ఎక్కిరాల కృష్ణమాచార్య

ఎక్కిరాల కృష్ణమాచార్య (ఆగష్టు 11, 1926 - మార్చి 17, 1984) ఆంధ్రప్రదేశ్కు చెందిన రచయిత. ఆయన శిష్యులు ఆయనను మాస్టర్ ఇ. కె. అని పిలుచుకుంటుంటారు.

ఎక్కిరాల కృష్ణమాచార్య
ఎక్కిరాల కృష్ణమాచార్య
జననంఎక్కిరాల కృష్ణమాచార్య
ఆగష్టు 11, 1926
బాపట్ల, గుంటూరు జిల్లా,
మరణంమార్చి 17, 1984
విశాఖపట్టణము
మరణ కారణముమెదడు వ్యాధి
ఇతర పేర్లుమాస్టర్ ఇ. కె.
వృత్తి'వరల్డు టీచర్స్ ట్రస్టు' అనే సంస్థ స్థాపకుడు
తండ్రిఅనంతాచార్యులు
తల్లిబుచ్చమ్మ

జననం

ఈయన 1926, ఆగష్టు 11వ తేదీన ఆంధ్రప్రదేశ్కు చెందిన గుంటూరు జిల్లా, బాపట్లలో అనంతాచార్యులు మరియు బుచ్చమ్మ దంపతులకు జన్మించాడు. ఈయన తెలుగు, సంస్కృత, ఆంగ్ల భాషలలో పాండిత్యాన్ని సాధించాడు. 'పాండురంగ మాహాత్మ్యం' కావ్యంపై పరిశోధన చేసి ఒక అద్భుతమైన గ్రంథాన్ని వెలయించి 'డాక్టరేట్' సాధించాడు. గుంటూరులోని హిందూ కళాశాలలోను, తరువాత ఆంధ్ర విశ్వకళాపరిషత్తులోను తెలుగు ఉపన్యాసకుడుగా పనిచేశాడు. వీరి రచనలలో 'రాసలీల', 'ఋతుగానం', 'గోదా వైభవం', 'అశ్వత్థామ సుభద్ర', 'అపాండవము', 'స్వయంవరము', 'పురాణ పురుషుడు', 'పురుష మేధము', 'లోకయాత్ర' లు మంచి ప్రచారం పొందాయి. జయదేవుని 'గీత గోవిందము'ను 'పీయూష లహరి' అనే పేరుతో అచార్య తెలుగులోకి అనువదించారు.

ఈయన ఐరోపాలో పర్యటించి సనాతన భారత ధర్మానికి అక్కడ ప్రచారాన్ని కల్పించి, జగద్గురువుగా ఖ్యాతిగాంచాడు. 'వరల్డు టీచర్స్ ట్రస్టు' (జగద్గురు పీఠం) అనే సంస్థను స్థాపించి తన బోధనలు తగు ప్రచారం పొందే ఏర్పాటుచేసాడు. ఈయన కృషి ఫలితంగా జెనీవా నగరంలో మొరియా విశ్వవిద్యాలయం రూపొందింది. ఇది మానవ జీవితానికి ఆవశ్యకాలైన తత్వశాస్త్ర, వైద్యశాస్త్రాలను సమగ్రంగా సమన్వయించే విద్యాపీఠం. హోమియోపతి వైద్యవిధానం భారత దేశ ఆర్థిక పరిస్థితికి చక్కగా సరిపోతుందని భావించి, ఈయన కొన్ని కేంద్రాలలో ఉచిత హోమియో వైద్యాలయలను నెలకొల్పారు. ఈ వైద్యశాస్త్రాన్ని వివరించే సారస్వతాన్ని తెలుగులోను, ఆంగ్లంలోను రచించారు.

భగవద్గీత రహస్యాల మీద ఈయన వ్రాసిన శంఖారావం పుస్తకం అద్వైతానికి విస్తృత భాష్యం, వివరణ ఇస్తుంది.

మరణం

ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి 1984 మార్చి 17 న విశాఖపట్టణంలో పరమపదించాడు.

మూలాలు

యితర లింకులు

వీడియో

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.