జలగం వెంగళరావు

ఆంధ్ర ప్రదేశ్కు 6 వ ముఖ్యమంత్రి, జలగం వెంగళరావు. నక్సలైట్లను ఉక్కుపాదంతో అణచి వేసిన ముఖ్యమంత్రిగా ఆయన దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిపదవులు నిర్వహించాడు.

జలగం వెంగళరావు

జలగం వెంగళరావు


పదవీ కాలము
10 డిసెంబర్, 1973 నుండి 6 మార్చి 1978
ముందు పి.వి.నరసింహారావు
తరువాత డా.మర్రి చెన్నారెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం మే 1921
మరణం జూన్ 12 ,1999
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసము హైదరాబాదు
మతం హిందూ మతము

తన 20 వ ఏట నిజాముకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. ఆ రోజుల్లో కాంగ్రెసు పార్టీ నిర్వహించిన సరిహద్దు క్యాంపుల్లో పాల్గొన్నాడు. రెండు సార్లు జైలుకు వెళ్ళాడు. 1952 లో శాసనసభకు స్వతంత్రుడిగా పోటీ చేసి ఓడిపోయాడు. 1952 నుండి 1962 వరకు ఆయన కాంగ్రెసు పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. 1962లో కాంగ్రెసు పార్టీ తరపున ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుండి గెలిచి శాసనసభలో ప్రవేశించాడు. ఆ తరువాత 1978 వరకు మరో మూడు సార్లు సత్తుపల్లి నియోజకవర్గానికి శాసనసభలో ప్రాతినిధ్యం వహించాడు. 1967లో పంచాయితీరాజ్‌ ఛాంబరు చైర్మనుగా ఎన్నికయ్యాడు.

కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో 1969 నుండి 1971 వరకు హోం మంత్రిగాను, పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో 1972-73 లో పరిశ్రమల మంత్రిగాను పనిచేసాడు. జై ఆంధ్ర ఉద్యమ ఫలితంగా రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తరువాత వెంగళరావు ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యాడు[1].. ఆయన పాలనా కాలంలోనే ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ (ఆత్యయిక పరిస్థితి) ని విధించింది. ముఖ్యమంత్రిగా వెంగళరావు మంచి పరిపాలకుడిగా పేరుతెచ్చుకున్నాడు. ఆయన సాధించిన కార్యాలలో ముఖ్యమైనవి:

  1. నక్సలైటు ఉద్యమాన్ని కఠినంగా అణచివేసాడు. ఎన్‌కౌంటర్ల వ్యాప్తికి కారకుడిగా విమర్శలు తెచ్చుకున్నాడు.
  2. తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాదులో నిలదొక్కుకొనేందుకు తగు చేయూతనిచ్చాడు.
  3. మొదటి ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించాడు. అప్పటికి కొన్ని సంవత్సరాల ముందే ముగిసిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమాల నేపథ్యంలో ఈ సభలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 1975 సంవత్సరాన్ని తెలుగు సాంస్కృతిక సంవత్సరంగా ప్రకటించి పలు కార్యకలాపాలు చేపట్టారు.[2]
  4. నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఏన్నొ వ్యయప్రయాసల కొర్చి ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల అభివ్రుద్దికి పాటుపడ్డారు.

కాంగ్రెసు పార్టీ చీలిపోయి కాంగ్రెసు (ఐ) ఏర్పడినపుడు, వెంగళరావు కొన్నాళ్ళు పార్టీకి దూరమయ్యాడు. మళ్ళీ 1984 లో కాంగ్రెసుకు తిరిగి వచ్చి, 1984, 1991 మధ్య ఖమ్మం నియోజకవర్గం నుండి లోక్‌సభకు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించాడు. 1986 నుండి 1989 వరకు కేంద్ర పరిశ్రమల మంత్రిగా పనిచేసాడు.

1999 జూన్‌ 12 న హైదరాబాదులో జలగం వెంగళరావు మరణించాడు. ఆయనకు ఇద్దరు కుమారులు - ప్రసాదరావు, వెంకటరావు. వీరిద్దరూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు జలగం వెంకటరావు 2004లో సత్తుపల్లి నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు.

వనరులు, మూలాలు

బయటి లింకులు


ఇంతకు ముందు ఉన్నవారు:
పి.వి.నరసింహారావు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
10/12/197306/03/1978
తరువాత వచ్చినవారు:
డా.మర్రి చెన్నారెడ్డి
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.