తుంబురుడు

తుంబురుడు హిందువుల పురాణాల ప్రకారం గంధర్వుడు. సంగీతంలో ప్రవీణునిగా సుప్రసిద్ధుడు.

తుంబురుడు

సంగీత సంప్రదాయంలో

పరమశివుని డమరుక నాదం నుంచి జన్మించిన సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు బయలుదేరిన నారద తుంబుర జంటలో ఒకడుగా ప్రసిద్ధి పొందాడు. వివిధ సంప్రదాయాలకు చెందిన భారతీయ సంగీతంలోని పలువురు వాగ్గేయకారులు, సంగీతవిద్వాంసులు తుంబురుని నారదునితో కలిపి గురువులుగా కీర్తించడమనే పరంపర ఉంది. ఆయన వీణకు కళావతి అని పేరు. పౌరాణిక గాథల్లో తుంబురుడు నారదుడు సంగీతంలో పోటీ పడినట్లుగా ఉంటుంది.[1]

విష్ణుభక్తి

తుంబురుడు విష్ణుమూర్తికి మహాభక్తుడని పౌరాణిక ప్రసిద్ధి. తిరుమలలోని తుంబుర తీర్థానికి ఆ పేరు తుంబురుని వల్ల వచ్చింది. మాఘస్నాన మహాత్మ్యగాథలో కూడా తుంబురుని ప్రస్తావన వస్తుంది. తుంబురుడనే గంధర్వుడు మాఘమాస వ్రతాన్ని అతిక్రమించిన తన భార్యను శపించి ఘోణతీర్థంలో స్నానం చేసి వేంకటేశుని అర్చించి పునరావృత రహితమైన వైకుంఠాన్ని పొందాడనే కథ శ్రీవేంకటాచల మాహాత్మ్యంలో చెప్పారు.[2]

సూర్యుని గణంలో

ప్రతి ఋతువులో సూర్యునికి తోడుగా అతని రథములో ఇద్దరు ఆదిత్యులు, ఇద్దరు ఋషులు, ఇద్దరు గంధర్వులు, ఇద్దరు అప్సరసలు, ఇద్దరు రాక్షసులు, ఇద్దరు నాగులు ప్రయాణం చేస్తారు. [3]నాగులు ప్రయాణం చేస్తారు. మధు మాసము(చైత్రమాసం)లో ధాతా, హేతీ, వాసుకీ, రథకృత్, పులస్త్య, కృతస్థలీ అనేవారితో పాటుగా తుంబురుడు సూర్యరథంలో తిరుగుతారు. [4]

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.