గంగారాం ఆర్య

గంగారాం ఆర్య (Gangaram Arya) మహబూబ్ నగర్ జిల్లా పాలుమాకులలో 1922లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. మొదటి నుంచి ఇతనికి ఆర్యసమాజంతో అనుబంధం ఉంది. అక్కడే తెలుగు, హిందీ భాషలలో ప్రావీణ్యం సాధించాడు. హైదరాబాదులో హిందువులపై ముస్లింపాలకులు, రజాకార్లు చేస్తున్న దుండగాలు, దుర్మాగాలు, అత్యాచారాలు చూసి చలించిపోయాడు.[1] నారాయణరావు పవార్, జగదీశ్ ఆర్య లతో కలిసి పోరాటం కొనసాగించారు. వీరు ముగ్గురు హైదరాబాదు స్వాతంత్ర్య పోరాట త్రిమూర్తులుగా కీర్తిగడించారు. పవార్, జగదీస్, గంగారాం ముగ్గురు కలిసి నిజాం మీద బాంబులు విసరాలని పథకం రూపొందించారు. 1947 డిసెంబరు 4న సాయంత్రం కింగ్‌కోఠి ప్రాంతంలో ఆల్‌సెయింట్స్ స్కూలు మలుపులో కారులో ప్రయాణిస్తున్న నిజాంపై నారాయణరావు పవార్ బాంబు విసిరి చంపే ప్రయత్నం చేశాడు. బాంబు విసరడం సఫలమైనా గురి తప్పడంతో నిజాం ప్రాణాలు కోల్పోలేడు. గంగారాం ఆర్యకు పట్టుకొని రాజద్రోహం నేరం కింద అరెస్టు చేశారు. ఆ తర్వాత పోలీసు కస్టడీకి, తదుపరి జుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇతనికి యావజ్జీవ కారాగారశిక్ష విధించారు. ఆ తర్వాత పోలీసు చర్య జరగడంతో భారత ప్రభుత్వం నిజాం కాలంలో అరెస్టు అయి జైళ్ళలో ఉన్నవారందరినీ విడుదల చేసింది. 1949లో గంగారాం కూడా విడుదలైనాడు. జైలు నుంచి వచ్చిన పిదప ఘనంగా సత్కరించబడ్డాడు.


మూలాలు

  1. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ కమిటీ ప్రచురణ, ప్రథమ ముద్రణ, 2006, పేజీ 243
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.