పడమటి కనుమలు

పడమటి కనుమలు (ఆంగ్లం Western Ghats) భారత ద్వీపకల్పానికి పడమర వైపున సముద్రతీరం వెంట ఉండే కొండల వరుస. దక్కన్ పీఠభూమి పశ్చిమ పార్శ్వంలో పశ్చిమ కనుమలున్నాయి. పశ్చిమ కనుమలను ఉత్తరభాగంలో మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వత శ్రేణి అని పిలుస్తారు. ఇవి తపతి నది లోయకు దక్షిణంగా మహారాష్ట్రలోని ఖాందేష్ నుంచి ప్రారంభమై పశ్చిమ తీరానికి సమాంతరంగా 1600 కి.మీ పొడవున దక్షిణాన కన్యాకుమారి వరకు అవిచ్ఛిన్నంగా వ్యాపించి ఉన్నాయి. వీటి సరాసరి ఎత్తు 1200 మీటర్లు. వీటి వాలు సముద్రం వైపు చాలా నిటారుగా, పీఠభూమి వైపు తక్కువగా ఉంటుంది. ఈ పశ్చిమ కనుమలు సముద్ర తీరానికి 50-60 మీటర్ల దూరంలో ఉన్నాయి. వీటికి ఉత్తర భాగంలో థాల్ ఘాట్, బోర్‌ఘాట్ అనే కనుమలున్నాయి. ఈ కనుమల ద్వారానే దక్కన్ పీఠభూమికి కొంకణ్ మైదానాలకు రోడ్డు, రైలు మార్గాలను వేశారు. దక్షిణ భాగంలో పాలఘాట్ కనుమ తమిళనాడు, కేరళలను కలుపుతుంది.

పడమటి కనుమలు మరియు భారత భౌగోళికం.

పశ్చిమ కనుమల ఉత్తర భాగంలో కల్సూభాయ్, సల్హేరు, మహాబలేశ్వర్, హరిశ్చంద్ర గర్ శిఖరాలున్నాయి. వీటిలో కల్సూభాయ్ శిఖరం పశ్చిమ కనుమల్లోకెల్లా అతి పెద్దది. గోవా దక్షిణ తీరానికి అతి సమీపంగా ఉన్న పశ్చిమ కనుమలు పురాతన నీస్, గ్రానైట్ శిలలతో ఏర్పడి, ఎక్కువ కఠినంగా ఉన్న స్థలాకృతితో, దట్టమైన అడవులతో ఉన్నాయి. దక్షిణాన నీలగిరి కొండలు సహ్యాద్రి కొండలను గుడలూరు సమీపంలో కలుస్తున్నాయి. గుడలూరు వద్ద వీటి సరాసరి ఎత్తు 2000 మీటర్లు. నీలగిరి కొండల్లోని ఊటీ సమీపంలో ఉన్న దొడ్డబెట్ట (2637 మీ) అతి ఎత్తైనా శిఖరం. దీనికి దక్షిణంగా అన్నామలై, పళని, కార్డమమ్ (యాలకుల) కొండలున్నాయి. కేరళ లోని అన్నామలై కొండల్లోని అనైముడి శిఖరం (2695 మీ) ద్వీపకల్ప పీఠభూమిలోకెల్లా అతి ఎత్తైంది.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.