అల్లు రామలింగయ్య

అల్లు రామలింగయ్య (అక్టోబర్ 1, 1929 - జూలై 31, 2004) ప్రముఖ సినీ నటుడు, నిర్మాత. ఆయన హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. ఆయన కుటుంబ సభ్యుల్లో చాలామంది సినీ పరిశ్రమకు చెందినవారే. ఆయన కుమారుడు అల్లు అరవింద్ ప్రముఖ సినీ నిర్మాత. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడైన చిరంజీవి ఆయన అల్లుడు.

అల్లు రామలింగయ్య
జననంఅల్లు రామలింగయ్య
అక్టోబర్ 1, 1929
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు
మరణంజూలై 31, 2004
హైదరాబాద్, తెలంగాణ
వృత్తినటుడు, నిర్మాత
మతంహిందూ
జీవిత భాగస్వామికనకరత్నం
పిల్లలుఅల్లు అరవింద్
కొణిదల సురేఖ
తల్లిదండ్రులు
  • వెంకన్న (తండ్రి)
  • సత్తెమ్మ (తల్లి)

బాల్యము

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1922 అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జన్మించాడు.[1] ఆయన తాత అల్లు సుబ్బారాయుడు హయాంలో వీరికి చాలా ఆస్తులు ఉండేవి. ఆయన దాన గుణం వల్ల అవి కరిగిపోయాయి. ఆయన కుమారుడు అల్లు వెంకయ్య మరల వ్యవసాయం చేసి మళ్ళీ నిలదొక్కుకున్నాడు. వెంకయ్య సతీమణి సత్తెమ్మ. వీరికి నరసయ్య మూర్తి, నారాయణ మూర్తి, చంటి, రామలింగయ్య, కృష్ణారావు, సూర్యనారాయణ, సత్యవతి మొత్తం ఏడు మంది సంతానం. పాలకొల్లులో ఉన్న క్షీర రామలింగేశ్వర స్వామి గుర్తుగా కొడుక్కి రామలింగయ్య ని పేరు పెట్టుకున్నారు.

రామలింగయ్యకు చదువు పెద్దగా అబ్బలేదు. తన సహచరులతో కలసి ఆకతాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవాడు. ఇదే క్రమంతో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం పెరిగింది. ఊళ్లోకి ఎవరు నాటకాల వాళ్ళు వచ్చినా వారి వెంటే తిరుగుతూ ఉండేవాడు. వాళ్లతో స్నేహం చేయడం, ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగడం నిత్యకృత్యంగా చేసుకున్నాడు. ఎట్టకేలకు భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. అదీ మూడు రూపాయలు ఎదురిచ్చేట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వేసాడు. నాటకానుభవం పెద్దగా లేకున్నా కొద్దిపాటి నటనావగాహనతో తన వేషం మెప్పించాడు. ఆ తరువాత ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసి వాటిని అమ్మి నాటక కాంట్రాక్టరుకు ఇచ్చాడు. అలా మొదలైంది అల్లు నట జీవితం.

అల్లు నాటకాల్లో నటిస్తూనే, తన సామాజిక బాధ్యతను గుర్తెరిగి గాంధీజీ పిలుపునందుకుని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్లాడు. జైలులో కూడా తోటివారిని పోగేసుకుని నాటకాలాడేవాడు. మరోవైపు అంటరానితనంపై పోరు సలిపాడు.[2]

చలనచిత్ర జీవితం

అల్లు నాటాకాలు చూసిన గరికపాటి రాజారావు చిత్రసీమలో తొలిసారిగా 1952లో పుట్టిల్లు చిత్రంలో కూడు-గుడ్డ శాస్త్రి తరహా పాత్రను అల్లుచే వేయించాడు. ఆ తరువాత హెచ్.ఎం.రెడ్డి వద్దంటే డబ్బులో అవకాశం వచ్చింది.

పుట్టిల్లు చిత్రం నిర్మాణకాలంలో తన భార్యా నలుగురు పిల్లలతో మదరాసుకు మకాం మార్చాడు. అల్లు తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డాడు. మరోవైపు హోమియో వైద్యం నేర్చుకున్న అల్లు ఏమాత్రం తీరిక దొరికినా ఉచిత వైద్యసేవ లందించేవాడు.

ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో చిత్రసీమలో నిలద్రొక్కుకున్నాడు. అల్లు హాస్యపు జల్లునేకాదు కామెడీ విలనిజాన్ని కూడా బగా రక్తి కట్టించాడు. అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గవి మూగమనసులు, దొంగరాముడు, మాయా బజార్, ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాలరాముడు, శంకరాభరణం మొదలైనవి ఉన్నాయి. ముత్యాలముగ్గు సినిమా చిత్రీకరణకు ముందు ఆయన కుమారుడు ఆకస్మికంగా మరణించినా బాధను మనసులో అణుచుకుని షూటింగ్‌లో పాల్గొన్నాడు అల్లు. సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసాడు. 1116 చిత్రాల్లో నటించాలనే కోరిక ఆయనకు తీరలేదు. ఆతను అభినయించిన చాలా పాటలకు బాలు గళం సరిగా అమరి పోయింది. మనుషులంతా ఒక్కటే చిత్రంలో ముత్యాలు వస్తావా అడిగిందీ ఇస్తావా అనే పాట అప్పట్లో హిట్.

అల్లు రామలింగయ్య నిర్మాతగా గీతా ఆర్ట్స్ బానర్‌ నెలకొల్పి బంట్రోతు భార్య, దేవుడే దిగివస్తే, బంగారు పతకం చిత్రాలను నిర్మించాడు. చాలాకాలం తర్వాత అల్లు 90 దశకంలో డబ్బు భలే జబ్బు చిత్రం తీసాడు. రేలంగి, రమణారెడ్డి, కుటుంబరావు, బాలకృష్ణ వంటివారి కాలంతో మొదలు ఈతరం హాస్యనటులు వరకూ కొనసాగిన ఏకైక హాస్యనటుడు అల్లునే. ఆమ్యామ్య.. అప్పుం అప్పుం లాంటి ఊతపదాలు ఆయన సృష్టించినవే.

పురస్కారాలు, సన్మానాలు

యాబైయేళ్లపాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ తెలుగు ప్రజానీకాన్ని అలరించిన అల్లును వరించిన సన్మానాలు, గౌరవాలు, అవార్డులు అసంఖ్యాకమైనవి. భారత ప్రభుత్వం 1990లో ' పద్మశ్రీ ' అవార్డుతో గౌరవించింది. రేలంగి తరువాత ' పద్మశ్రీ' అందుకున్న హాస్యనటుడు అల్లునే.

2001 వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత ' రఘుపతి వెంకయ్య ' అవార్డు ఇచ్చింది. పాలకొల్లులో ఆయన విగ్రహం నెలకొల్పారు. తన కొడుకు అల్లు అరవింద్ నిర్మాతగా స్థిరపడటం, అల్లుడు చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడం, మనవడు అల్లు అర్జున్ హీరోగా మారడం అయనకు జీవితంలో సంతృప్తినిచ్చిన అంశాలు. అతని చివరి చిత్రం 'జై '

అల్లు రామలింగయ్య 2004 జూలై 31 వ తేదీన తన 82 వ ఏట కన్నుమూసాడు. మరణించేనాటికి తెలుగు చిత్రసీమలో అల్లురామలింగయ్యది ప్రత్యేక స్థానం. భౌతికంగా లేకపోయినా ఆయన హాస్యం చిరంజీవిగా ప్రజల్ని అలరిస్తూనే ఉంటుంది. 2013లో భారత చలనచిత్ర పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలయిన 50 తపాలా బిళ్ళలలో ఒకటి అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం విడుదలయింది.

అల్లు రామలింగయ్య జ్ఞాపకార్ధం విడుదలయిన తపాలాబిళ్ళ

నటించిన సినిమాలు

సంఖ్యసినిమా పేరుసంవత్సరం
01ఇంద్ర2002
02దేవుళ్ళు2001
03మావిచిగురు1996
04అల్లుడా మజాకా1995
05ముఠామేస్త్రి1993
06ఆ ఒక్కటి అడక్కు1993
07మెకానిక్ అల్లుడు1993
08పరుగో పరుగు1993
09ఆపద్భాందవుడు1992
10అశ్వమేధం1992
11పెద్దరికం1992
12రౌడీ అల్లుడు1991
13నా పెళ్ళాం నా ఇష్టం1991
14గ్యాంగ్ లీడర్1991
15రాజా విక్రమార్క1990
16కొదమ సింహం1990
17జగదేక వీరుడు అతిలోక సుందరి1990
18కొండవీటి దొంగ1990
19స్టేట్‌రౌడి1989
20అత్తకు యముడు అమ్మాయికి మొగుడు1989
21చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం1989
22ఖైదీ నెం. 7861988
23యముడికి మొగుడు1988
24మంచి దొంగ1988
25ఆఖరిపోరాటం1988
26దొంగ రాముడు1988
27దొంగ మొగుడు1987
28చంటబ్బాయ్1986
29మగధీరుడు1986
30కిరాతకుడు1986
31రావణబ్రహ్మ1986
32విజేత1985
33అడవిదొంగ1985
34ఒక రాధ ఇద్దరు కృష్ణులు1985
35జ్వాల1985
36దొంగ1985
37చట్టంతో పోరాటం1985
38ముచ్చటగా ముగ్గురు1985
39కంచు కాగడా1984
40గూండా1984
41ముందడుగు1983
42బిల్లా రంగా1982
43న్యాయం కావాలి1981
44అందగాడు1981
45నిరీక్షణ1981
46సప్తపది1981
47మోసగాడు1980
48అండమాన్ అమ్మాయి1979
49మా ఊళ్ళో మహాశివుడు1979
50చిరంజీవి రాంబాబు1978
51అర్ధాంగి1977
52ఈనాటి బంధం ఏనాటిదో1977
53కల్పన1977
54పూర్ణమ్మ కథ1976
55సెక్రటరి1976
56అందరూ బాగుండాలి1975
57జేబు దొంగ1975
58యమగోల1975
59ఊర్వశి1974
60దేవదాసు1974
61అల్లూరి సీతారామరాజు1974
62విచిత్ర బంధం1972
63తాతా మనవడు1972
64సంబరాల రాంబాబు1970
65మారిన మనిషి 1970
66నిండు హృదయాలు1969
67రణభేరి1968
68వింత కాపురం1968
69ఆత్మ గౌరవం1965
70నర్తనశాల1963
71ఇద్దరు మిత్రులు1961
72సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి1960
73ధర్మమే జయం1960
74మా బాబు1960
75ఆడ పెత్తనం1958
76ఇంటిగుట్టు1958
77పరాశక్తి1957
78భాగ్యరేఖ1957
79వరుడు కావాలి1957
80దొంగరాముడు1955
81మిస్సమ్మ1955
82పల్లెపడుచు1954

మూలాలు

  1. సి, శ్రీకాంత్ కుమార్ (2010). అల్లు రామలింగయ్య జీవిత చిత్రం. విజయవాడ: ఋషి బుక్ హౌస్. p. 12.
  2. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రాలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 98. |access-date= requires |url= (help)

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.