అంటువ్యాధి

అంటువ్యాధి
Infectious disease
Classification and external resources
A false-colored electron micrograph shows a malaria sporozoite migrating through the midgut epithelia.
ICD-10A00-B99
ICD-9001-139
MeSHD003141

పేర్లు, అర్థాలు

ఇంగ్లీషులో ఇన్ఫెక్షస్, కంటేజియస్ (infectious, contagious) అని రెండు మాటలు ఉన్నాయి. వీటి అర్థంలో పోలిక ఉంది కానీ ఈ రెండూ రెండు విభిన్నమైన భావాలని చెబుతాయి. ఒక ప్రియాను (prion) వల్ల కాని, వైరస్ (virus) వల్ల కాని, బేక్టీరియం (bacterium) వల్ల కాని, ఫంగస్ (fungus) వల్ల కాని, పేరసైట్ (parasite) వల్ల కాని వచ్చే రోగాలని “ఇన్ఫెక్షస్ డిసీజెస్” (infectious diseases) అంటారు. అంటే, మన శరీరానికి “స్వంతం” కాని లాతి పదార్ధాలు శరీరంలోకి ప్రవేశించి రోగకారకులు అయినప్పుడు “ఇన్ఫెక్షన్” (infection) అన్న మాట వాడతాం. ఒక జీవి నుండి మరొక జీవికి అంటుకునే రోగాలని “కంటేజియస్ డిసీజెస్” (contagious diseases) అని కాని, “కమ్యూనికబుల్ డిసీజెస్” (communicable diseases) అని కాని, “ట్రాన్స్ మిసిబుల్ డిసీజెస్” (transmissible diseases) అని కాని అంటారు.

“సి. జె. డి.” (CJD) అనే జబ్బు ఉంది. ఇది ప్రియానులు మన శరీరంలో జొరబడ్డం వల్ల వస్తుంది. కాని ఇది ఒకరి నుండి మరొకరికి అంటుకోదు. అంటే ఈ “సి. జె. డి.” (CJD) జబ్బుతో తీసుకుంటూన్న వ్యక్తి దరిదాపుల్లోకి వెళ్లినంత మాత్రాన ఆ జబ్బు మనకి అంటుకోదు. కనుక ఇది “ఇన్ఫెక్షస్ డిసీజ్” (infectious disease) మాత్రమే. దోమకాటు వల్ల మనకి సంక్రమించే మలేరియా వంటి రోగం కూడా “ఇన్ఫెక్షస్ డిసీజ్” కోవకే చెందుతుంది.

కాని మలేరియా కేవలం ఒకరిలో తిష్ట వేసుకుని ఉండిపోదు కదా. మలేరియా ఉన్న రోగిని కరిచిన దోమ మరొకరిని కరిస్తే ఆ రెండవ వ్యక్తికి మలేరియా వచ్చే సావకాశం ఉంది. ఈ దృష్టితో చూస్తే మలేరియాని “కంటేజియస్” అని అనుకోవచ్చు. ఈ వ్యత్యాసం ఇన్^ఫ్లుయెంజా విషయంలో స్పుటంగా కనిపిస్తుంది. ఇన్^ఫ్లుయెంజా లేదా ఫ్లు (influenza or flu) ఇన్ఫెక్షస్ మాత్రమే కాకుండా కంటేజియస్ కూడా! ఎందుకంటే ఒకరికి ఫ్లూ వస్తే వారికి సమీపంలో ఉన్న మరొకరికి గాని, వారిని తాకిన వారికి గాని అంటుకునే సావకాశం బాగా ఉంది. కనుక ఈ రెండు రకాల రోగాల మధ్య ఒక గీత గీసి ఒక పక్క ఇన్ఫెక్షస్ మరొక పక్క కంటేజియస్ అని నిర్ద్వందంగా చెప్పటం కొంచెం కష్టం.

తిష్ట వ్యాధులు

ఇన్ఫెక్షన్ లు ఎన్నో విధాలుగా రావచ్చు, కాని అన్ని ఇన్ఫెక్షన్ లూ అంటుకోవు. మరొక విధంగా చెప్పాలంటే సూక్ష్మజీవులు మన శరీరంలో ప్రవేశించి అక్కడ తిష్ట వేస్తే అది ‘తిష్ట’ (లేదా, ఇన్ఫెక్షన్), దాని వల్ల వచ్చే రోగం తిష్ట రోగం (infectious disease). ఈ రోగం ఒకరి నుండి మరొకరికి అంటుకుంటే అది ‘అంటు’ (లేదా, కంటేజియన్), దాని వల్ల వచ్చే రోగం అంటురోగం (contagious disease). ఇప్పుడు తిష్టతత్త్వం అంటే ఇన్ఫెక్షస్ (infectious), అంటుతత్త్వం అంటే కంటేజియస్ (contagious) అని మనం తెలుగులో వాడుకోవచ్చు.

తిష్టతత్త్వం గురించి మరికొంచెం తెలుసుకుందాం. తిష్టకి అనేక కారణాలు ఉన్నా ముఖ్యంగా చెప్పుకోవలసినవి బేక్టీరియంలు, వైరసులు. ఉదాహరణకి క్షయ బేక్టీరియం వల్ల వచ్చే తిష్ట వ్యాధి. జలుబు, ఆటలమ్మ, మశూచికం, “ఎ. ఐ. డి. ఎస్.” (AIDS), మొదలైనవి వైరస్ వల్ల వచ్చే తిష్ట వ్యాధులు.

ఈ సందర్భంలో సమీపార్థాన్ని ఇచ్చే మరొక ఇంగ్లీషు మాట “ఇన్ఫెస్టేషన్” (infestation). సూక్ష్మ జీవుల వల్ల కాకుండా మరికొంచెం “పెద్ద జీవుల” వల్ల ప్రాప్తించే తిష్టని “ఇన్ఫెస్టేషన్” అంటారు. ఈ మాటని రెండు సందర్భాలలో వాడతారు. ఒకటి, క్రిములు, కీటకాలు, మిడతలు, వగైరా ఒక ప్రదేశాన్ని ఆక్రమించేసిన సందర్భం. రెండు, పరాన్నభుక్కులు (parasites) శరీరం మీద కాని (పేలు, నల్లులు, వగైరా), ఆహారనాళంలో కాని (నులి పురుగులు, బద్దీ పురుగులు, వగైరా) చేరినప్పుడు. ఈ భావంతో సరితూగే తెలుగు మాట ఉందో? లేదో?

ఒక ప్రాంతంలో త్వరగా రివాజుగా వ్యాపించే అంటువ్యాధుల్ని మహమ్మారి (Epidemic) అంటారు. అలాగే ప్రపంచం అంతా వ్యాపించిన మహమ్మారిని ప్రపంచమారి (Pandemic) అంటారు.

అంటు వ్యాధులు

రోగగ్రస్థులైన వారితో అతిగా కలిసి ఉండటం వల్ల, పదే పదే రోగి శరీరమును తాకుతుండటం వల్ల, రోగులతో కలిసి భుజించడం వల్లనూ, రోగులతో పడుకోవడం వల్లను, రోగుల దగ్గర కూర్చుండటం వల్ల, రోగులు ధరించిన బట్టలను, వాడిన సబ్బు, తువ్వాలు, రోగులు వాడి మిగిల్చిన చందనాది లేపనాలను వాడటం వల్లనూ, అరోగ్యవంతులైన వారికి అంటు వ్యాధులు రోగుల నుంచి సోకుతాయి.

మశూచికము (స్ఫోటకము), కలరా, విషజ్వరము (ఇన్‌ఫ్లుయెంజా), సుఖ రోగములు, మొదలగు వ్యాధులు ఒకరి నుండి మరియొకరికి త్వరితంగా సంక్రమించును. కొన్నిఅంటు వ్యాధులు రోగి చుట్టూ ఉన్నవారికి అందరికీ అంటుకొనకపోవచ్చును. ఇంటిలో నొకనికి కుష్టు రోగముగాని, క్షయ వ్యాధి గాని ఉన్న యెడల, ఆ వ్యాధి ఆ యింటిలో అందరికి సంక్రమించక పోవచ్చును. ఇది అవతలి వ్యక్తికున్న రోగనిరోధక శక్తిమీద, సంక్రమణ రోగతీవ్రతమీద ఆధారపడి వుండును.

ముఖ్యమైన సూత్రాలు

ఒక వ్యాధి అంటు వ్యాధి యగునా కాదా అని తెలిసి కొనుటకు ఈ క్రింది 5 సూత్రములను గమనింప వలెను.

  1. ఒక వ్వాధిని పుట్టించు రోగకారకులు అదే వ్వాధిగల రోగులందరి శరీరముల యందును కనబడవలెను.
  2. ఇట్లు కనిపెట్టబడిన రోగకారకులను మనము ప్రత్యేకముగ తీసి, సాధారణంగా అవి తిను ఆహారము వానికి పెట్టి పెంచిన యెడల అవి తిరిగి పెరగవలెను.
  3. ఇట్లు పెంచిన రోగకారకులను వేరుపరచి వానిని ఆరోగ్యవంతులైన ఇతర మానవుల శరీరములో నెక్కించి నప్పుడు ఆ రోగకారకులు క్రొత్తవాని శరీరములో మొదటి రోగికుండిన రోగచిహ్నముల నన్నింటిని కనుబరచవలెను.
  4. ఈ రోగకారకులు తిరిగి మరియొకనికి ఇదే వ్వాధిని కలిగింప శక్తిగలవై యుండవలెను.

వైరస్ సంబంధిత అంటువ్యాధులు

బాక్టీరియా సంబంధిత అంటువ్యాధులు

శిలీంధ్ర సంబంధిత అంటువ్యాధులు

ప్రోటోజోవా అంటువ్యాధులు

పెంపుడుజంతువుల వల్ల కలిగే వ్యాధులు

పెంపుడు జంతువులద్వారా సుమారు 200 వ్యాధులు సోకే ప్రమాదం ఉందట. పెంపుడు జంతువులు, పక్షుల నుంచి సంక్రమించే జబ్బులను 'జూనోసిస్‌' వ్యాధులు అంటారు. జోసఫ్‌ ఫాస్టర్‌ అనే బాలుడు కుక్కకాటుతో రేబిస్‌ వ్యాధి బారిన పడ్డాడు. శాస్త్రవేత్త లూయిస్‌పాశ్చర్‌ ఆ వ్యాధి నిరోధక మందును కనుగొన్నారు. ఈ మందును బాలునికి 1885 జూలై 6న ఇచ్చి కాపాడారు. ఆ రోజు జ్ఞాపకార్థమే 'అంతర్జాతీయ జూనోసిస్‌ డే'గా నిర్వహిస్తున్నారు. కుక్కలవల్ల రేబిస్, టాక్సోకొరియాసిస్, పశువులవల్ల సాల్మనెల్లోసిస్‌, క్షయ, బద్దెపురుగులు (ఎకినోకోకోసిస్‌), పక్షులవల్ల సిట్టకోసిస్‌, బర్డ్‌ప్లూ, ఎలుకల వల్ల లిస్టీరియోసిస్‌, లెప్టోస్పైరోసిస్, గొర్రెల ద్వారా ఆంత్రాక్స్‌, పందుల వల్ల మెదడువాపు, కుందేళ్ల వల్ల లెఫ్టోస్పైరోసిస్‌ వస్తాయట.

మూలాలు

  • వేమూరి వేంకటేశ్వరరావు, మాటల జంటలు, చైతన్యం, ఆగస్టు 2015, chaitanyam.com
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.