గుండె

గుండె లేదా హృదయం (లాటిన్: Cor. జర్మన్: Herz. ఆంగ్లం: Heart. ఫ్రెంచి: Cœur) మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం. ఒక ప్రత్యేకమైన కండరాలు నిరంతరంగా పనిచేసి మనిషిని బ్రతికిస్తున్నాయి. ఇది ఛాతీ మధ్యలో కొంచెం ఎడమవైపుకి తిరిగి ఉంటుంది.

మానవుని గుండె

గుండె నిర్మాణం

గుండె మందమయిన కండరపు గోడలు కలిగి ఉంటుంది. ఇది ఉరఃకుహరంలో ఊపిరితిత్తులను ఆవరించి ఉన్న రెండు పుపుసకోశాల మధ్య, కొద్దిగా ఎడమవైపుకు అమరి ఉంటుంది. గుండె వెడల్పయిన భాగం పూర్వభాగం, మొనదేలిన భాగం పరభాగంలో అమరి ఉంటుంది. గుండెను ఆవరించి రెండు పొరలు కలిగిన హృదయావరణ త్వచం (Pericardial membrane) ఉంటుంది. ఈ రెండు పొరలనూ వేరుచేస్తూ హృదయావరణ ద్రవం (Pericardiac fluid) తో నిండి ఉన్న హృదయావరణ కుహరం (Pericardial cavity) ఉంటుంది. ఈ ద్రవం గుండెను బాహ్య అఘాతాల నూచి కాపాడటమే కాక, గుండె కదలికలో కలిగే రాపిడిని నివారిస్తుంది.

గుండె గోడలో మూడు పొరలు ఉంటాయి. అవి: వెలుపలి ఎపికార్డియమ్ (ఒక పొరలో అమరి ఉన్న మీసోథీలియల్ కణాలతో ఏర్పడుతుంది), మధ్యలో ఉన్న మయోకార్డియమ్ (హృదయ కండరాలతో ఏర్పడుతుంది), లోపలి ఎండోకార్డియమ్ (శల్కల ఉపకళతో ఏర్పడుతుంది) .

మానవుని గుండెలో నాలుగు గదులు ఉంటాయి. అవి: రెండు కర్ణికలు (Atria), రెండు జఠరికలు (Ventricles) . రెండు కర్ణికలు గుండె పూర్వభాగాన ఉంటాయి. రెండింటినీ వేరుచేస్తూ కర్ణికాంతర పటం ఉంటుంది. కర్ణికల గోడలు పలచగా ఉంటాయి. పిండదశలో ఈ విభాజకానికి ఫోరామెన్ ఒవాలిస్ అనే చిన్న రంధ్రం ఉంటుంది. శిశు జనన సమయంలో ఊపితితిత్తులు పనిచేయడం ప్రారంభించటం మొదలయిన తర్వాత ఈ రంధ్రం క్రమంగా మూసుకుపోయి ఫోసా ఒవాలిస్ అనే మచ్చ మిగులుతుంది. ఎడమ కర్ణిక కంటే కుడి కర్ణిక పెద్దగా ఉంటుంది. ఇది దేహంలోని వివిధ భాగాలనుంచి (ఊపిరితిత్తులు తప్ప) రెండు పూర్వమహాసిరలు, ఒక పరమహాసిర ద్వారా మలిన రక్తాన్ని గ్రహిస్తుంది.

స్టెంట్

గుండెలో అమర్చే పరికరం (ఇంప్లాంట్) . ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టాక యాంజియోప్లాస్టీ ద్వారా స్టెంట్లు అమర్చే శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయి. నాణ్యత ప్రమాణాలపై నియంత్రణ కొరవడటంతో ఫార్మా కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. స్టెంట్ అమరిస్తే రూ. 20 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. రూ.1.2 లక్షల నుంచి రూ.1.3 లక్షలు విలువ చేసే డ్రగ్ కోటెడ్ స్టెంట్లు అమరిస్తే ఆస్పత్రులకు 50 శాతం మార్జిన్ (రూ.60 వేలు - రూ.70 వేలు) లభిస్తుంది. బేర్ మెటల్ (కోబాల్ట్ క్రోమియం, స్టెయిన్‌లెస్ స్టీల్) స్టెంట్లు వినియోగిస్తే అంత మార్జిన్ రాదు. దేశంలో నాలుగు కంపెనీలే వీటిని తయారుచేస్తున్నాయి. గుజరాత్‌లో రెండు కంపెనీలు, బెంగుళూరులో ఒకటి, మన రాష్ట్రంలో మెదక్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మరో కంపెనీ వీటిని రూపొందిస్తున్నాయి. స్టెంట్లు తయారుచేసే కంపెనీలు ఒక్కో ఆస్పత్రికి ఒక్కో ధరకు వీటిని సరఫరా చేస్తున్నాయి. ఇన్వాయిస్ (సరఫరా చేసే ధర) కంటే రెట్టింపు ధరను ఎంఆర్‌పీగా ముద్రించి ఆస్పత్రులకు అందిస్తున్నాయి. ఎంఆర్‌పీ రూ.36 వేలు. కానీ ఇన్వాయిస్‌లో రూ.17 వేలకే వస్తుంది. దానిని వారు రూ.20 వేలకు ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందిస్తున్నారు. వీటిమీద కంపెనీలు స్కీములు కూడా నడుపుతున్నాయి. కొన్ని కంపెనీలు రూ. 6 వేల నుంచి రూ. 10 వేల లోపు ఖరీదుకే స్టెంట్లను సరఫరా చేస్తామంటున్నాయి. కొందరు వైద్యులు సదస్సుల పేరిట విదేశాలకు వెళ్లినపుడు అక్కడ తక్కువ ధరకు (రూ. 2-5వేలకు) దొరికే స్టెంట్లను తెచ్చి ఇక్కడ రోగులకు వినియోగిస్తున్నారు. విదేశాల్లో కొనే స్టెంట్లకు బెలూన్ (రక్తనాళంలోకి ప్రవేశపెట్టేందుకు ఉపయోగించే పరికరం) ఇవ్వరు. దానికి బదులుగా ఆస్పత్రిలో గతంలో వినియోగించిన పరికరాలనే 'క్రిప్పింగ్' (స్టెరిలైజ్) చేసి మళ్లీ వినియోగిస్తున్నందువల్ల స్టెంట్లు డ్రాప్ అవుతున్నాయి. (ఆంధ్రజ్యోతి 21.10.2009)

ఎలుక మూలకణాలతో గుండె కండరాల సృష్టి

ఎలుక పిండం నుంచి సేకరించిన మూలకణాల సహాయంతో ప్రయోగశాలలో గుండె కండరాలను సృష్టించడంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు విజయం సాధించారు. ఈ కండరాలను ఉపయోగించి హృదయ సంబంధ సమస్యల్ని పరిష్కరించే వీలుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. (ఈనాడు19.10.2009)

తెలుగు జాతీయాలు

తెలుగు భాషలో గుండె మీద కొన్ని జాతీయాలు ఉన్నాయి.[1]

  1. గుండె కరగు - జాలిపడు
  2. గుండె చెరువగు - మిక్కిలి వ్యధచెందు
  3. గుండె రాయి చేసుకొను - ధైర్యము fdfffdfవహించు
  4. గుండెలవిసిపోవు - తీవ్రమైన దుంఖం లేదా భయం కలగడం
  5. గుండెలు తీసిన బంటు - నిర్దయుడు
  6. గుండెలు బాదుకొను - నమ్మలేని విషయం వల్ల కలిగే బాధ
  7. గుండెల్లో గుడికట్టు - కృతజ్ఞుడైయుండు
  8. గుండెల్లో గుబులు - లోలోన భయం
  9. గుండెల్లో రాయి పడడం - ఓటమి సూచకంగా ఎంతో భయం కలగటం

gunde bagundalante

మూలాలు

  1. జాతీయ సంపద, ఆరి శివరామకృష్ణయ్య, 2008.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.