ఆంధ్రుల సాంఘిక చరిత్ర

ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథాన్ని ప్రముఖ సంపాదకుడు, చరిత్ర కారుడు, రచయిత సురవరం ప్రతాపరెడ్డి సుమారు 20 సంవత్సరాల పాటు చేసిన పరిశోధన చేసి రచించాడు. రెండు వేలయేళ్ళుగా వివిధ సాహిత్య ఆకరాలను ఆధారం చేసుకుని కొంతవరకూ పురావస్తువులతో సరిచూసుకుని రచించిన సాంఘిక చరిత్ర ఇది. రాజుల చరిత్ర కాక ప్రజల చరిత్రకు ఇది ప్రాధాన్యం ఇస్తుంది.

ఆంధ్రుల సాంఘిక చరిత్ర
పుస్తక ముఖచిత్రం.
కృతికర్త: సురవరం ప్రతాపరెడ్డి
ముద్రణల సంఖ్య: 3
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: చరిత్ర
ప్రచురణ:
విడుదల: 1949, 1950, 1982
ప్రచురణ మాధ్యమం: ముద్రణ

రచన నేపథ్యం

దీన్ని 1949 లో మొదటిసారి ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రకటించింది. ఆ తరువాత ఈ గ్రంథాన్ని అనేక ముద్రణల తరువాత విశాలాంధ్ర తిరిగి ముద్రించింది. కేంద్ర సాహిత్య అకాడెమీ భారతీయ భాషలకు ఇచ్చే జాతీయ బహుమతిని తెలుగులో మొదటిసారి ఈ గ్రంథానికి ఇచ్చింది. ఆంధ్ర ప్రజల ఆచార వ్యవహారాలు, ఆహార విహారాలు, ఆటపాటలు మొదలైన వాటికి చోటు ఇచ్చింది. అనేక భారతీయ భాషల లోకి ఇది అనువాదమైంది. దీనిని సురవరము ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి, హైదరాబాదు వారు 1982 సంవత్సరంలో మూడవసారి 2000 కాపీలు ముద్రించారు.
ప్రతాపరెడ్డి గ్రంథానికి ముందుమాటలో తనకు పూర్వమే ఈ విషయాన్ని భావన చేసి అలాంటి ప్రయత్నాలు చేసినవారి పేర్లు ప్రస్తావించారు. చిలుకూరి వీరభద్రరావు తన ఆంధ్రుల చరిత్రము గ్రంథంలోని వెలమవీరుల చరిత్ర ప్రకరణంలో పుట అడుగున "ఆంధ్రుల సాంఘిక చరిత్ర ప్రత్యేకంగా విరచింపబడుతున్నది. కావున ఈ విషయమై(వెలమాది జాతుల సంగతి) అందు సవిస్తరంగా చర్చింపబడుతున్నది" అన్నారు.[1] దాని ఆధారంగా చూస్తే వీరభద్రరావు కొంతవరకూ ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాసే ప్రయత్నం ప్రారంభించి ఏవో కారణాంతరాల వల్ల నిలిపివేసి ఉండొచ్చని ప్రతాపరెడ్డి భావించారు.[2] ఆంధ్రుల సాంఘిక చరిత్రకు సంబంధించి ప్రఖ్యాత చారిత్రికులు నేలటూరి వెంకట రమణయ్య ఆంగ్లవ్యాసం రచిస్తే, మల్లంపల్లి సోమశేఖర శర్మ తమ రెడ్డి రాజ్యాల చరిత్రలో సాంఘిక చరిత్రను కూడా చేర్చారు. ఇలా కొందరు చారిత్రికులు ఆ ఆలోచన ప్రతిపాదించి, మరికొందరు కొంత కృషిచేసినా పూర్తిస్థాయిలో ఆంధ్రుల సాంఘిక జీవన చరిత్ర రచనలో ఇదే మొదటి గ్రంథంగా పేర్కొంటున్నారు.

బయటి లింకులు

మూలాలు

  1. ఆంధ్రుల చరిత్రము:చిలుకూరి వీరభద్రరావు:వెలమవీరుల చరిత్ర ప్రకరణం ప్రారంభంలో
  2. ఆంధ్రుల సాంఘిక చరిత్ర:సురవరం ప్రతాపరెడ్డి:ప్రథమ ముద్రణ పీఠికలో
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.