కపిలవాయి లింగమూర్తి

కపిలవాయి లింగమూర్తి (మార్చి 31, 1928-నవంబర్ 6, 2018) పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు.[1] పద్య రచనతో ఆయన ప్రస్థానం ఆరంభమైనా కథా రచన, విమర్శ ప్రక్రియతో వెలుగులోకి వచ్చాడు. జానపద సాహిత్యం, పాలమూరు జిల్లా లోని దేవాలయాలపై విస్తృత పరిశోధనలు చేశాడు. 70 కి పైగా పుస్తకాలు రచించాడు. ఈయనకు కవి కేసరి అనే బిరుదు ఉంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేటు అందుకున్న తొలివ్యక్తి కపిలవాయి లింగమూర్తి.[2]

కపిలవాయి లింగమూర్తి
దస్త్రం:Kapilavai Lingamurthy.JPG
జననం(1928-03-31) 1928 మార్చి 31
మహబూబ్ నగర్ జిల్లా, బల్మూర్ మండలం జినుకుంట గ్రామం
మరణం2018 నవంబరు 6 (2018-11-06)(వయసు 90)
దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆసుపత్రి, హైదరాబాదు
మరణానికి కారణంవార్ధక్యం
చదువుమాస్టర్స్, పి. హెచ్. డి
విద్యాసంస్థలుఉస్మానియా విశ్వవిద్యాలయం (మాస్టర్స్), తెలుగు విశ్వవిద్యాలయం (డాక్టరేటు)
వృత్తికవి, పరిశోధకులు, విశ్రాంత తెలుగు పండితులు, ఉపన్యాసకులు
మతంహిందూ
జీవిత భాగస్వామిమీనాక్షమ్మ
పిల్లలుకపిలవాయి కిశోర్ బాబు, కపిలవాయి అశోక్ బాబు
తల్లిదండ్రులు
  • వెంకటాచలం (తండ్రి)
  • మాణిక్యమ్మ (తల్లి)

జీవిత సంగ్రహం

వీరు అచ్చంపేట తాలుకా, బల్మూర్ మండలం, జినుకుంటలో మాణిక్యమ్మ, వెంకటాచలం దంపతులకు మార్చి 31, 1928కు సరియైన ప్రభవ నామ సంవత్సరం మాఘ శుద్ధ నవమి నాడు జన్మించారు. ఆయనకు రెండున్నరేళ్ళ వయసులో తండ్రి మృతి చెందడంతో మేనమామ పెద లక్ష్మయ్య దగ్గర పెరిగాడు. పాఠశాల విద్యను ఉర్దూ మాధ్యమంలో పూర్తి చేశాడు. ఆంధ్ర సారస్వత పరిషత్ పరీక్షలు రాసి తెలుగులో విశారద ప్రమాణ పత్రాన్ని సంపాదించాడు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ. (తెలుగు) పట్టా పొంది 1954లో నాగర్‌కర్నూల్ జాతీయోద్యమ పాఠశాలలో తెలుగు పండితునిగా చేరాడు. ఆ తర్వాత 1972 లో పాలెం శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఉపన్యాసకుడుగా చేరి దశాబ్దం పాటు సేవలందించి 1983లో ఉద్యోగవిరమణ పొందాడు. లింగమూర్తి నడిచే విజ్ఞానసర్వస్వంగా పేరుపొందాడు.[3] పలుగ్రంథాలు, పరిశోధనలు రచించి సాహితీవేత్తగా పేరుపొందాడు. కపిలవాయికి తెలుగు విశ్వవిద్యాలయం 26.8.2014 న గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. 30.08.2014 రోజున విశ్వవిద్యాలయం 13 స్నాతకోత్సవంలో చాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వీరికి గౌరవ డాక్టరేట్‌ను అందించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు యూనివర్సిటీ నుంచి తొలి గౌరవ డాక్టరేట్ పొందిన వ్యక్తిగా కపిలవాయికి ఈ ఘనత దక్కింది. 1954 నుంచి 1983లో పదవీ విరమణ పొందే వరకు నాగర్‌కర్నూల్ లోని జాతీయోన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి, అక్కడే స్థిరపడ్డారు. అనేక స్థలచరిత్రలు, దేవాలయాల కథలకు ఆయన ప్రాణంపోశారు. మొత్తం 70 రచనలు ముద్రితమయ్యాయి. 11రచనలు ద్విముద్రితాలు, 25 రచనలు ముద్రించాల్సి ఉంది.

కపిలవాయి భావనలు

  • సమైక్యరాష్ట్రంలో తెలంగాణ కవులు, సాహితీ వేత్తలకు అన్యాయం జరిగింది. జీవోలు తెలుగులో రావాలి. పాఠశాలల్లో తెలుగు బోధించాలి

రచనలు

  • ఆర్యా శతకం
  • ఉప్పునూతల కథ
  • క్షేపాల గంగోత్రి - తూము వంశ రెడ్ల చరిత్ర
  • చక్రతీర్థ మాహాత్మ్యం - అయిదాశ్వాసాలు గల స్థల చారిత్రక కావ్యం
  • తిరుమలేశ శతకం
  • దుర్గా భర్గ శతకాలు
  • పండరినాథ విఠల శతకం - ఏకప్రాస ఔత్సలాలు
  • పరమహంస శతకం
  • పాలమూరు జిల్లా దేవాలయాలు - 2010
  • భాగవత కథాతత్త్వం
  • మహాక్షేత్రం మామిళ్ళపల్లి - స్థల చరిత్ర
  • శ్రీ భైరవకోన క్షేత్ర మాహాత్మ్యం
  • శ్రీమత్ప్రతాపగిరి ఖండం - ఆరు ఆశ్వాసాల స్థల చారిత్రక కావ్యం
  • జినుకుంట రామబంటు శతకం
  • గద్వాల హనుమద్వచనాలు
  • సౌధ శిఖరం
  • ఇందేశ్వర చరిత్ర
  • సోమేశ్వర మహాత్యం
  • స్మృతిపథం
  • పద్య కథా పరిమళము
  • పామర సంస్కృతం
  • మాంగళ్య శాస్త్రం
  • శ్రీ రుద్రాధ్యాయము

కపిలవాయి రచనలపై పరిశోధనలు

కపిలవాయి లింగమూర్తి కావ్యాలు, గీతాలు, శతకాలు, వచన సాహిత్యం, స్థల చరిత్రలు, బాల సాహిత్యం మొదలగు వివిధ సాహిత్య ప్రక్రియలలో రచనలు చేశారు. ఈ రచనలపై పలువురు విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికి వీరి రచనలపై వివిధ విశ్వవిద్యాలయాలలో ఆరు సిద్ధాంత గ్రంథాలు రూపొందినవి[4].

బిరుదులు

  • 1992లో కవితా కళానిధి, పరిశోధనా పంచానన
  • 1996లో కవికేసరి
  • 2005లో వేదాంత విశారద
  • 2010లో గురు శిరోమణి
  • 2012లో సాహిత్య స్వర్ణ సౌరభ కేసరి, సాహితీ విరాణ్మూర్తి[5]

సన్మానాలు

కపిలవాయి లింగమూర్తికి సాహిత్య రంగంలో చేసిన విశేషకృషికి గుర్తింపుగా రాష్ట్ర స్థాయిలో అనేక సందర్భాలలో సన్మానాలు జరిగాయి. 1983లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వీరిని సన్మానించారు. తరువాత నారా చంద్రబాబు నాయుడు, వై.యస్. రాజశేఖరరెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్నకాలంలోనూ వారిచే సన్మానాలు పొందారు. తెలంగాణ రాష్ట్ర సమితి దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వీరిని సన్మానించారు. నలుగురు ముఖ్యంత్రులచే సన్మానింపబడిన ఏకైక తెలుగు కవి, పరిశోధకులు కపిలవాయి లింగమూర్తి. ఇంకా తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభాపురస్కారం, బూర్గుల రామకృష్ణారావు ప్రతిభా పురస్కారం, బ్రౌన్ సాహిత్య పురస్కారం, నోరి నరసింహశాస్త్రి పురస్కారం, కందుకూరి రుద్రకవి పురస్కారం, పులికంటి సాహితీ పురస్కారం, బి.ఎన్.శాస్త్రి స్మారక పురస్కారం మొదలైన ఎన్నో సత్కారాలను పొందాడు.

కపిలవాయిపై డాక్యుమెంటరీ

వెన్నెల సాహిత్య అకాడమీ కపిలవాయి లింగమూర్తి జీవితం, సాహిత్య సృజన, పరిశోధనలపై కవితా కళానిధి కపిలవాయి లింగమూర్తి పేరుతో ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. దీనికి 2011లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ రెండో డాక్యుమెంటరీ చిత్రంగా నంది అవార్డును ప్రకటించింది.

బయటి లింకులు

మూలాలు

  1. రమేష్ బాబు, హెచ్ (December 2018). "మనకాలపు మెకంజీ". Ramoji Foundation. Retrieved 7 January 2019.
  2. "కపిలవాయి లింగమూర్తి ఇకలేరు". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. 2018-11-07.
  3. పాలమూరు జిల్లా వాగ్గేయకారులు, రచన: పి.భాస్కరయోగి
  4. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ప్రత్యేకంలో మధ్యపేజి, తేది. 27.08.2014
  5. మూసీ సాహిత్య సాంస్కృతిక చారిత్రక మాసపత్రిక సెప్టెంబరు 2014 సంచిక
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.