కురుమూర్తి
కురుమూర్తి, తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలంలోని గ్రామం.[1]
| కురుమూర్తి వెంకటేశ్వరాలయం | |
|---|---|
![]() కురుమూర్తి స్వామి దేవాలయం | |
![]() కురుమూర్తి వెంకటేశ్వరాలయం తెలంగాణ లో ప్రాంతం | |
| భౌగోళికాంశాలు : | 16.446663°N 77.808688°E |
| పేరు | |
| ఇతర పేర్లు: | కురుమూర్తి శ్రీవేంకటేశ్వర ఆలయం. |
| ప్రదేశము | |
| దేశము: | భారత దేశము |
| రాష్ట్రం: | తెలంగాణ |
| జిల్లా: | మహబూబ్ నగర్ |
| ప్రదేశము: | చిన్నచింతకుంట |
| ఆలయ వివరాలు | |
| ప్రధాన దైవం: | శ్రీ వేంకటేశ్వరుడు |
| ముఖ్య_ఉత్సవాలు: | బ్రహ్మోత్సవాలు |
| ఇతిహాసం | |
| నిర్మాణ తేదీ: | క్రీ.శ. 1268 |
| సృష్టికర్త: | ముక్కెర వంశ మూలపురుషుడు గోపాలరాయుడు |
ఇది మండల కేంద్రమైన చిన్నచింతకుంట నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వనపర్తి నుండి 39 కి. మీ. దూరంలోనూ ఉంది.మహబూబ్ నగర్ నుండి కర్నూలు వెళ్ళు రైలు మార్గములో కురుమూర్తి ఉంది.
గ్రామ జనాభా
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 435 ఇళ్లతో, 2110 జనాభాతో 453 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1033, ఆడవారి సంఖ్య 1077. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 511 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 12. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 575830[2].పిన్ కోడ్: 509409.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉంది.బాలబడి, మాధ్యమిక పాఠశాలలు చిన్నచింతకుంటలో ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల చిన్నచింతకుంటలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల వనపర్తిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల మహబూబ్ నగర్లోను, పాలీటెక్నిక్ వనపర్తిలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల వనపర్తిలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలు మహబూబ్ నగర్లోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు.
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
కురుముర్తిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 68 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 384 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 334 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 50 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
కురుముర్తిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 1 హెక్టార్లు* బావులు/బోరు బావులు: 42 హెక్టార్లు* చెరువులు: 7 హెక్టార్లు
ఉత్పత్తి
కురుముర్తిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
పారిశ్రామిక ఉత్పత్తులు
బీడీలు
కురుమూర్తి దేవస్థానం

ఈ గ్రామములో జిల్లాలోనే అతి పురాతనమైన దేవస్థానంగా పేరుగాంచిన కురుమూర్తి వేంకటేశ్వర దేవస్థానం ఉంది. ఈ దేవస్థానానికి బస్సు సౌకర్యము కూడా ఉంది. తిరుమల వేంకటేశ్వర ఆలయానికి, కురుమూర్తి ఆలయానికి పోలికలున్నాయి. ఈ క్షేత్రాన్ని గురించి కపిలవాయి లింగమూర్తి, వైద్య వెంకటేశ్వర్లు పరిశీలించి విశ్లేషాత్మక వివరణలతో పరిశీలించారు.[3] అమ్మాపూర్ గ్రామ సమీపంలో ఏడు కొండల మధ్య వెలసిన స్వయంభూవంపై లక్ష్మి సమేతంగా వెలిసిన స్వామివారు పేదల తిరుపతిగా ఇక్కడ మొక్కులందుకుంటున్నారు. పూర్వం కురుమూర్తికి కురుమతి పేరు ఉన్నట్లు ఆలయ చరిత్ర ప్రకారం తెలుస్తుంది.
ఎత్తయిన ఏడు కొండలపై ఉన్న కురుమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం క్రీ.శ. 1268 ప్రాంతములో ముక్కెర వంశ మూలపురుషుడు గోపాలరాయుడు నిర్మించాడు. 1350లో చంద్రారెడ్డి అభివృద్ధిపర్చగా, సోమభూపాలరావు కొండపైకి మెట్లు నిర్మించి ఏటా జాతర నిర్వహించే సాంప్రదాయం అమలులోకి తెచ్చాడు.[4] 1870లో ఉద్దాల మండపం ఏర్పాటు చేశారు. కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో ఉద్దాల (పాదుకల) ఊరేగింపు ప్రధాన ఘట్టం. వేడుకలు మండల పరిధిలోని వడ్డేమాన్ నుంచి ప్రారంభమౌతాయి. ఆ పాదుకలను ఈ మండపంలో ఉంచుతారు. వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. 1999లో కొత్తగా మండపం ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతియేటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో స్వామి వారిని హంస వాహనంపై ఊరేగిస్తారు.[5]
ఆలయ చరిత్ర
శ్రీ వేంకటేశ్వరస్వామి వారు ఇక్కడకు రావడానికి కారణంగా చెప్పుకునే పురాణ గాథలు. ఆకాశరాజు కుమార్తె పద్మావతిని పెండ్లాడేందుకు కుబేరుని వద్ద అప్పు చేసి, దానిని తీర్చడంలో మాట తప్పానని మనస్థాపం చెందాడు మహావిష్ణువు. స్వామి కృష్ణానదీ తీరం వెంట వెళ్తూ జూరాల వద్ద గల గుండాల జలపాతం వద్ద స్నానం చేశాడు. అక్కడ్నించి ఉత్తర దిశగా వెళ్తున్న సమయంలో లక్ష్మీదేవి కోరిక ఆయనకు గుర్తొచ్చిందిట. ఆ మేరకు అక్కడి ‘కురుమూర్తి గిరుల’పై విశ్రమించాడు. అక్కడ్నించి తిరిగి వెళ్ళేటప్పుడు తమ ప్రతిరూపాలను మాత్రం ఇక్కడే వదిలి వెళ్ళారని స్థల పురాణం వివరిస్తోంది. అదే ‘కురుమార్తి స్వామి’ క్షేత్రమైంది. అమ్మాపూర్ గ్రామ సమీ పంలో ఏడు కొండల మధ్య లక్ష్మీ సమేతంగా స్వయంభూగా వెలసిన ఈ స్వామి వారు పేదల తిరుపతిగా ఇక్కడ మొక్కులందుకుంటున్నారు.
పూర్వం కురు మూర్తికి ‘కురుమతి’ పేరు ఉన్నట్లు ఆలయ చరిత్ర ప్రకారం తెలుస్తున్నది. ... తిరుపతి నుంచి కురుమూర్తికి రా వడానికి కారణం కుబేరుని అప్పుల బాధ నుండి తప్పించుకోవడానికి. తిరుపతి నుంచి ఇక్కడికి ఉత్తరముఖంగా వస్తున్న సమయంలో... సుగంధభరిత నానాఫల పక్షాలతో కనబడిన గుట్టపై కాసేపు విశ్రమిద్దామనే లక్ష్మీదేవి కోరిక మేరకు స్వామి ఇక్కడ ఆగినట్టు పురాణ గాథ. ఇక్కడ ‘కురు’ అనగా చేయుట, ‘మతి’ అనగా తలచుట అని అర్థం. అందుకే ఈ స్వామికి ‘కురుమతి’ అని పేరు వచ్చింది. కాలక్రమేణా అది ‘కురుమూర్తి’గా స్థిరపడి పోయినట్లు పూర్వీకులు చెబుతుంటారు. ఇలా పద్మావతి సమేతంగా తిరుమల వీడి కృష్ణాతీరం చేరిన శ్రీ వేంకటేశ్వరుడు నదిలో సేద తీరిన అనంతరం పాదాలు కంది పోకుండా కృష్ణమ్మ పాదుకలు బహుకరించిందని, ఈ పాదుకలనే ఉద్దాల ఉత్సవంలో ఊరేగిస్తారని చరిత్రాత్మక కథనం ప్రచారంలో ఉంది. నాడు శ్రీ వేంకటేశ్వరుడు సతీసమేతంగా కృష్ణానదిలో స్నానమాడిన ప్రదేశం నేడు ఆత్మకూరు ప్రదేశంలొ గుండాల జలాశయంగా ప్రసిద్ధి చెందినది.
మొదట్లో సహజ సిద్ధమైన గుహలలో పెద్ద రాతిగుండు కింద ఉండేది. భక్తులు గుహ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొనేవారు. రోజురోజుకూ భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో గర్భగుడికి గోపురం నిర్మించారు. దానిముందు మండప నిర్మాణం, ధ్వజ స్తంభం ఏర్పాటు చేశారు.
కాకతీయుల సామంతుడిగా, రాజప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించిన గోన గన్నారెడ్డి కుటుంబ సమేతంగా తిరుపతి యాత్రకు వెళ్లాడట. ఆ సమయంలో ఇక్కడికి సమీపంలోని చంద్రగిరి ప్రాంతంలోని ముక్కెర వంశస్థుడైన గోపాలరెడ్డిని కలిశారు. ఆయన గుణగణాలను, ధైర్య సాహసాలను, ఇచ్చిన ఆతిథ్యానికి ముగ్దుడై, వర్థమానాపురం (వడ్డేమాన్) పరగణాకు ఆహ్వానించాడు. అక్కడికి వచ్చిన గోపాల రెడ్డికి ‘మక్తలనాడ గౌడ’ పదవిని అప్పగించాడు.
అలా ముక్కెర వంశానికి చెందిన గోపాల్ రెడ్డి మొదలుకొని (సా.శ. 1268) సంస్థానాలు విలీనమయ్యే నాటికి అధికారంలో ఉన్న భాగ్యలక్ష్మీ దేవి (1948) దాకా మొత్తం 28 తరాల వారు అందరూ తమ ఇలవేల్పు అయిన ఇక్కడి ‘కురుమూర్తి స్వామి’ ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారట.
ఆత్మకూరు సంస్థాన పాలకులు సా.శ. 1350 సం.లో అప్పటి సంస్థాన బాధ్యతలు నిర్వహించిన చంద్రా రెడ్డి ఈ ఆలయాన్ని నిర్మించారని చారిత్రికాదారం. అనంతరం ఇదే వంశానికి చెందిన మిగిలిన రాజ వంశీయులు కొండకు మెట్లు, మండపాలు, కొండ కింద కోనేరు నిర్మాణాలకు పూనుకొన్నారట. రాజా సీతారామభూపాల్, రాజా శ్రీరామభూపాల్‌లతోపాటు ఆత్మకూరు సంస్థానాన్ని చివరగా పాలించిన భాగ్యలక్ష్మీ దేవిలు కురుమూర్తి స్వామి ఆలయ అభివృద్ధి కోసం విశేష కృషి సలిపారు. స్వామి వారికి ‘వార్షిక బ్రహ్మోత్సవాల’ను ఘనంగా నిర్వహించడంలోనూ వారు ప్రధాన భూమికను పోషించారు.
తరువాత 1810–1840 సం. మధ్య కాలంలో చిన్న వెంకట రెడ్డి నిర్మించి నట్టు తెలుస్తున్నది. రాజా శ్రీ రాం భూపాల్ 1878 లోఉద్దాల మండపాన్ని నిర్మించారు. 1966 లో ఈ దేవాలయం దేవాదాయ శాఖలో విలీనం చేయ బడింది. స్వామి వారికి పాదుకలు ఇక్కడి వడ్డేమాన్ గ్రామస్థులు తయారు చేస్తారు. పాదుకలు పూజించి ఊరేగింపుగా శ్రీనివాసుని సన్నిధికి తీసుకెళ్లతారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఈ ఉద్దాల మండపంలో దళితులే అర్చకులుగా వుండటం ఒక ప్రత్యేకత. ఈ ఆలయం అన్ని విదాలుగా తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయాన్ని పోలి వుంటుంది. ఆకారణంగా ఈ కురుమూర్తి క్షేత్రాన్ని పాలమూరు తిరుపతిగా వ్వవహరిస్తారు.
ఇక్కడి ఆంజనేయస్వామి ఆలయం 1810-1840ల మధ్య కాలంలో నిర్మితమైనట్టు భావిస్తున్నరు. 1878లో ఉద్దాల మండపాన్ని నిర్మించగా, నగారా బంగ్లా (నవత్ ఖానబంగ్ల) వాద్యకారుల కోసం 1857-78 మధ్య కాలంలో నిర్మితమైనట్టు చెబుతున్నరు. సీతారామభూపాలుడే ఉత్సవాల సందర్భంగా దీనిని ఉపయోగించేవారని తెలుస్తోంది. ఇక, విశాలమైన ధర్మశాలను, ప్రాచీనమైన మెట్లను అదే కాలంలో నిర్మించినట్లు చరిత్ర ఉంది.
ముక్కెర వంశస్థుల ఆభరణాలు
అమరచింత (అమ్మాపూర్) సంస్థానాధీశుల ఇలవేల్పు అయిన కురుమూర్తి స్వామికి ముక్కెర వంశస్థులైన రాజా సోంభూపాల్ 15వ శతాబ్దంలో బంగారు ఆభరణాలను సమర్పించారు. శంఖుచక్షికాలు, కిరీటం, మకర కుందనాలు, భుజ కిరీటాలతో సహా వివిధ ఆభరణాలు ఈ స్వామి వారికి బహుకరించారు. నాటి నుండి నేటి వరకు ఆ ఆభరణాలను స్వామివారికి ఉత్సవాల సందర్భంగా అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.
మొదట్లో ఆభరణాల భద్రత దృష్ట్యా వాటిని సంస్థానాధీశుల బంగ్లాలోనే ఉంచేవారు. ఉత్సవాల సందర్భంగా రాజభవనం ముందున్న కొలనులో ఆభరణాలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు జరిపేవారు. అనంతరం కొండపైకి వాటిని వేడుకగా తీసుకు వెళ్ళి స్వామివారికి అలంకరించేవారు. 1968లో కురుమూర్తి ఆలయం రాష్ట్ర దేవాదాయ శాఖలో విలీనమైంది. ఫలితంగా 1976 నుంచి ఆభరణాలను ఆత్మకూరు బ్యాంకులోని ప్రత్యేక లాకర్‌లో భద్రపరుస్తున్నరు. ఉత్సవాల సందర్భంగా వాటిని తెచ్చి స్వామి వారికి అలంకరిస్తున్నరు. ముక్కెర వంశస్థులే నేటికీ ఆభరణాల అలంకరణోత్సవంలో ప్రధాన భూమికను పోషిస్తున్నరు.[6] ఈనాడు: ఆదివారం 8//9/2010.
బ్రహ్మోత్సవాలు
స్వామి వారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జర్గుతాయి. వీటిలో ఉద్దాల ఉత్సవం అనగా పాదుకలను తయారు చేయడం ప్రధాన ఘట్టం. రాయలసీమ నుంచి తెచ్చిన ఆవు చర్మంతో వడ్డేమాన్ గ్రామంలో చర్మకారులు వారం రోజులు శ్రమించి పాదుకలను తయారుచేస్తారు. ఉత్సవం రోజున పాదుకలను ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర పూజిస్తారు. కొండ దిగువన పాదుకలకు స్వాగతం పలికి కాంచనగుహ లోని కురుమూర్తి సన్నిధికి చేర్చి ఆ తర్వాత ఉద్దాల మండపంలో అలంకరిస్తారు. మండపంలో ఉంచిన పాదుకలతో తల, వీపుపై కొట్టించుకుంటే పాపాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం.
పేదలకూ, దళితులకూ దగ్గరివాడైన దేవుడు

పేదల తిరుపతిగా ప్రసిద్ధమైన కురుమూర్తి దేవాలయంలో వర్ణవివక్షకూడా లేదనే చెప్పాలి. స్వామి వారి పాదుకలను వడ్డెమాన్‌లోని ఉద్దాల కార్పోగారంలో రా యలసీమ ప్రాంతం నుంచి సేకరించిన నాణ్య మైన ఆవు చర్మంతో పాదుకలను దళితులు తయారు చేస్తారు. దీపావళి అమావాస్య రోజు నుంచి 7 రోజుల పాటు నియమ నిష్ఠలతో ఉపావాస దీక్షలతో స్వామి పాదుకలు ఉద్ధాలు చేస్తారు. వారి పూజలు అనంతరం ఉద్దాలను ఊరేగింపుగా కురుమూర్తి దేవస్థానానికి తీసుకెళ్తారు. ఉద్దాల మండలంలో దళితులే అర్చకులు. ఇది చాలా అరుదైన విషయం.
ఉద్దాల ఉత్సవంలో స్వామివారి పాదుకలను తీసుకు వడ్డేమాన్‌కు చెందిన మేదరులు ప్రత్యేక చాటను తయారు చేస్తరు. దీపావళి అమావాస్య రోజు చాట తయారీ ప్రారంభిస్తరు. ఉత్సవం నాటికి పూర్తి చేసి దళితులకు అందజేస్తరు. దాంతో స్వామికి దళితుల సేవకు శ్రీకారం పడుతుంది.
కురుమూర్తి స్వామి సన్నిధిలోని మరో ఆచారం మట్టికుండ. అప్పంపల్లికి చెందిన కుమ్మరులు దీనిని తయారుచేస్తరు. ఆ మట్టికుండను ‘తలియకుండ’ మండపంలో ఉంచి, నెల్లి వంశస్థులు పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో భారీగా బాణసంచా కాలుస్తారు. డప్పు వాయిద్యాలతో మట్టికుండను ఉద్దాల మండపం వద్దకు చేరుస్తారు.
అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం
1991లో కీ.శే. పాలెం సౌరప్ప తన శిష్యబృందంతో ప్రతి అమావాస్యకు ఇక్కడకు వచ్చేవారు. ఆయన రాత్రి ఇక్కడే బస చేసి, భజనలు చేసి తిరిగి వెళ్లేవారు. అనంతర కాలంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాను రానూ ప్రతి అమావాస్యకు 15 నుండి 20 వేల మంది వరకు భక్తులు స్వామి వారి దర్శనానికి వస్తారని అంచనా. ఈ సందర్భంగా కొందరు దాతల సహకారంతో ఆలయ ప్రాంగణంలో ‘అన్నదాన కార్యక్షికమాని’కి శ్రీకారం చుట్టారు. అప్పంపల్లికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బెల్లం సాయిలు 1994లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మొదట్లో 40 నుండి 50 మంది వరకు మాత్రమే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేవారు. కానీ, ప్రస్తుతం ప్రతి అమావాస్యకు వేల సంఖ్యలో అన్నదానాన్ని స్వీకరిస్తున్నారు. కురుమూర్తిని సందర్శించుకునే భక్తుల సౌకర్యార్థం కొండ కింద శాశ్వత షెడ్లు నిర్మించారు. విశ్రాంతి గృహం, కళ్యాణ కట్ట, మంచినీటి సౌకర్యం కోసం కొండ కింద, పైన వాటర్ ట్యాంకులను నిర్మించారు. కేవలం ఉత్సవాల సందర్భంగానే కాకుండా ప్రతి అమావాస్యకు భక్తులు స్వామిని దర్శించుకుంటారు.
తిరుమలకు కురుమూర్తికి పోలికలు

- తిరుమలలోని ఏడుకొండలపై వెలసిన శ్రీవేంక స్వామికి ‘అలిపిరి మండపం’ ఉండగా ఇక్కడ కురుమూర్తి శ్రీవేంక స్వామి వారికి ‘ఉద్దాల మండపం’ ఉంది.
- తిరుపతి లోలాగే ఇక్కడా విఘ్నేశ్వరుడి విగ్రహం లేదు.
- తిరుపతిలో వలె ఇక్కడ కూడా ఏడు కొండల మధ్య వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు
- తిరుపతిలో వలె ఇక్కడా స్వామి నిలుచున్న భంగిమలో ఉన్నాడు.
- తిరుమలకు మెట్లపై వెళ్ళేటప్పుడు శ్రీపాద చిహ్నాలు ఉన్నట్లుగానే ఇక్కడా ఉన్నాయి.
- తిరుపతిలో దర్శనానికి వెళ్ళేటప్పుడు ‘మోకాళ్ళ గుండు’ పేర్న ఎత్తయిన కొండ ప్రాంతాన్ని పోలిన ప్రదేశం ఉంటుంది. కురుమూర్తి దర్శనానికి వెళ్ళ్తున్నప్పుడు అలాంటిదే కనిపిస్తుంది.
- శేషశైలంలో స్వామి వారికి అలిపిరి మండపం లాగే ఇక్కడ ఉద్దాల మండపం ఉంది.[7]
కురుమూర్తి స్వామి ఏడు కొండలు
ఇక్కడ కూడా ఆ స్వామి ఏడు కొండలపైనే కొలువుదీరడం విశేషం. ఆ కొండల వివరాలు...
- శ్వేతాద్రి (బొల్లిగట్టు), (శ్వేత వర్ణం అంటే తెల్లని అద్రి అంటే కొండ, వాడుకలో బొల్లి అనేది కూడా తెలుపుకే వాడతారు)
- ఏకాద్రి (బంటి గట్టు), (ఏక అంటే ఒక్కటి అని దానినే వాడుకలో ఒంటి అని కొండను గట్టు అంటున్నారు)
- కోటగట్టు,
- ఘనాద్రి (పెద్ద గట్టు),
- భల్లూకాద్రి (ఎలు గులగట్టు), (భల్లూకమూ అంటే ఎలుగ్గొడ్డు లేదా బేర్)
- పతగాద్రి (చీపుర్లగట్టు),
- దైవతాద్రి (దేవరగట్టు)...
అనే ఏడు కొండల్లో దేవతాద్రి అని పిలిచే దేవరగట్టపైనే కురుమూర్తి వేంకటేశ్వర స్వామి కొలువై విరాజిల్లుతున్నారు.
కురుమూర్తి దేవాలయానికి చేరు విధానం
- జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబ్‌నగర్ నుంచి దేవరకద్ర, కౌకుంట్ల మీదుగా కురుమూర్తి చేరుకోవచ్చు
- కురుమూర్తి రైల్వేస్టేషను నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది.
- 7 వ నెంబర్ జాతీయ రహదారి పై ఉన్న కొత్తకోట నుంచి కొత్తపల్లి, దుప్పల్లి మీదుగా 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.
- కురుమూర్తి సమీపంలో వాగుపై ప్రాజెక్టు ఉంది.
కురుమూర్తి గురించి ప్రస్తావనలు
- బుక్కపట్టణం బుచ్చి వెంకటాచార్యులు రాసిన ‘శ్రీ ఉత్తర వెంకటాచల మహత్యం’ (కీ.శ. 1854-61) గ్రంథంలో కురుమూర్తి గిరుల శోభ ప్రస్తావన.
- 1959లో వి.రామకృష్ణయ్య శ్రీకుర్మూర్తిస్వామి భజన కీర్తనలు వెలువరించారు
- ‘కురుమూర్తి స్వామి’ క్షేత్రానికి సంబంధించి ‘దుర్వాస, దిలీప సంవాదం’ అనే చారిత్రక కథ
- ఇక్కడి ఏడుకొండల ప్రస్తావన 1878లో నరసింహ దీక్షితులు రచించిన చెంచుకథలో ఉంది
- అజకొల్లు శేషకవి ‘శ్రీ కురుమూర్తి క్షేత్రస్థల పురాణం’ (1850)లో మొత్తం 107 పద్యాలు ఉన్నాయి.
- 1851-1905 మధ్య కాలంలో కురుమూర్తి స్వామి సుప్రభాతాలు ప్రసిద్ధినొందాయి శ్రీనివాస విలాస గ్రంథకర్త కృష్ణమాచార్యులు రచించారు.
- స్థానిక కవి పండితులు వైద్యమ్ వెంకన్న 1983లో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ‘శ్రీకురుమూర్తి క్షేత్ర చరిత్ర’ రాసారు.
- 2005లో సంస్కృత గ్రంథమైన శ్రీఉత్తర వేంకటాచల మహాత్మ్యం’ను వైద్యమ్ వెంకన్న తెలుగులోకి అనువదించారు.
- విశ్రాంత ఉపాధ్యాయుడు బెల్లం సాయిలు కురుమూర్తిస్వామి భజన కీర్తనలు ప్రచురించారు.
- చరిత్ర, సాహిత్య పరిశోధకులు కపిలవాయి లింగమూర్తి ఈ క్షేత్రం వివరాలను క్రోడీకరించి వెలువరించారు.
- వనపర్తికి చెందిన ఉమ్మెత్తల నర్సింహమూర్తి స్వామిని కీర్తించే అనేక జానపద గేయాలను సేకరించి ప్రచురించారు
రాజకీయాలు
వనరులు
- తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ఆంధ్రప్రభ ఆన్‌లైన్ దినపత్రిక, తేది 25-10-2009
- ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 9, తేది జూన్ 11, 2008
- ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది నవంబర్ 11, 2007
- ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, నవంబర్ 17, 2007
- ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది అక్టోబర్ 19, 2006

