ఆంధ్ర ప్రదేశ్
ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. తెలంగాణాతో పాటు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రధాన భాష. తదుపరి స్థానంలో ఉర్దూ ఉంది.ఈ రాష్ట్రానికి వాయవ్య దిశలో తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పడమరన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో ఎనిమిదవ అతి పెద్ద రాష్ట్రము ఆంధ్ర ప్రదేశ్. ఈ రాష్ట్రంలోని ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ, తుంగభద్ర మరియు పెన్నా. ఆంధ్ర ప్రదేశ్ 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.
| ఆంధ్రప్రదేశ్ | ||
|---|---|---|
| రాష్ట్రం | ||
| ||
| గీతం: "మా తెలుగు తల్లికి మల్లె పూదండ" | ||
![]() భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం | ||
| దేశం | ||
| రాష్ట్రావతరణ | 2 జూన్ 2014 | |
| రాజధాని నగరం | అమరావతి† | |
| పెద్ద నగరం | విశాఖపట్నం | |
| జిల్లాలు | 13 | |
| ప్రభుత్వం | ||
| • సంస్థ | ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం | |
| • గవర్నరు | ఏక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్ | |
| • నవ్యాంధ్ర ముఖ్యమంత్రి | నారా చంద్రబాబునాయుడు | |
| • శాసనసభ | ద్విసభ (175 + 58 సీట్లు) | |
| • లోక్‌సభ నియోజకవర్గాలు | 25 | |
| • హైకోర్టు | ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి | |
| విస్తీర్ణం[1] | ||
| • మొత్తం | 1,62,970 | |
| ప్రదేశ ర్యాంకు | 8వ | |
| జనాభా (2011)[2] | ||
| • మొత్తం | 8 | |
| • ర్యాంకు | 10వ | |
| • సాంద్రత | 308 | |
| ప్రజానామము | తెలుగు / ఆంధ్రులు | |
| జి.డి.పి (2018–19)[3] | ||
| • మొత్తం | ||
| • Per capita | ||
| సమయప్రాంతం | IST (UTC+05:30) | |
| UN/LOCODE | AP | |
| వాహన రిజిస్ట్రేషన్ | AP | |
| అక్షరాశ్యతా రేటు | 67.41% (2011) | |
| అధికార భాషలు | తెలుగు | |
| తీరప్రాంతం | 974 kilometres (605 mi) | |
| ^† ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, 2014 ప్రకారం హైదరాబాదు నగరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల పాటు ఉంటుంది. †† తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి. | ||
| ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు | ||
| చిహ్నం | పూర్ణఘటం
![]() | |
| భాష | ||
| పాట | మా తెలుగు తల్లికి[4] | |
| జంతువు | ||
| పక్షి | ||
| పుష్పం | ||
| వృక్షం | ||
1953 అక్టోబరు 1న మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు భాషీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, రాయలసీమ దత్త జిల్లాలను కలిపి ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందాక భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. హైదరాబాదు రాజ్యంలోని మరాఠీ జిల్లాలు మహారాష్ట్రకూ, కన్నడ భాషీయ జిల్లాలు కర్ణాటకకూ పోగా, మిగిలిన హైదరాబాదుతో కూడుకుని ఉన్న తెలుగు మాట్లాడే నిజాం రాజ్యాధీన ప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో కలిసింది. అలా 1956, నవంబరు 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని మరియు మద్రాస్ నుండి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. అడపా దడపా సాగిన వేర్పాటు ఉద్యమాల ఫలితంగా దాదాపు 58 సంవత్సరాల తరువాత 2014 జూన్ 2 న పునర్విభజింపబడింది . నవ్యాంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలు 2 తెలుగు రాష్ట్రాలుగా 2014 జూన్ 2 నుంచి అమలులోకి వచ్చాయి. హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాల ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా పది సంవత్సరాల వరకు కొనసాగే అవకాశముంది. అమరావతిలో కొత్త రాజధానికి 2015 అక్టోబరు 23 న శంకు స్థాపన జరిగింది.[6]. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభించబడి పరిపాలన మొదలైంది.[7] దేశంలోనే 2వ అతి పెద్ద కోస్తా తీరం ఈ రాష్ట్రంలో ఉంది.[8]
చరిత్ర
- ప్రధాన వ్యాసము: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
ఆంధ్రులు వింధ్యపర్వత దక్షిణ భాగానికి తరలి వెళ్ళి, ద్రావిడులతో కలసిన ఆర్యులుగా క్రీ.పూ. 7వ శతాబ్దపు సంస్కృత రచనలు వర్ణిస్తున్నాయి. క్రీ. పూ. 5వ శతాబ్దములో ప్రతీపాలపురం (భట్టిప్రోలు) రాజధానిగా కుబేరక అను రాజు పాలన చేస్తున్నాడని ఆధారాలు దొరికాయి. మహావీరుడు, గౌతమ బుద్ధుడు ధాన్యకటకము (అమరావతి) సందర్శించారనడానికి ఆధారాలున్నాయి. మౌర్య చక్రవర్తి అశోకుని మరణానంతరం (క్రీ.పూ 232) ఆంధ్రులు వెలుగులోకి వచ్చారు. నవీన చరిత్రకారులు ఆంధ్రుల చరిత్ర ఆనాటినుండి మొదలైనట్లుగా లెక్కిస్తున్నారు. ఆంధ్ర (శాతవాహన), శక, పల్లవ, ఇక్ష్వాకు, తెలుగు చోళ, తూర్పు చాళుక్య, కాకతీయ, విజయనగర, కుతుబ్ షాహి, హైదరాబాదు నిజాంలు మొదలైన వంశాలకు చెందిన రాజులు ఆంధ్ర దేశాన్ని పరిపాలించారు. క్రీ.శ 17వ శతాబ్దములో బ్రిటీషు వారు కోస్తా ఆంధ్రను నిజామ్ వద్ద గెలుచుకొని మద్రాసు రాష్ట్రములో (మద్రాసు ప్రెసిడెన్సీ) కలుపుకున్నారు. హైదరాబాదు నిజామ్ బ్రిటిషు ఆధిక్యతను గుర్తించి తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనాడు.
భారత దేశ స్వాతంత్ర్యానంతరము
1947లో భారత దేశానికి ఆంగ్లేయుల నుండి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నిజాము, హైదరాబాదు సంస్థానాన్ని తమ పాలనలోనే ఉంచుకోవటానికి ప్రయత్నించాడు. పోలీసు చర్య ద్వారా హైదరాబాదు 1948 భారత దేశంలో విలీనమై, హైదరాబాదు రాష్ట్రంగా అవతరించింది.
మద్రాసు రాజధానిగా ఉండే ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి' పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష చేసి మరణించారు, కానీ కర్నూలును రాజధానిగా చేసి 1953 అక్టోబరు 1న మద్రాసు రాష్ట్రంలో ఉత్తరాన ఉన్న 11 జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం చేశారు. గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేసారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.
తెలుగు ప్రజల కోరికపై 1956, నవంబరు 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. కొత్త రాష్ట్రానికి హైదరాబాదు రాజధానిగా అవతరించింది. ఈ విధంగా భాష ఆధారముగా ఏర్పడిన రాష్ట్రములలో ఆంధ్ర ప్రదేశ్ మొదటి రాష్ట్రము అయినది. నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.
1960 వ సంవత్సరంలో పటాస్కర్ కమిషన్ తీర్పుమూలంగా చిత్తూరు జిల్లా తిరుత్తణి తాలూకాలోని ఎక్కువ భాగాన్ని తమిళనాడుకు ఇచ్చి, తమిళనాడుకు చెందిన తిరువళ్లూర్ తాలూకాలోని కొన్ని గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్ లో చేర్చారు. ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భవించినప్పుడు 20 జిల్లాలే ఉన్నాయి. తరువాత, 1970, ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా, 1978 ఆగష్టు 12న రంగారెడ్డి జిల్లా, 1979 జూన్ 1న విజయనగరం జిల్లాలు ఏర్పడడంతో మొత్తం 23 జిల్లాలయ్యాయి.
రాష్ట్ర భౌగోళిక సమగ్రతపై ఉద్యమాలు
రాష్ట్రం ఏర్పడినతరువాత అడపా దడపా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు దానికి పోటీగాసమైక్య ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి.2009 లో కే.సి.ఆర్ నిరాహరదీక్ష విరమింపచేయడానికి కేంద్రప్రభుత్వం తెలంగాణాఏర్పాటు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ ఉద్యమాలు మరింత బలం పుంజుకున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అందరికీ అమోదమైన లక్ష్యంకొరకు ప్రయత్నించినప్పటికి సత్ఫలితాలివ్వలేదు. 2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.తదుపరి సమైక్యాంధ్ర ఉద్యమము వూపందుకుంది. ప్రభుత్వ ఉద్యోగసంఘాల నాయకత్వంలో రెండు నెలలపై బడి సమైక్యాంధ్ర ఉద్యమము నడిచింది. 2013 అక్టోబరు 3న జరిగిన కేంద్రప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణా ఏర్పాటుని ఆమోదించారు. తదుపరి చర్యగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించి వాటి పరిష్కార వివరాలతో కేబినెట్ నోట్ మరియు బిల్లు తయారీ జరిగింది.[9] ఆ తరువాత రాష్ట్రపతి పంపిన ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును [10]. శాసనసభ,శాసనమండలిలో సుదీర్ఘ చర్చల పూర్తికాకముందే ఒకవారం పొడిగించిన గడువు ముగిసే సందర్భంలో ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తిరస్కరించే తీర్మానం పై మూజువాణీ వోటుతో సభలు అమోదముద్ర వేశాయి.[11].2014, ఫిబ్రవరి 18న ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది[12].20 పిభ్రవరి న రాజ్యసభ ఆమోదం తెలిపింది. సీమాంధ్రకు న్యాయం చేయడానికి వెంకయ్యనాయుడు ప్రతిపాదించిన సవరణలను కొంత వరకు తృప్తిపరచే విధంగా ప్రధాని ఆరుసూత్రాల ప్యాకేజీని ప్రకటించిన పిదప, బిల్లుకు యథాతథంగా మూజువాణీ వోటుతో అమోదముద్ర పడింది [13]. 2014 జూన్ 2 న తెలంగాణ మరియు సీమాంధ్ర ప్రాంతాలు 2 క్రొత్త రాష్ట్రాలుగా ఏర్పడినవి[14]. కొన్ని 10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజన, షీలా భిడే కమిటీ సిఫారసుల మేరకు 9వ షెడ్యూల్‌లోని 40 సంస్థల విభజన మరి ఇతర సమస్యలు ఇంకా పరిష్కరించబడవలసినవున్నది.[15]
అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు
నీలం సంజీవరెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి. 1982 వరకు అన్నీ కాంగ్రెసు ప్రభుత్వాలే ఆంధ్ర ప్రదేశ్ ను పరిపాలించాయి. 1982 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలము పనిచేశాడు. ఆయన తరువాత పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేసారు. తరువాతి కాలంలో ఆయన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసారు.
అయితే 1982 వరకు రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెసుకు ఉన్న బలాన్ని సవాలు చేయటానికి నందమూరి తారక రామారావు అదే సంవత్సరములో తెలుగుదేశం అనే పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. స్థాపించిన తొమ్మిది నెలలలోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టడంతో ఒక బుడతడి దెబ్బకు వస్తాదు కుప్పకూలినట్లయింది.
2004 అసెంబ్లీ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెసు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధృతంగా పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి పోటీ చేసింది. కాంగ్రెసు, తెరాస కూటమి పదవిలోకి రావడంతో, కాంగ్రెసుకు చెందిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్ళ అనతరం 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ, తెరాస, ఉభయ కమ్యూనిష్టు పార్టీలు కలిసి మహాకూటమి తరఫున పోటీచేశాయి. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ, భారతీయ జనతా పార్టీలు కూడా పోటీచేయడంతో బహుముఖ పోటీలు జరిగాయి.సెప్టెంబరు 2, 2009న రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 నెలలు పాలించిన తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా మార్చడం జరిగింది . నల్లారి కిరణకుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం రాజీనామా చేయటంతో ఎన్నికలు దగ్గరబడుతున్నందున, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచటానికి ఆసక్తి చూపనందున రాష్ట్రపతిపాలన విధించబడింది [16].
భౌగోళిక పరిస్థితి


ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ముఖ్య ప్రాంతములు ఉన్నాయి. కోస్తా ఆంధ్ర, మరియు రాయలసీమ. రాష్ట్రములో 13 జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో ఎర్రటి నేలలు ఉండే మెట్ట భూములు, నల్లరేగడి నేలలు ఉండే డెల్టా భూములు ఉన్నాయి. రాయలసీమలో ఎర్రటి నేలలు ఉన్నాయి. ముఖ్య నగరాలు విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, ఏలూరు, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, గుంటూరు,ఒంగోలు, మరియు మచిలీపట్నం. గోదావరి, కృష్ణ వంటి మహానదులు రాష్టంలో ప్రవహించటంవలన కొన్ని లక్షల హెక్టేరుల భూమి సాగు చేయబడుతున్నది.[17]
జిల్లాలు

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు.
పంటలు
మెట్ట భూముల్లో ఆయిల్ పామ్, బత్తాయి, నిమ్మ, చెరుకు, కొబ్బరి, కొకొవా, జొన్న, దానిమ్మ, జామ, సపోటా, మిర్చి, ప్రత్తి, పొగాకు, కూరగాయలు వంటివి పండిస్తారు. డెల్టా ప్రాంతాల్లో వరి, కొబ్బరి, కూరగాయలు, పండిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతం చేపలు, రొయ్యలు సాగులో దేశంలోనే ప్రసిద్ధిగాంచింది.
రాష్ట్ర ప్రభుత్వము మరియు కార్య నిర్వహణ వ్యవస్థ
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అధినేత ముఖ్యమంత్రి కాగా, రాష్ట్ర పరిపాలన గవర్నరు పేరున జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ (దిగువ సభ) లో 175 స్థానాలు, విధాన మండలి (ఎగువ సభ)లో 56 స్థానాలు ఉన్నాయి.దీనికి తోడు, ఆంగ్లో-ఇండియన్ వర్గం నుంచి ఒకరిని శాసన సభకు నామినేటు చేస్తారు.ఆ రకంగా శాసన సభలో సభ్యుల సంఖ్య 175. ఆంధ్ర ప్రదేశ్ కు పార్లమెంటులో 36 స్థానాలు ఉన్నాయి. (లోక్ సభలో 25 మరియు రాజ్య సభలో 11). ఎలెక్ట్రానిక్ సాంకేతివ్యవస్థ ఉపయోగించి ఈ-ప్రభుత్వపాలన ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించటానికి అంతర్జాలంలో ఏపీ ఆన్ లైన్ అనే జాలస్థలి[18]కలిగివుంది. విభజన తర్వాత నారా చంద్రబాబునాయుడు 2014, జూన్ 8 న నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర 1వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.
రాష్ట్ర గుర్తులు
విభజన తర్వాత రాష్ట్ర పక్షి రామచిలుక, రాష్ట్ర చెట్టుగా వేపచెట్టు, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పువ్వుగా మల్లెపువ్వు నిర్ణయించారు. ఇవి జూన్ 6. 2018 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చాయి.[19]
| విభాగం | పేరు | మాధ్యమం (అనుకూలమైతే) |
|---|---|---|
| రాష్ట్ర భాష | తెలుగు | |
| రాష్ట్ర గుర్తు | పూర్ణఘటం |
|
| రాష్ట్ర గీతం | మా తెలుగు తల్లికి మల్లె పూదండ | |
| రాష్ట్ర జంతువు | కృష్ణ జింక | ![]() |
| రాష్ట్ర పక్షి | రామచిలుక | |
| రాష్ట్ర వృక్షం | వేప చెట్టు | ![]() |
| రాష్ట్ర ఆట | చెడుగుడు | ![]() |
| రాష్ట్ర నృత్యం | కూచిపూడి | ![]() |
| రాష్ట్ర పుష్పము | మల్లె పువ్వు | |
| రాష్ట్ర జల చరము | డాల్ఫిన్ | ![]() |
భాష-సంస్కృతి
తెలుగు రాష్ట్ర అధికార భాష. కవిత్రయమని పేరుగన్న నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ మహా భారత కావ్యాన్ని తెలుగులోకి అనువదించారు. మహా భాగవతమును బమ్మెర పోతన అనువదించాడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు విశ్వనాథ సత్యనారాయణ, మొదలైనవారు తెలుగులో ఆధునిక రచయితలు. ఆంధ్ర ప్రదేశ్ కు గొప్ప సాంస్కృతిక వారసత్వము ఉంది. అన్నమాచార్య, త్యాగరాజు, రామదాసు తదితర గొప్ప కర్ణాటక సంగీతకారులు తెలుగు భాషలో కృతులు రచించి, భాషను సుసంపన్నం చేశారు. కూచిపూడి రాష్ట్ర శాస్త్రీయ నృత్యం. అలాగే నటరాజ రామకృష్ణ గారి కృషి వల్ల ఆంధ్రనాట్యం కూడా ప్రజాదరణ పొందింది. ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ నగరం తప్ప మిగిలిన ప్రాంతాల్లో గ్రామీణ సంస్కృతి కనిపిస్తుంది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కొనసాగుతున్నది. ముస్లిముల జనాభా ఆంధ్ర ప్రాంతంలో చాలా తక్కువగా ఉంది.
నృత్యము

భారతదేశంలో ప్రముఖ నృత్యాల్లో ఒకటైన కూచిపూడి నాట్యానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాకు చెందిన కూచిపూడి గ్రామం పుట్టినిల్లు. కూచిపూడి గ్రామంలో ప్రారంభమైన ఈ నృత్యరీతి ఆంధ్ర ప్రదేశ్ మొత్తానికే కాక దేశవిదేశాల్లో ఎందరెందరో నేర్చుకుని ప్రదర్శించే స్థాయికి ఎదిగింది. కూచిపూడి వారు ప్రదర్శించే నృత్యనాటికలు భామా కలాపం, గొల్ల కలాపం వంటివి తెలుగు వారి సంస్కృతిలో భాగంగా నిలుస్తున్నాయి. దేవదాసీలు మాత్రమే ప్రదర్శిస్తూ ఆచారవంతులైనవారు నృత్యకారులను పంక్తిబాహ్యులని భావించే స్థితిలో కేవలం బ్రాహ్మణ పురుషులే అన్ని వేషాలు వేస్తూ, విద్యావంతులైన వారితో కూచిపూడి నృత్యరీతిని సిద్దేంద్ర యోగి వ్యవస్థాపించారు. కాలక్రమేణా నృత్యరీతి తెలుగువారి సంస్కృతిలో ముఖ్యభాగమైంది. 1950 నాటికి స్థానికంగా ఉండిపోయిన దీనికి జాతీయ స్థాయిలో మెప్పును, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపునూ తీసుకురావడానికి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి స్త్రీలను ప్రవేశపెట్టడం వంటి ప్రయత్నాలు చేసి యావజ్జీవితాన్ని కళకు అంకితం చేశారు.[20] వంటివాటిని పునరుద్ధరించడంలో ప్రముఖ నృత్యకళాకారులు నటరాజ రామకృష్ణ ఎనలేని కృషి చేశారు. దేవదాసీల ప్రదర్శనల్లో విలసిల్లి క్రమంగా దేవదాసీ వ్యవస్థతో పాటుగా అంతరించిపోతున్న నృత్యరీతులను, లక్షణ గ్రంథాల్లో సైద్ధాంతికంగా ఉండి ప్రయోగంలో తరతరాల నుంచి లేని నృత్యరీతులను దేవాలయల్లోని ప్రతిమల నాట్యభంగిమలను లక్షణ గ్రంథాలతో కలిపి అధ్యయనం చేసి అపూర్వరీతిలో ఆంధ్ర నాట్యం పేరిట పున:సృజించారు.[21]
సినిమా
తెలుగు సినిమా రంగంలో నటులు, నటీమణులు, దర్శకులు, నిర్మాతలు, గాయనీ గాయకులు ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికి చెందినవారే. రాష్ట్రం నుండి ఉద్భవించిన కొందరు ప్రముఖ సినీ కళాకారులు నాగయ్య, ఎన్.టి.రామారావు (మాజీ ముఖ్యమంత్రి), అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు ("ఎస్.వి.అర్) జగ్గయ్య, కృష్ణంరాజు, సాగి రాజన్ రాజు (ముక్కురాజు), శొభన్ బాబు, ఘంటసాల,ఎస్.పి.బాలసుబ్రమణ్యం, సుశీల, జానకి, సావిత్రి, భానుమతి, అంజలి జమున, శారద, షావుకారు జానకి, వాణిశ్రీ, ఎల్.వి.ప్రసాద్, కె.వి.రెడ్డి, బి.యన్.రెడ్డి, బి.నాగిరెడ్డి, బాపు, రాజేంద్ర ప్రసాద్, చిరంజీవి, జయప్రద మొదలైనవారు. హిందీ సినిమా రంగంపై తెలుగు కళాకారుల హవా మరియు ప్రత్యేకమైన ముద్ర గలదు.
ఇతర కళలు

విశాఖపట్నం జిల్లాలో ఏటి కొప్పాక అను గ్రామంలో ఇప్పటికీ చెక్క బొమ్మలు తయారగుచున్నవి. కృష్ణాజిల్లాలో కొండపల్లి అను గ్రామంలో కొండపల్లి బొమ్మలు తయారగుచున్నవి.
విద్యారంగము
ప్రధాన వ్యాసం: ఆంధ్ర ప్రదేశ్ లో విద్య
ఆంధ్ర ప్రదేశ్ లో విద్యా నిర్వహణ ప్రభుత్వ శాఖలద్వారా జరుగుతుంది.
- పాఠశాల విద్యాశాఖ [22]
- ఇంటర్ మీడియట్ విద్యా మండలి.[23]
- సాంకేతిక విద్యా మండలి[24]
- ఉన్నత విద్యా పరిషత్ [25]
పర్యాటక రంగము
- ఆంధ్ర ప్రదేశ్ లో తిరుపతి, ద్వారక తిరుమల (చిన్న తిరుపతి), శ్రీశైలం, శ్రీ కాళహస్తి, సింహాచలము, అన్నవరం, అహొబిలము, మహానంది, కానిపాకం, విజయవాడ లో దుర్గ గుడి, గుణదల మేరీ మాత, గౌరీపట్నంలో నిర్మలగిరి మాత మొదలైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తిరుపతి లోని తిరుమల తిరుపతి దేవస్థానము ప్రపంచములోకెల్లా ఐశ్వర్యవంతమైన హిందూ దేవాలయము. ఇవే కాకుండా పంచారామాలు కూడా ఉన్నాయి.
- విశాఖపట్నం, పేరిపాలెం, గొల్లపాలెం, మచిలీపట్నం వంటి ఎన్నో బీచ్ లు ఉన్నాయి.
- పాపి కొండలు, బొర్రా గుహలు, అరకు లోయ, లంబసింగి వంటి ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక అభివృద్ధి సంస్థ రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ముఖ్య పాత్ర వహిస్తున్నది.
ఇవికూడా చూడండి
- ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
- ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
- హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు
- ఆంధ్ర ప్రదేశ్ అవతరణ(విశాలాంధ్ర)
- ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014
- తెలంగాణ
- ఇటీవలి చరిత్ర
- ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు
- ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు
- ఆంధ్రప్రదేశ్ జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నాలు
- సుప్రసిద్ధ ఆంధ్రులు
- ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు
- ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్లు
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు
- ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
- ఆంధ్ర ప్రదేశ్ రెవిన్యూ డివిజన్లు
- ఆంధ్ర ప్రదేశ్ మండలాలు
- ఆంధ్ర ప్రదేశ్ జనాభా గణాంకాలు
- జాతీయ రహదారులు
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆనకట్టలు మరియు జలాశయాలు జాబితా
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)
- ఆంధ్ర ప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2009-10
- ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ
- ఆంధ్ర ప్రదేశ్ నగరాల మధ్య దూరం
- ఆంధ్రప్రదేశ్-తెలంగాణా రాష్ట్రాల్లోని నగరాల మధ్య దూరం
మూలాలు
- "Socio-economic Survey 2016–17" (PDF). AP State Portal. Government of Andhra Pradesh. p. 3. Retrieved 21 Mar 2019.
- "Andhra Pradesh Economy in Brief 2019" (PDF). Official portal of Andhra Pradesh Government. Government of Andhra Pradesh. 2019-02-18. Archived from the original (PDF) on 2019-03-21.
- "Andhra Pradesh Budget Analysis 2018–19" (PDF). PRS Legislative Research. Retrieved 10 March 2018.
- Maitreyi, M. L. Melly (14 December 2017). "No official State song for WTC". The Hindu (in ఆంగ్లం). The Hindu Group.
- "Andhra Pradesh gets new state bird, state flower". Deccan Chronicle (in ఆంగ్లం). 31 May 2018.
- "శాస్త్రోక్తంగా.. అమరావతి శంకుస్థాపన". web.archive.org. Sep 10, 2015. Retrieved March 24, 2016.
- ఖన్నా, సాక్షి. "Andhra Pradesh's New Assembly Building Ready to Handle Unruly Scenes With Ease". www.news18.com. Archived from the original on 2017-03-03. Retrieved 12 April 2018.
- "డిపార్ట్మెంట్ ఆఫ్ లాండ్ రిసోర్సెస్ వారి పరిశోధన" (PDF). Archived from the original (PDF) on 2013-03-21.
- "ముగిసిన కేబినెట్, తెలంగాణ నోట్‌కు ఆమోదం". వన్ ఇండియా. Sep 3, 2013. Archived from the original on 2018-03-21. Retrieved 2014-01-31.
- "ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు". సూర్య. 2013-12-16. Retrieved 2014-01-31.
- "టీ-బిల్లుకు అసెంబ్లీ తిరస్కారం". సూర్య. 2014-01-31. Retrieved 2014-01-31.
- "జయహో తెలంగాణ". సూర్య. 2014-02-19. Retrieved 2014-02-19.
- "తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.29వ రాష్ట్రంగా..." వెబ్ దునియా. 2014-02-20. Archived from the original on 2014-03-03. Retrieved 2014-02-24.
- "జూన్ 2న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) ఆవిర్భావం". వార్త. 2014-03-05. Retrieved 2014-03-06.
- "విభజన సమస్యలపై మళ్లీ భేటీ !". 2018-04-29. Archived from the original on 2018-05-18.
- "రాష్ట్రపతి పాలనపై ప్రజలకు గవర్నర్: కిరణ్ నిర్ణయాలపై..." వన్ ఇండియా. 2014-03-02. Archived from the original on 2016-03-14. Retrieved 2014-03-06.
- ఎస్.వి., నరసయ్య (1953). ఆంధ్ర ప్రజలు-సిరిసంపదలు. Retrieved 2018-05-14.
- "AP Online Portal". 2001-12-18. Archived from the original on 2001-12-18.
- Suvarnaraju. "ఆంధ్రప్రదేశ్:రాష్ట్ర చిహ్నాలు ఖరారు...ఉత్తర్వులు జారీ". oneindia. Archived from the original on 2019-02-10. Retrieved 2018-06-12.
- చిన సత్యం, వెంపటి. "కూచిపూడి నృత్యం - ఆవిర్భావ వికాసం వివరాలు". Retrieved 1 January 2015.
- "నాట్యకళాతృష్ణ.. నటరాజ రామకృష్ణ". సూర్య. సూర్య. March 11, 2011. Retrieved 1 January 2015.
- "CSE Portal". Retrieved 2019-03-21.
- ఇంటర్ మీడియట్ విద్యా మండలి వెబ్ సైటు
- సాంకేతిక విద్యా మండలి వెబ్ సైటు
- ఉన్నత విద్యా పరిషత్ వెబ్ సైటు
బయటి లింకులు
- ఏపీ ఆన్లైన్: అధికారిక ఆంధ్ర ప్రదేశ్ అంతర్జాల గవాక్షము
- ఏపీ పోర్టల్ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ )
- ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అంతర్జాల డాష్‌బోర్డ్
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంతర్జాలం
- ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలనా శాఖ (జిఎడి)
- ప్రసిద్ధ ఆంధ్రుల జాబితా
- ఆంధ్ర ప్రదేశ్ హ్యూమన్ డవలప్మెంట్ రిపోర్ట్ 2007



-_Male_%26_female_in_Hyderabad%2C_AP_W_IMG_7268.jpg)



