము, నీలాచలము, హిమాచలము, శ్వేతాచలము, మాల్యవంతము, గంధమాదనము, వింధ్యపర్వతము.
  • ప్లక్షద్వీపం - ఇది జంబూద్వీపంకంటె రెండురెట్లు పెద్దది. ఇందు ప్లక్ష (జువ్వి) చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ ద్వీపానికి ఒకవైపు ఉప్పునీటి సముద్రము, మరొకవైపు రససముద్రము ఉన్నాయి; పర్వతాలు - గోమోదకము, నారదాచలము, దుందుభి పర్వతము, సోమకాచలము, సుమనోపర్వతము; నదులు - అనుతప్త, సుఖి, విపాశము త్రివిక్రము, అమృత, సుకృత
  • శాల్మలీద్వీపం - ఇది ప్లక్ష ద్వీపంకంటె పెద్దది. ఇందులో ఒక మహోన్నతమైన శాల్మలి (బూరుగు) వృక్షం ఉంది. ద్వీపానికి ఒక ప్రక్క ఇక్షుసముద్రము, మరొక ప్రక్క సురసముద్రము ఉన్నాయి; ఇందులో పర్వతాలు - కుముద, వలాహక, ద్రోణ, మహిష; ఔషధులు - సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి వంటి దివ్యౌషధాలున్నాయి; నదులు - జ్యోతిస్సు, శాంతి, తుష్కచంద్ర, శుక్ర, విమోచన, నివృత్తి.
  • కుశద్వీపం - ఇది శాల్మలీ ద్వీపంకంటె రెట్టింపు పెద్దది. ద్వీపానికి ఒక ప్రక్క ఘృతసముద్రము, మరొక ప్రక్క సురసముద్రము ఉన్నాయి. పర్వతాలు - విద్రుమాద్రి, హేమాద్రి, మృతిమంతము, పుష్పకాద్రి, కులేశయము, హరిగిరి, మందరము; నదులు - ధూత, పాఫ, శివ, పవిత్ర, సంతతి, విద్యుమ్న, దంభ, మాహీ.
  • క్రౌంచద్వీపం - ఈ ద్వీపానికి ఒక ప్రక్క ఘృతసముద్రము, మరొక ప్రక్క దధిసముద్రము ఉన్నాయి.; పర్వతాలు - క్రౌంచాచలము, వామనపర్వతము, అంధకాచలము, దివావృతాద్రి, ద్వివిధగిరి, పుండలీకాద్రి, దుందుభిస్వనగిరి.; నదులు - గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజన, ఖ్యాతి, పుండరీక.; దేశములు - కుశల, వామన, గోష్ఠ, పవరము
  • శాకద్వీపం - ఇది క్రౌంచ ద్వీపంకంటె రెట్టింపు పెద్దది. వలయాకారంలో ఉంది. కేతువు అనే మహావృక్షం ఉంది. ద్వీపానికి ఒక ప్రక్క మంచినీటి సముద్రము, మరొక ప్రక్క పెరుగు సముద్రము ఉన్నాయి; పర్వతాలు - ఉదయాద్ర్రి, జలధార, రైవతకాద్రి, శ్యామలాద్రి, హస్తాద్రి, అంబికేయాద్రి, కేసరాద్రి; విషయములు -జలదము, సుకుమారము, కౌమారము, మణీవకము, మహాద్రుమము; నదులు - సుకుమారి, కుమారి, నళిని, రేణుక, ఇక్షువు, గభస్తి.
  • పుష్కరద్వీపం - ఇది శాక ద్వీపంకంటె రెట్టింపు పెద్దది. ద్వీపానికి ఒక ప్రక్క మంచినీటి సముద్రము, మరొక ప్రక్క క్షీర సముద్రము ఉన్నాయి. పర్వతాలు - చిత్రసాను, మానసోత్తర; నదులు లేవు.

విశ్వే దేవతలు

అశ్వినీ దేవతలు

వైవస్వత మనువు

సుద్యుమ్నుడు

ధన్వంతరి

కాశీపుర నిర్మాణము

విష్ణువునకు భృగుశాపము

జయంతి, శుక్రుడు, బృహస్పతి

ఇవి కూడా చూడండి

మూలాలు, వనరులు

    • అష్టాదశ పురాణములు - (18 పురాణముల సారాంశము) - రచన: బ్రహ్మశ్రీ వాడ్రేవు శేషగిరిరావు - ప్రచురణ, సోమనాథ్ పబ్లిషర్స్, రాజమండ్రి (2007)

    బయటి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.