నరేంద్ర మోదీ
1950 సెప్టెంబర్ 17న జన్మించిన [1] నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) భారతదేశపు ప్రధానమంత్రి. అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో కేశూభాయి పటేల్, ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోదీకి తిరుగులేదు. 2012 శాసనసభ ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా నాల్గవసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. 2000 నుంచి 2014 మే 21 నాడు రాజీనామా చేసేవరకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. అత్యుత్తమ భారతీయ పరిపాలన సామర్థ్యానికి గుజరాత్ నిదర్శనమని అమెరికా అభివర్ణించింది.[2] 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టి 2014 మే 26న ప్రధానమంత్రి పీఠంపై అధిష్టించారు.
| నరేంద్ర మోది | |
![]() నరేంద్ర మోది | |
| ప్రస్తుత | |
| Assumed office 26 మే 2014 | |
| మునుపు | మన్మోహన్ సింగ్ |
|---|---|
| నియోజకవర్గం | వారణాసి లోకసభ నియోజకవర్గం |
| జననం | 1950 సెప్టెంబరు 17 వాద్‌నగర్, మెహ్సానాజిల్లా, గుజరాత్ |
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
| భార్య/భర్త | జసొదా బెన్ |
| సంతానం | - |
| As of మే 21, 2014 | |
బాల్యం
1950, సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోదీ పాఠశాల విద్య స్థానికంగానే పూర్తి చేశారు. గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందినారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడిగా పనిచేశారు. 1970లలో విశ్వ హిందూ పరిషత్తులో చేరారు. గుజరాత్‌లోని ఒక మారుమూల గ్రామంలో చాయ్ అమ్మడం ద్వారా మొదలు పెట్టిన జీవితం అనేక మలుపులు తిరిగింది[3]. శాసనమండలి సభ్యుడిగా, గుజరాత్ రాష్ట్ర మంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవులు పొంది భారతదేశ ప్రధానమంత్రి పదవి అధిష్టించారు.
రాజకీయ జీవితం
1987లో నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీలో ప్రవేశించారు. కొద్దికాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. 1990లో లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు, 1992లో మరళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి-కాశ్మీర్ రథయాత్రకు ఇన్‌చార్జీగా పనిచేశారు[4]. 1998లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. పార్టీలో సీనియర్ నాయకుడైన కేశూభాయి పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో గుజరాత్‌లో సంభవించిన పెను భూకంపం తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశూభాయి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం 2001 అక్టోబరులో నరేంద్ర మోదీని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టించింది. అప్పటి నుంచి 2014 మే 21 నాడు ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు వీలుగా రాజీనామా చేసేవరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీనే కొనసాగారు.
ముఖ్యమంత్రిగా మోదీ
ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన ఏడాదిలోనే ఆయన అద్భుత విజయాలు సాధించారు [4]. భూకంపం వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పునరావాస కార్యక్రమాలు చేపట్టినారు. 2002లో గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ దహనం తర్వాత జరిగిన అల్లర్లు ఆయన ప్రభుత్వానికి కష్టం కల్గించాయి. దేశ వ్యాప్తంగా ఆయన రాజీనామా చేయాలని విమర్శలు రావడంతో రాజీనామా సమర్పించి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమయ్యారు.
2002 ఎన్నికలు: 2002 డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలలో మొత్తం 182 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీకి 126 స్థానాలలో విజయం చేకూర్చి వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు. 2002 గుజరాత్ అల్లర్లపై రాజకీయంగా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికినీ [5] సమర్థంగా తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి,[6][7] మంచి ఉత్తమమైన పరిపాలన కార్యశీలిగా పేరు తెచ్చుకున్నారు.
2007 ఎన్నికలు : 2007 డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆకర్షించాయి. ఆ కాలంలో ఏ ఎన్నికలకూ లేని విశేష ప్రాధాన్యత గుజరాత్ ఎన్నికలకు లభించిందంటే అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు [8]. కేవలం ఒక రాష్ట్ర ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆకర్షించడానికి కారణం ఇది జరగబోయే లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేయడమే. అంతేకాకుండా 2009 లో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడిన లాల్ కృష్ణ అద్వానీది గుజరాతే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి కూడా గుజరాత్‌కే చెందినవారు. ఇటీవల కాలంలో అధికారంలో ఉంటూ మళ్ళీ పార్టీని గెలిపించిన సందర్భాలు తక్కువే. అటువంటిది వరుసగా మూడో పర్యాయం 182 స్థానాలకుగాను 117 స్థానాలు పొందటం విశేషం. ఆయన స్వయంగా మణినగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మంత్రి అయిన దిన్షా పటేల్ పై 87,161 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడటం అది 4 వ సారి కాగా నరేంద్ర మోదీ సర్కారు ఏర్పడటం 3 వ పర్యాయం[9]. గుజరాత్‌లోని 4 భౌగోళిక ప్రాంతాలైన సౌరాష్ట్ర, మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్ అన్నింటిలోనూ భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం, ఇది భారతీయ జనతా పార్టీ జట్టు విజయమని, 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' మాత్రం నరేంద్ర మోదీ అనీ క్రికెట్ భాషలో వ్యాఖ్యానించింది [10]. తాను 2001 నుంచే కాదు ఎప్పటి నుంచో సీఎం అని, ఎప్పటికీ గుజరాత్ సీఎం నేనని, సీఎం అంటే కామన్ మ్యాన్ అని నరేంద్ర మోదీ సరి కొత్త భాష్యం చెప్పారు.
2012 ఎన్నికలు: 2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ సునాయాస విజయాన్ని నమోదుచేసింది. నరేంద్రమోదీ స్వయంగా మణినగర్ నుంచి 86వేలకు పైగా ఓట్ల మెజారిటితో గెలుపొందినారు. వరసగా 4వ సారి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన నరేంద్రమోదీ దేశప్రజల దృష్టిని ఆకర్షించారు. వేగంగా జరిగిన రాజకీయ పరిణామాలతో ఏకంగా మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే స్థాయికి వెళ్ళింది.
ప్రధానమంత్రి అభ్యర్థిగా: 2013లో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగిన వెంటనే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మోదీని ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అనుకూల పవనాలు బలంగా వీచాయి. మొదట్లో మోదీ రాజకీయ గురువు లాల్ కృష్ణ అద్వాని[11] అడ్డుతగిలినప్పటికీ అనంతరం ఆయన కూడా మోదీ అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ మోదీ ప్రభావంతో గణనీయమైన స్థానాలు సాధించింది. మోదీ స్వయంగా వడోడర నుంచి 5 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా వారణాసిలో కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు.
చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు
2002లో ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత మోదీ అనేక అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించడానికి విశేషంగా తోడ్పడ్డారు. నర్మదా ఆనకట్ట ఎత్తును పెంచి లక్షల ఎకరాల భూమిని సాగులోనికి తెచ్చారు. తాగునీటి సరఫరా మరియు జల విద్యుత్‌పై కూడా శ్రద్ధ చూపినారు. అనేక మహిళా పథకాలను చేపట్టారు. పెట్టుబడులను రప్పించడంలో, పారిశ్రామిక అభివృద్ధిలో, ఎగుమతులలో గుజరాత్ రాష్ట్రాన్ని మోదీ అగ్రస్థానంలో కొనసాగిస్తున్నారు. 2011 సెప్టెంబరు 14న నరేంద్రమోదీ పరిపాలన సామర్థ్యాన్ని అమెరికా శ్లాఘించింది. అమెరికా కాంగ్రెస్‌కు చెందిన పరిపాలన విభాగం "భారతదేశపు అత్యుత్తమ పాలన, ఆకర్షణీయమైన అభివృద్ధి గుజరాత్‌లో కనిపిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతిని, అలసత్వాన్ని తొలిగించి ఆర్థికరథ చక్రాలను గాడిలో పెట్టారు" అని అభివర్ణించింది.
ప్రధానిగా
2014 మే 26న నరేంద్రమోదీ భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పలు వివాదాస్పదమైన నిర్ణయాలు, పాలసీలు అమలుచేశాడు. వాటిలో 500, 1000 రూపాయల నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటివి ఉన్నాయి.
వ్యక్తిగత జీవితం
నరేంద్ర మోదీకి నలుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఝానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వెంట ఎప్పుడు లాప్‌టాప్ను ఉంచు కుంటారు. ఖరీదైన దుస్తులు ధరిస్తారు. అనేక వ్యాసాలతో పాటు 3 పుస్తకాలను కూడా రచించారు. సొంత ఆస్తి కూడబెట్టుకోలేదు. మంచి వక్త, వ్యూహకర్త అయిన మోదీ జీవితంలో చాలా భాగం ఇప్పటికీ రహస్యమే. సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల వంటి పదవులను అధిష్టించినవారి కుటుంబసభ్యులు ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతుంటారు. రాజకీయాల్లోకి వస్తుంటారు. కానీ, మోదీ కుటుంబం ఇందుకు పూర్తి విరుద్ధం. ఆయన సోదరులు, సోదరీమణుల జీవితం ఎవరిది వారిదే. తండ్రి దామోదర్‌దాస్ మరణించగా, తల్లి హీరాబెన్ మోదీ వద్దే ఉంటారు. మోదీ శాకాహారి.
మోదీ జీవిత ప్రస్థానం

- గుజరాత్ లోని మెహసానా జిల్లాలోని వాద్ నగర్ పట్టణంలో 17-09-1950 దామోదర్ దాస్ ముల్ చంద్ మోదీ, హీరబెన్‌లకు మూడో సంతానంగా మోదీ జననం
- రాజనీతి శాస్త్రంలో పీజీ
- బాలుడిగా ఉన్నప్పుడే.. 1960ల్లో భారత్ - పాక్ మద్య యుద్ధం సమయంలో రైల్వే స్టేషనులో సైనిక సేవలు
- గుజరాత్ లో పలు సామాజిక రాజకీయ ఉద్యమాల్లో క్రీయాశీల పాత్ర .
- చిన్న వయస్సులోనే వివాహం అయిందని స్థానిక మీడియా పేర్కొంటుంది . కాని అయన దాన్ని బహిరంగంగా ఎక్కడ ప్రకటించలేదు .
- చిన్నతనంలో సోదరుడితో కలిసి బస్సు స్టాండ్ లో టీ కొట్టు నడిపారు.
- ప్రచారక్ గా జీవితాన్ని ప్రారంభించే వరకూ గుజరాత్ రోడ్డు రవాణా సంస్థ క్యాంటిన్ లో విధులు
- నాగపూర్ లో అర్ ఎస్ ఎస్ లో శిక్షణ
- గుజరాత్ లో ఏబీవీపి బాధ్యతలు
- 1987 లో బాజపాలో చేరిక. 1988 నుంచి 1995 మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీస్కునిరావడంలో కీలక పాత్ర
- 1995 లో జాతీయ కార్యదర్శిగా ఎంపికతో బాటు ఐదు రాష్ట్రాల వ్యవహారాల బాధ్యత అప్పగింత.
- 1998 లో ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి
- 07-10-2001 లో కేశుభాయ్ పటేల్ స్థానంలో తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంపిక.
- 2002 లో రెండో దఫా ముఖ్యమంత్రిగా ఎన్నిక
- 2007 లో మూడో దఫా మఖ్యమంత్రిగా బాధ్యతలు
- 2012 లో నాల్గోసారి మఖ్యమంత్రిగా రికార్డు విజయం
- 2013 లో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డులో సభ్యుడిగా నియామకం. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథ్య బాధ్యతలు .
- 13-09-2013 లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక [12].
- 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకు పూర్తి మెజారిటీ సాధించిపెట్టి ప్రధానమంత్రి పదవి అధిష్టించడానికి సిద్ధంగా ఉన్నారు.
- 2014 మే 21 ప్రధానమంత్రి పదవి అధిష్టించడానికి వీలుగా గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
- 2014 మే 26న ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం
బయటి లింకులు
మూలాలు
- Birth date as per personal website
- ఈనాడు దినపత్రిక, తేది 15-9-2011
- http://www.andhrabhoomi.net/nationalnews.html తీసుకున్న తేది 24 డిసెంబర్, 2007
- http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel12.htm
- "Don't mention the massacre". The Economist. December 8, 2007. p. 47. Check date values in:
|date=(help) - "Cover story: Narendra Modi - Face of Discord" (HTML). Swapan Dasgupta. Retrieved 2007-11-16.
- Riots+economic growth=? Indian Express - October 15, 2007
- http://in.telugu.yahoo.com/News/National/0712/24/1071224054_1.htm
- http://in.telugu.yahoo.com/News/National/0712/23/1071223011_1.htm
- http://in.telugu.yahoo.com/News/National/0712/23/1071223010_1.htm
- సాక్షి దినపత్రిక, తేది 18-05-2014
- ఈనాడు దినపత్రిక (14-09-2013)

