ద్వైతం

మధ్వాచార్యులు ప్రవచించిన మతం. జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతుంది. సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ కంటికి కనిపించని పరమాత్మ వాసుదేవుడి మీద ఆధారపడి ఉంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది.

'స్వతంత్రమస్వతంత్రంచ ద్వివిధమ్ తత్వ మిష్యసి' - స్వతంత్రము, అస్వతంత్రము అని తత్వము రెండు విధములు

మధ్వాచార్యుల చే స్థాపించబడిన మతము కాబట్టి దీన్ని మధ్వ మతము అని కూడా వ్యవహరిస్తారు.

మధ్వ సిద్ధాంతం

జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.

మధ్వమతము పంచ భేదములను ప్రవచిస్తుంది. అవి

1. జీవుడు వేరు బ్రహ్మము వేరు (జీవ - దేవ భేదము)

2. ఒక జీవుడుకి, ఇతర జీవులకు భిన్నత్వం ఉంది (జీవ - జీవ భేదము)

3. జీవుడికి, జడ జగత్తుకు భేదం ఉంది (జీవ - జడ భేదము)

4. జడ జగత్తు వేరు, బ్రహ్మము వేరు (జడ - దేవ భేదము)

5. జడ జగత్తులో ఒక వస్తువుకి, ఇతర వస్తువులకు భేదం ఉంది (జడ - జడ భేదము)

ఈ భేదాలు నిత్యం, శాశ్వతం. జీవుడు ముక్తి పొందిన తర్వాత కూడా ఆ భేదాలు కొనసాగుతాయి.

జగత్తు మిథ్య కాదు. సత్యం, ఎందుకంటే అది ప్రత్యక్షంగా మన ఎదుట కనిపిస్తుంది. అది అశాశ్వతమైనంత మాత్రాన లేదా నిరంతర పరిణామం చెందుతున్నంత మాత్రాన లేకుండా పోదు. ఒక వస్తువును పోలి మరొకటి ఉండదు. అన్నింటా భేదం ఉంది. ప్రతి వస్తువులోను ఇతర వస్తువుల లక్షణాలుండటం జరుగదు.

బ్రహ్మం సర్వోత్తమం. సమస్త సద్గుణాలు బ్రహ్మంలో ఉన్నాయి. బ్రహ్మం ఆనంద స్వరూపం. ఆనందం కారణంగానే దానిచే ప్రేరణ పొంది బ్రహ్మం తన లీలానిమిత్తం ఈ జగత్తును సృష్టించింది. జగత్తు బ్రహ్మంయొక్క వ్యక్తరూపం. సృష్టికిముంది జదజగత్తు సూక్ష్మరూపంలో అవ్యక్తంగా బ్రహ్మంలో ఉంటుంది. సృష్టి సమయంలో అది స్థూలరూపం పొంది వ్యక్తమవుతుంది. బ్రహ్మం తనను తాను వ్యక్తం చేసుకునే విధానమే ఆ సమస్త జగత్తు. అయితే బ్రహ్మం జగత్తుకు అతీతం. బ్రహ్మం లేదా ఈశ్వరుడు సర్వ స్వతంత్రుడు, సర్వజ్ఞుడు, సర్వ శక్తిశాలి, సర్వవ్యాపి.

జడజగత్తువలె జీవాత్మ కూడా స్వతంత్రుడు కాదు. కర్త కాదు. ఈశ్వరుడు మాత్రమే కర్త. జీవాత్మ తానే కర్త అనుకుంటాడు. అది భ్రాంతి. తాను కర్తను కానని, నిమిత్త మాతృడనని గ్రహించి ఈశ్వరునికి తనను తాను సంపూర్ణంగా అర్పించుకుని నిష్కామ కర్మ చేస్తే అది జీవునికి బంధనం కాబోదు. తాను కర్తను అని అహంకారంతోను, మమకారంతోను భ్రమ చెందడం వల్లనే జీవాత్మ సుఖదుఃఖాలకు తలవొగ్గవలసివస్తుంది. ==భక్తితోనే ముక్తి== భక్తి ఒక్కటే ముక్తిదాయకం. అది జ్ఞానపురస్కృతమైన భక్తి అయి ఉండాలి. జీవాత్మ తన స్వస్వరూప జ్ఞానం పొందిన తర్వాత సర్వకర్త అయిన ఈశ్వరుడిపట్ల పెంచుకునే భక్తి మాత్రమే ముక్తికి కారణం అవుతుంది.

జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత - ఈమూడూ వేర్వేరు. జ్ఞాత (తెలుసుకునేవాడు) లేకుండా జ్ఞానం ఉండదు. అలాగే జ్ఞేయం (తెలుసుకోబడే విషయం). జ్ఞాత, జ్ఞేయం లేకుండా జ్ఞానం లేదు. నిర్గుణ బ్రహ్మం, కేవల జ్ఞానం అనేవి లేవు.

జీవులు మూడు విధాలు. ఒక వర్గం భగవద్భక్తులై ధార్మిక జీవనం గడుపుతూ ముక్తులవుతారు. రెండవ వర్గం ఎప్పటికీ ముక్తులు కాలేరు. జననమరణ సంసార చక్రంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. మూడవ వర్గం భగద్విరోధులై శాశ్వత నరకం పొందుతారు.

ముక్తి నాలుగు విధాలు. ఒకటి సాలోక్యం - జీవాత్మ భగవంతుని లోకంలో భగవంతునితోపాటు నివసించడం, రెండు సామీప్యం - భగవంతుడి సన్నిధానంలో నివసిస్తూ కామితార్థాలను అనుభవించడం, మూడు సారూప్యం - భగవంతుని రూపం పొంది ఇష్టభోగాలు అనుభవిస్తూ ఆనందించడం, నాలుగు సాయుజ్యం - భక్తుడు భగవంతునిలో లీనమైనా ఆయన కంటే వేరుగా ఉంటూనే ఆయన ఆనందంలో పాలుపంచుకోవటం.

మరికొన్ని సూత్రాలు

శ్రీమన్ మధ్వమతే హరి: పరతర: సత్యం జగతత్వతో

భేదో జీవగణా హరేరనుచరా: నీచోచ్చభావంగతా

ముక్తిర్నైజ సుఖానుభూతిరమలా భక్తిశ్ఛ తత్సాధనం

హెక్షాది త్రితయం ప్రమాణమఖిలాం నాయైకవెద్యో హరి

మాధ్వ దర్శనాన్ని ఈ క్రింది సూత్రాలు చాల చక్కగా వివరిస్తాయి.

1. హరియే సర్వోత్తముడు. మిగిలిన వారంతా తమ అర్హతను బట్టి పూజింపబడతారు.

అనగా తారతమ్య పధ్ధతిలో విలువకలిగి ఉన్నారు. (వారి వారి యోగ్యతను అనుసరించి ఒకరి తరువత ఒకరు పూజనీయులు) ఉదాహరణకు దేవతలలో హరి తరువాత లక్ష్మి, బ్రహ్మ-సరస్వతి, వాయు మూర్తి, భవుడు-భవాని, శేష, గరుడ, ఇంద్ర, మన్మథ, గురు, చంద్ర, సూర్య, వరుణ, అగ్ని, మను, యమ, కుబేర, విఘ్నేశ్వర వరుసగా పూజార్హులు (తమ సతులతో సహా).

2. పంచ భేదములు కలిగి ఉన్నందు వల్లనే ఈ విశ్వాన్ని మనము ప్రపంచము అని పిలుస్తాము.

3. ఈ జగత్తు ప్రవాహత సత్యము. అనగా, ప్రవాహములో పాత నీటి స్థానంలో క్రొత్త నీరు నిరన్తరంగా వచ్చి చేరుతునే ఉంటుంది. ఈ క్షణంలో మనం చూసిన నీరు మరు క్షణం ఉండదు. అంత మాత్రం చేత ముందు చూసిన నీటిని మనం అసత్యమని చెప్పుటకు వీలు లేదు. మనం ఏ క్షణంలో ఆ నీటిని చూసామో (గమనించామో) ఆ సమయములో ఆ నీరు అక్కడ ఉన్నది కాబట్టి, ఆ క్షణానికి అది సత్యం.

4. జీవుడు హరి కన్న భిన్నుడు. స్వతంత్రము లేనివాడు. (జీవుడు దేవుడు ఒకరు కాదు, వేరు వేరు), హరి సేవ వలననే ముక్తిని/మోక్షాన్ని పొందుతాడు (స్వ-స్వరూప-ఆనంద-సంప్రాప్తి/ ముక్తిర్నైజ సుఖానుభూతి).

5. సద్భక్తి యే స్వ-స్వరూప-ఆనందానికి (ముక్తికి) సాధనం. (దేవుని పట్ల/విష్ణువు పై సద్భక్తి మాత్రమే మోక్షానికి సాధనము).

6. ప్రత్యక్షము (experience), అనుమానము (guess), ఆగమము (The Vedas, Upanishads) అనే 3 ప్రమాణములు అనుసరించి పై సూత్రములు నిర్ధారింపబడినవి.

7. హరి సర్ర్వోత్తమత్వము వేదములు తెలుపుతున్నవి.

ఇవి కూడా చూడండి

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.