బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త

బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త మహబూబ్ నగర్ జిల్లా చెందిన తెలుగు కవి. ఈ కవి స్వస్థలం జిల్లాలోని బిజినపల్లి. ఇంటి పేరు బాదం, అయినా తన ఊరిపేరే ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. నాలుగు దశాబ్దాలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి, ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాడు. సొంతూరులో గ్రంథాలయాన్ని స్థాపించాడు. నిజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో సైతం పాల్గొని, జైలు జీవితాన్ని అనుభవించాడు. జాతీయ విప్లవం, సామాజిక చైతన్యం, మానసిక పరివర్తనం వర్ధిల్లాలనేదే ఈ కవి ఆశయం, ఆకాంక్ష[1]..

బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త
జననంబిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త
1929, అక్టోబర్ 02
మహబూబ్ నగర్ జిల్లా,బిజినపల్లి
మరణం2008, జులై 24
ప్రసిద్ధికవి
మతంహిందూ
తండ్రిబాదం శంభయ్య
తల్లిలక్ష్మమ్మ

కుటుంబ నేపథ్యం

బిజినేపల్లికి చెందిన బాదం శంభయ్య, లక్ష్మమ్మ దంపతులకు లక్ష్మీకాంతం గుప్త 1929, అక్టోబర్ 02 వ తేదిన జన్మించాడు[2]... మధ్య తరగతి వైశ్య కుటుంబంలో జన్మించిన గుప్త బాల్యంలోనే తండ్రిని కోల్పోయి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. హైదరాబాదులోని వైశ్య వసతి గృహంలో ఉండి, చదువును కొనసాగించి, స్వాతంత్ర్యానికి పూర్వమే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు.

వృత్తి జీవితం

నాలుగు దశాబ్దాలు ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితాన్ని గడిపిన గుప్త, 1987లో ఉద్యోగ విరమణ చేశాడు. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాడు. 1985లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై గౌరవించబడ్డాడు.

సాహిత్య కృషి

ఈ కవి, కవి కన్న ముందు గాయకుడు. మొదట్లో జి. నారాయణ రావు అనే తన మిత్రుడు రాసిన గేయాలను వివిధ సంధార్భాలలో, సమావేశాలలో పాడి వినిపించేవాడు. అలా కవిత్వ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్‌లోని వైశ్య హాస్టల్‌లో చదువుకొనే సమయంలోనే తొలిసారి రచనా రంగంలోకి అడుగుపెట్టి ...

వాసవీ కుమారులు రారండి!
వైశ్య సోదరులిక లేవండి.
వసుధలోన మీ వాసిని నిల్పగ, వడివడిగా త్యాగం చేయండి.

అంటూ కుల సోదరులకు మేలుకొల్పు గీతాన్ని వినిపించి కలమందుకొన్న ఈ కవి...తర్వాత తన జన్మభూమి పాలమూరును- నీవే దిక్కను వారల నీట ముంచక మంచి పాలముంచు మా పాలమూరు అని కీర్తిస్తూ, వీరభోగ్య వసుంధరా! పేరబరగు భారతాంబరో నేనెంత ప్రస్తుతింప! అని తన దేశాన్ని ప్రేమిస్తూ కవిత్వం రాశాడు.

రచనలు
  • పగడాల మాల
  • గాంధీ పథం
  • నవ్య జగత్తు
  • చంపకోత్పల సౌరభం
  • కాలమా నీ బలమెంత?
నవ్య జగత్తు

గుప్త రాసిన పుస్తకాలలో ఆణిముత్యం లాంటి పుస్తకం- నవ్య జగత్తు. ఇది పద్య జగత్తు, గేయ జగత్తు, వచన కవితా జగత్తుల సమ్మేళనం. అంటే మూడు ప్రక్రియల ముచ్చటైన పుస్తకమన్న మాట. ఇందులోని కవిత ఏ రూపంలో ఉండినా, అద్భుతమైన రసగులికే. కొన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రసారమైన సమస్యా పూరణలకు పూరించిన పద్యాలు ఇందులో ఉన్నాయి. మరికొన్ని హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రాలలో స్వయంగా కవి గానం చేసి, వినిపించిన కవితలు కొన్ని ఉన్నాయి.

బయటి లంకె

మూలాలు

  1. నవ్య జగత్తు,(స్వకీయం), రచన:బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త, వాసవీ సాహిత్య పరిషత్ ప్రచురణలు, హైదరాబాద్, పుట-17
  2. పాలమూరు ఆధునిక యుగకవుల చరిత్ర,, రచన: ఆచార్య ఎస్వీ రామారావు, పసిడి ప్రచురణలు, హైదరాబాద్,2012, పుట-81
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.