ద్రోణాచార్యుడు
భరద్వాజ మహాముని పుత్రుడు ద్రోణుడు. వేదవేదాంగాలన్నీ అభ్యసించాడు. ద్రోణుడితో పాంచాల దేశపు రాజకుమారుడు ద్రుపదుడు అస్త్రవిద్య నేర్చుకున్నాడు. వీరిద్దరికీ గాఢమైన స్నేహం కుదిరింది. ఆ కారణంగా ద్రుపదుడు తాను రాజయ్యాక ద్రోణుడికి సగ రాజ్యం ఇస్తానని మాటిచ్చాడు. ఆశ్రమవాసం పూర్తి చేసుకున్న తరువాత కృపాచార్యుడి చెల్లెలు కృపిని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుని పేరు అశ్వత్థామ. అశ్వత్థామ జననానంతరం అతనిని పోషించటం కూడా వీలుకాని దుర్భర దారిద్యంతో బాదపడుతున్న తరుణంలో బాల్య మిత్రుడు ద్రుపదుడు విద్యాభ్యాస సమయంలో ఇచ్చిన మాటను పురస్కరించుకుని ఆతని సహాయం కోరటానికి వెళతాడు. ద్రుపదుడు అతనిని అవమానించి రిక్త హస్తాలతో వెనుకకు పంపించాడు. ఆ అవమానాన్ని సహించ లేని
ద్రోణుడు అతనిని ఎలాగైనా తిరిగి అవమానించాలని పంతం పట్టి తన శిష్యుడైన అర్జునిని సహాయంతో ద్రుపదుని పట్టి బంధించి అతనికి బుద్ధి చెప్పి తిరిగి పంపించటం భారతంలో ఒక ప్రధాన ఘట్టం.
అతనికి భార్యాబిడ్డలమీద ఉన్న అత్యంత ప్రీతి కారణంగా ఎలాగైనా ధనం సంపాదించాలని కోరిక ఉండేది.పరశురాముడు తన ధనమంతా బ్రాహ్మణులకు దానం ఇస్తున్నాడని విని అతని వద్దకు దానం స్వీకరించడానికి వెళ్తాడు. ద్రోణుడు అక్కడకు చేరే సమయానికి పరశురాముడు ధనమంతా దానం చేసాడు. పరశురాముడు ద్రోణుని చూసి "నాదగ్గర ఉన్న ధనమంతా దానం చేసాను ఇప్పుడు నా దగ్గర నా శరీరం అస్త్రవిద్య మాత్రమే ఉన్నాయి కాబట్టి అస్త్రవిద్య కావాలంటే నేర్పుతానని చెప్పాడు. ద్రోణుడు అందుకు సమ్మతించి అతని వద్ద అస్త్రవిద్య నేర్చుకున్నాడు. అది తరువాతి కాలంలో హస్థినాపురంలో కౌరవులకు పాండవులకు అస్త్రవిద్య నేర్పటానికి దారితీసింది.
ద్రోణాచార్యుడు మహాభారతంలో కౌరవులకూ మరియు పాండవులకు రాజగురువు. దేవశాస్త్రాలతో సహా యుద్ధ విద్యలలోనూ, అస్త్ర శస్త్ర విద్యలలోనూ ఆరి తేరిన వాడు. అర్జునుడు అతనికి ప్రియ విద్యార్థి. ద్రోణుడికి అర్జునుడి కన్న ప్రియమైన వారు ఎవరున్నా ఉన్నారంటే అది తన కుమారుడు అశ్వథ్థామ.
భారతంలో ద్రోణాచార్యుడు