ప్రకాశం బ్యారేజి

ప్రకాశం బ్యారేజి : విజయవాడ వద్ద, కృష్ణా నది పై నిర్మించిన బ్యారేజి. దీని పొడవు 1,223.5 మీటర్లు (4,014 అడుగులు) దీని నిర్మాణ బాధ్యతలు ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో సర్ ఆర్థన్ కాటన్ చేపట్టాడు. దీని నిర్మాణ 1852 లో ప్రారంభమై 1855 లో పూర్తయింది. కృష్ణా, గుంటూరు జిల్లాలలోని కృష్ణా డెల్టా ప్రాంతానికి సాగునీటిని అందించే నీటిపారుదల ప్రాజెక్టు ఈ ప్రకాశం బారేజి. ఇప్పటి బారేజి 1952లో నిర్మించబడినా, అంతకు 100 సంవత్సరాల కిందటే -1853లో - కృష్ణా నది జలాలను వినియోగించుకోవడాన్ని ఉద్దేశించిన మొట్టమొదటి నిర్మాణం జరిగింది. అదే కాటన్ ఆనకట్ట. తెలుగుదేశంలో సర్ ఆర్థన్ కాటన్ నిర్మించిన రెండు ప్రముఖ ఆనకట్టలలో ఇది రెండోది. మొదటిది, గోదావరి నదిపై గల కాటన్ బారేజి.

ప్రకాశం బ్యారేజ్
విజయవాడ వద్ద కృష్ణా నదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజి
Location of ప్రకాశం బ్యారేజ్
అధికార నామంప్రకాశం బ్యారేజి
దేశంభారత దేశము
ప్రదేశంవిజయవాడ, ఆంధ్ర ప్రదేశ్
అక్షాంశ,రేఖాంశాలు16°30′22″N 80°36′18″E
స్థితిOperational
నిర్మాణం ప్రారంభం1852
ప్రారంభ తేదీ1855
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంBarrage
నిర్మించిన జలవనరుకృష్ణా నది
పొడవు1,223.5 m (4,014 ft)

నేపథ్యం

1832, 1833 లలో ఈ ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడింది. డొక్కల కరువు, నందన కరువు, గుంటూరు కరువు, పెద్ద కరువు గా పేరుపొందిన ఈ కరువు వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఎక్కడ చూసినా శవాలగుట్టలే కనిపించేవి. దాదాపు 40% ప్రజలు ఈ కరువుకు బలయ్యారు. బ్రిటిషు ప్రభుత్వం పన్నుల రూపేణా రూ.2.27 కోట్లు నష్టపోయింది. ఇంత తీవ్ర కరువులోనూ కృష్ణానది ఎండిపోలేదు. అయినా ఆ నీటిని వాడుకునే మార్గం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో కృష్ణ నీటిని సాగుకు వాడుకునే ఉద్దేశంతో నదిపై బెజవాడ (విజయవాడ) వద్ద ఆనకట్టను ప్రతిపాదించారు.

ఆనకట్ట నిర్మాణం

ప్రతిపాదన కార్యరూపానికి రావడానికి మరో ఇరవై ఏళ్ళు పట్టింది. బెజవాడ వద్ద ఎడమ గట్టునగల ఇంద్రకీలాద్రి, కుడి గట్టున ఉన్న సీతానగరం మధ్య ఈ ఆనకట్ట నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఆనకట్ట నిర్మాణం 1853లో మొదలై, 1854లో పూర్తయింది. 1132 మీ. పొడవు, 4 మీటర్ల ఎత్తుతో అనకట్ట పైగుండా వరదనీరు ప్రవహించేలా నిర్మించబడింది. రూ.1.49 కోట్లు ఖర్చయింది. 10 ప్రధాన కాలువల ద్వారా సాగునీటి సరఫరా చేయడం మొదలుపెట్టారు. కాలువల నిర్మాణాన్ని కాటన్ శిష్యుడైన మేజర్ ఓర్ పర్యవేక్షించాడు. వంద సంవత్సరాలపాటు ఆనకట్ట ప్రజలకు వరప్రసాదమైంది. 1952లో వచ్చిన వరదలకు అది కొట్టుకొని పోవడంతో మరో ఆనకట్ట ఆవశ్యకత ఏర్పడింది.


బారేజి నిర్మాణం


పాత ఆనకట్ట కొట్టుకొని పోయిన వెంటనే కొత్త బారేజి నిర్మాణం మొదలయింది. పాత ఆనకట్టకు కొద్ది మీటర్ల ఎగువన బారేజిని నిర్మించారు. ఇసుక పునాదులపై నిర్మించిన ఈ బారేజి నీటి నియంత్రణకే కాక, 24 అడుగుల వెడల్పుతో రోడ్డు, రోడ్డుకు రెండు వైపులా 5 అడుగుల వెడల్పుతో నడకదారి కలిగిఉంది. ఈ రోడ్డు చెన్నై, కోల్‌కతా జాతీయ రహదారిలో ఉంది. బారేజీకి తూర్పు, పడమరల్లోని కృష్ణా డెల్టా ప్రాంతంలోని 13.08 లక్షల ఎకరాలకు ఈ బారేజి నుండి సాగునీరు లభిస్తుంది. మహబూబ్‌నగర్ జిల్లా జూరాల వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించి కృష్ణా జిల్లా నాగాయలంక, కోడూరు వద్ద రెండు పాయలుగా బంగాళాఖాతంలో కలిసే కృష్ణానదిపై చిట్టచివరి ఆనకట్ట ప్రకాశం బ్యారేజ్. విజయవాడకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన ఈ ఆనకట్ట తన 154 ఏళ్ల చరిత్రలో ఎన్నో సవాళ్లను అధిగమించింది. 1832లో కృష్ణా తీరంలో కరవు వచ్చినప్పుడు నదిపై ఆనకట్ట కట్టాలనే ఆలోచన నాటి బ్రిటీష్ పాలకులకు వచ్చింది. సర్ ఆర్థర్ కాటన్ సారథ్యంలో, ఛార్లెస్ అలెగ్జాండర్ పర్యవేక్షణలో ఆనకట్ట నిర్మాణం 1852లో ప్రారంభమై 1855 మే 9న పూర్త్తెంది. 4014 అడుగుల పొడవుతో నిర్మించారు. దీనికి అయిన ఖర్చు రూ.1.4 కోట్లు. ఆయకట్టు 4.7 లక్షల ఎకరాలు. నీటి అవసరం పెరగడంతో 1893లో ఎత్తు మూడు అడుగులు పెంచారు. ఈ ఆనకట్ట వంద ఏళ్ల పాటు కచ్చితంగా సేవలందిస్తుందని కాటన్ అప్పట్లోనే ప్రకటించారని చెబుతుంటారు.1954 ఫిబ్రవరి 13 న మొదలైన బారేజి నిర్మాణం దాదాపు నాలుగేళ్ళలో పూర్తయింది. 1957 డిసెంబర్ 24 న బారేజిపై రాకపోకలు మొదలయ్యాయి. బారేజి నిర్మాణానికి రూ. 2.78 కోట్లు ఖర్చయింది.

ఆయకట్టు వివరాలు

శ్రీకృష్ణవేణి విగ్రహము. ప్రకాశం బారేజి. విజయవాడ
ప్రకాశం బారేజి సీతానగరం నుండి
ప్రకాశం బారేజి రాత్రి విద్యుత్ దీపాలతో

బచావత్ ట్రిబ్యునల్, కృష్ణా డెల్టాకు 181.2 టి.ఎం.సి.ల నీటిని కేటాయించింది. బారేజి కింద సాగునీరు లభించే ఆయకట్టు వివరాలు

ఎడమ గట్టు - (కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు)
సంఖ్యకాలువ పేరుఆయకట్టు, ఎకరాలలో
1.ఏలూరు కాలువ1,15,000 (55,000 పశ్చిమ గోదావరి)
2రైవస్ & దిగువ పుల్లేరు కాలువ1,75,000
3పోలరాజు కాలువ44,400
4బంటుమిల్లి కాలువ64,600
5కాంప్‌బెల్ కాలువ49,000
6బందరు కాలువ1,07,837
7ఆర్.ఆర్.పాలెం32,389
8ఎగువ పుల్లేరు కాలువ10,992
9కృష్ణా ఎడమగట్టు కాలువ1,36,280
మొత్తం7,35,498


కుడిగట్టు (గుంటూరు, ప్రకాశం జిల్లాలు)
సంఖ్యకాలువ పేరుఆయకట్టు, ఎకరాలలో
1కె.డబ్ల్యు.ప్రధాన కాలువ22,172
2కుడిగట్టు కాలువ1,55,344
3తూర్పు కాలువ53,992
4పశ్చిమ కాలువ27,588
5నిజాంపట్నం కాలువ22,124
6హైలెవెల్ కాలువ26,414
7కొమ్మమూరు కాలువ (బకింగ్‌హాం కాలువ)2,63,717 (75,500 ప్రకాశం)
మొత్తం5,71,351
ఎత్తిపోతలు
సంఖ్యకాలువ పేరుఆయకట్టు, ఎకరాలలో
1కృష్ణా జిల్లా వైపు11,500
2గుంటూరు వైపు4,500
మొత్తం16,000

చిత్ర మాలిక

మూలాలు

    బయటి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.